Home Construction Loan: ఇంటి నిర్మాణం కోసం రుణమా..? పూర్తి వివరాలివిగో..!

నిర్మాణం పూర్తైన ఇంటికి, అలాగే నిర్మాణంలో ఉన్న ఇంటిని బిల్డర్‌ వద్ద నుంచి కొనుగోలు చేసినప్పుడు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మీ సొంత స్థలంలో మీరు ఇల్లు నిర్మించాలనుకున్నప్పుడు బ్యాంకులు రుణాలు ఇస్తాయా?

Updated : 21 Oct 2022 17:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటి కొనుగోలు కోసం బ్యాంకులు రుణం ఇస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. నిర్మాణం పూర్తయిన ఇంటిని, అలాగే నిర్మాణంలో ఉన్న ఇంటిని బిల్డర్‌ వద్ద నుంచి కొనుగోలు చేసినప్పుడు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అయితే, మీ సొంత స్థలంలో మీరు ఇల్లు నిర్మించాలనుకున్నప్పుడు బ్యాంకులు రుణాలు ఇస్తాయా? ఒకవేళ ఇస్తే ఎంత రుణం ఇస్తాయి? బ్యాంకులు ఎలాంటి పత్రాలను అడుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

తమ పూర్వీకులు ఇచ్చిన స్థలంలో లేదా తాము ఇంతకు ముందు కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని కొంతమంది ఆశపడుతుంటారు. అలాంటి వారి కోసం బ్యాంకులు ‘హోమ్‌ కన్‌స్ట్రక్షన్‌ లోన్‌’ను ఇస్తుంటాయి. ఇది కూడా ఒకరకమైన గృహ రుణమే. ఇక్కడ మీరు బిల్డర్‌ లేదా ఇంటి యజమాని దగ్గర నుంచి ఇంటిని కొనుగోలు చేయకుండా.. సొంతంగా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు రుణం పొందొచ్చు. ఆస్తి విలువలో 80 శాతం వరకు రుణం ఇచ్చే వీలుంటుంది. ఒకవేళ మీరు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే.. రుణ మొత్తం ఒకే సారి ఇవ్వరు. పని జరుగుతున్న స్టేజీని బట్టి దశలవారీగా డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ గృహ నిర్మాణ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే నిర్మాణ ప్రణాళికలను టైమ్‌ టేబుల్‌తో సహా వివరంగా బ్యాంకుకు ఇవ్వాలి.

రుణం రకాలు..

సెల్ఫ్‌ కన్‌స్ట్రక్షన్ లోన్: మీ పేరుపై ఇప్పటికే స్థలం ఉంటే, అందులో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు నిధులు అవసరమైతే ఈ రుణం ఎంచుకోవచ్చు. 

ప్లాట్‌ + కన్‌స్ట్రక్షన్ లోన్ (P+C loan): ఒకవేళ మీకు సొంతంగా స్థలం లేకపోతే.. స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణం రెండింటికీ నిధులు అవసరమైతే అప్పుడు ఈ రుణం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు స్థలం మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటే ఈ కేటగిరీలో రుణం పొందలేరు. అలాంటప్పుడు ఆస్తి రుణం లేదా వ్యక్తిగత రుణం కోసం ప్రయత్నించవచ్చు.

ఎక్స్‌టెన్షన్‌ లోన్‌: మీకు ఇప్పటికే ఇల్లు ఉండి, దాన్ని విస్తరించాలనుకున్నప్పుడు ఈ రుణం తీసుకోవచ్చు. అంటే, మీరు ప్రస్తుతం ఉన్న ఇంటిపై మరొక అంతస్తు నిర్మించాలనుకుంటే ఎక్స్‌టెన్షన్‌ రుణం తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంటిలో పెద్ద పెద్ద మరమ్మతులు, పెయింటింగ్‌ వంటి అధిక ఖర్చుతో కూడిన పనులు చేయించాలనుకున్నప్పుడు పునరుద్ధరణ రుణం తీసుకోవచ్చు.

రుణం త్వరగా ఆమోదం పొందాలంటే..

మంచి క్రెడిట్‌ స్కోరు ఉండాలి: రుణ ఆమోదం విషయంలో క్రెడిట్‌ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. మంచి క్రెడిట్‌ స్కోరు నిర్వహిస్తున్నారంటే.. రుణ గ్రహీత గత చెల్లింపుల రికార్డు బాగుందని, ఎలాంటి రుణ ఎగవేతలకూ పాల్పడలేదని అర్థం. సమయానికి ఈఎంఐలు చెల్లిస్తారని బ్యాంకులు విశ్వసించి త్వరగా ఆమోదం తెలుపుతాయి. 

