Home loan: గృహ రుణ ఈఎంఐ ఆలస్యమైతే..?

వ్యక్తులకు ఎన్ని రుణాలున్నా కాని.. గృహ రుణం ప్రత్యేకమైనది. ఈ రుణం డిఫాల్ట్‌ అయితే ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఇక్కడ చూడండి.

Published : 05 Jan 2023 17:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహ కొనుగోలు అనేది అధిక మొత్తంలో కూడుకున్న వ్యవహారం. కాబట్టి, సాధారణంగా కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది బ్యాంకుల వద్ద రుణాలు (Home loan) తీసుకుంటారు. బ్యాంకులు కూడా ఈ రుణాలకు సరసమైన వడ్డీనే వసూలు చేస్తున్నాయి. సాధారణంగా వ్యక్తులు తీసుకునే రుణాల్లో గృహ రుణమే అధిక విలువగలది. దీర్ఘకాల ఈఎంఐలతో (EMI) కూడినది కూడా. అయితే ఈ రుణాలు తీసుకున్నవారిలో ఈఎంఐలు చెల్లించలేక డిఫాల్ట్‌ అయినవారూ ఉంటారు. ఇంటి రుణ ఈఎంఐ చెల్లింపును కోల్పోవడం అనేది డిఫాల్ట్‌ కేటగిరీ కిందకు వస్తుంది. ఇది మీ క్రెడిట్‌ స్కోరును వెంటనే ప్రభావితం చేస్తుంది.

ఈఎంఐ మిస్‌ అయితే..?

గృహ రుణాలు చాలా కాలం పాటు ఈఎంఐలను తిరిగి చెల్లించే విధంగా ఉంటాయి. ఈ రుణగ్రహీతలు ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండాలని, ఈఎంఐలను మిస్‌ కాకూడదని బ్యాంకులు సలహా ఇస్తాయి. కొన్నిసార్లు ఇటువంటి సుదీర్ఘ  చెల్లింపుల వ్యవధిలో రుణగ్రహీతలు ఈఎంఐ చెల్లింపులను మిస్‌ చేయవచ్చు. ఒకటి లేదా రెండు ఈఎంఐలు షెడ్యూల్‌ తేదీలో మిస్‌ అయినప్పుడు.. మూడు నెలల్లోపు ఆ ఈఎంఐలను చెల్లిస్తే దాన్ని మైనర్‌ డిఫాల్ట్‌గా బ్యాంకులు పరిగణిస్తాయి. ఒకవేళ  మూడు నెలల్లోపు చెల్లించకపోతే అప్పుడు మేజర్‌ డిఫాల్ట్‌ అవుతుంది. మైనర్‌ డిఫాల్ట్‌ కేటగిరీలో కూడా మీ సిబిల్‌ స్కోరులో దాదాపు 40 నుంచి 80 పాయింట్ల తగ్గుదల కనిపిస్తుంది. ఈఎంఐ మిస్‌ అవ్వడం వల్ల లోన్‌ నిబంధనలు, షరతులపై ఆధారపడి ఆలస్య చెల్లింపునకు ఈఎంఐలో దాదాపు 2% వరకు జరిమానాను బ్యాంకు విధించవచ్చు.

బ్యాంకు చర్యలు

మీరు బకాయిని చెల్లించిన తర్వాత మీ క్రెడిట్‌ స్కోరును పునరుద్ధరించవచ్చు. కానీ, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యం అయిన విషయం మాత్రం మీ క్రెడిట్‌ నివేదికలో నమోదవుతుంది. బ్యాంకు మీ క్రెడిట్‌ నివేదికను యాక్సెస్‌ చేసినప్పుడు ఇది మీ క్రెడిట్‌ యోగ్యతపై ప్రభావం చూపిస్తుంది. మీరు భవిష్యత్‌లో ఈఎంఐలను సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత కూడా గృహ రుణాన్ని మరొక బ్యాంకుకు బదిలీ చేసే అవకాశాలను ప్రధాన కేటగిరీలో నమోదైన డిఫాల్ట్‌ అడ్డుకోవచ్చు. మీరు వ‌రుస‌గా 3 నెల‌ల పాటు  రుణ ఈఎంఐల‌ను తిరిగి చెల్లించ‌డంలో ఆల‌స్యం చేస్తే.. బ్యాంకు ఈఎంఐ సత్వర చెల్లింపుల కోసం రుణగ్రహీతకు రిమైండ్ నోటీసులను పంపుతుంది. నోటీసుకు కట్టుబడి ఉండకపోతే, మీపై బ్యాంకు చర్య తీసుకోవచ్చు. 3 నెల‌ల కంటే ఎక్కువ ఆల‌స్యాన్ని ప్రధాన డిఫాల్ట్‌గా పరిగణించి, బ‌కాయిల‌ను రిక‌వ‌రీ చేయ‌డానికి బ్యాంకు రుణగ్రహీత ఆస్తిని