అర్హత ఆధారంగా దరఖాస్తు చేయాలి: మీ ఆదాయం, చెల్లింపుల ఆధారంగా మీ రుణ అర్హతను బ్యాంకులు లెక్కిస్తాయి. మీ ఆదాయంలో ఈఎంఐల (తీసుకోబోయే రుణంతో పాటు+ ప్రస్తుతం ఏమైనా ఈఎంఐలు చెల్లిస్తుంటే వాటిని పరిగణనలోకి తీసుకుని లెక్కించాలి) కోసం చెల్లించే మొత్తం 50% మించకుండా చూసుకోవాలి. అప్పుడే రుణం త్వరగా ఆమోదం పొందుతుంది. అందువల్ల రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందే మీ రుణ అర్హత, చెల్లించాల్సిన ఈఎంఐలను తెలుసుకోవాలి. ప్రస్తుతం చాలా వరకు హోమ్‌లోన్‌ కాలిక్యులేటర్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు కూడా తమ వెబ్‌సైట్లలో ఈ కాలిక్యులేటర్లను అందిస్తున్నాయి. వీటిని ఉపయోగించుకోవచ్చు. 

స్థలం పత్రాలు, నిర్మాణ బడ్జెట్‌ పత్రాలు: బ్యాంకులు రుణం త్వరగా మంజూరు చేయాలంటే మీ స్థలంపై ఎలాంటి న్యాయపరమైన చిక్కులూ ఉండకూడదు. అలాగే, ఇల్లు ఎంత విస్తీర్ణంలో నిర్మించాలనుకుంటున్నారు? నిర్మాణానికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయా? లేదా? నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌ ఎవరు? నిర్మాణానికి కావాల్సిన అన్ని పర్మిషన్లూ ఉన్నాయా? లేదా? చూస్తారు. వీటికి సంబంధించిన అన్ని పత్రాలూ సిద్ధంగా ఉంటే రుణం త్వరగా లభించే అవకాశం ఉంటుంది. 

కాంట్రాక్టర్‌: ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు..ఈ రంగంలో నిపుణులైన కాంట్రాక్టర్‌ను సంప్రదించడం మంచిది. వారు ఇంతకు ముందు ఇల్లు నిర్మించిన మంచి చరిత్ర ఉన్న కాంట్రాక్టర్‌ అయితే బ్యాంకులు రుణ దరఖాస్తును త్వరగా ఆమోదించే అవకాశం ఉంటుంది. 

బ్యాంకుకు హామీ ఇవ్వడం ద్వారా: ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు అనుకున్న బడ్జెట్‌ను మించి కొన్ని సార్లు అదనపు మొత్తం ఖర్చుకావచ్చు. ఉదాహరణకు నిర్మాణ కాలంలో స్టీల్‌, సిమెంట్‌, ఇసుక వంటి ముడిపదార్థాల ధరలు పెరగవచ్చు. వీటి కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. ఇలాంటి అదనపు ఖర్చులను నిర్వహించేందుకు మీ వద్ద తగినంత పొదుపులు ఉన్నాయని బ్యాంకుకు హామీ ఇవ్వాలి.

ఇంటిని సొంతంగా నిర్మించడం వల్ల లాభం ఏంటి?

మీ ఇష్టం మేరకు నిర్మించుకోవచ్చు: ఇంటి నిర్మాణం స్వయంగా చేపట్టడం ద్వారా ప్లానింగ్‌ అంతా మీ చేతిలోనే ఉంటుంది. నిపుణుడైన ఇంజినీరును సంప్రదించి మీ కలలు, అభిరుచులకు అనుగుణంగా ఇల్లు ప్లాన్‌ చేయించుకోవచ్చు. సిద్ధంగా ఉన్న ఇంటిలో ఇది లభించదు. అలాగే, నిర్మాణంలో ఉన్న ఇంటిని కూడా బిల్డర్‌ ముందుగానే ప్లాన్‌ చేసుకుంటాడు. బట్టి పూర్తిస్థాయిలో మీ అభిరుచులకు అనుగుణంగా ఉండకపోవచ్చు.

నాణ్యత: ముడిపదార్థాల దగ్గర నుంచి ప్రతి మెటీరియల్‌, ఇంటి గుమ్మాలు, తలుపులు వంటి ఫర్నీచర్‌, రంగులు అన్ని స్వయంగా మీరే ఎంపిక చేసుకుంటారు. కాబట్టి నాణ్యత పరంగా రాజీ ఉండదు. దీంతో ఇంటి నిర్మాణంలో నాణ్యత లోపాలు లేకుండా జాగ్రత్త పడే వీలుంటుంది.

మొదటి రోజు వడ్డీ పడదు: మంజూరైన మొత్తం రుణానికి మొదటి రోజు నుంచి వడ్డీ చెల్లించనవసరం లేదు. నిర్మాణం జరుగుతున్న దశలను అనుసరించి దఫదఫాలుగా డబ్బు ఇస్తుంటారు. కాబట్టి మీ ఖాతాలో జమైన మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించాలి. 

పునరుద్ధరణం కోసం సులభంగా రుణం: భవిష్యత్‌లో ఇంటి పునరుద్ధరణ కోసం గానీ, కొత్త ఫ్లోర్‌ లేదా గదులు నిర్మించడానికి గానీ రుణం అవసరమైతే సులభంగా లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు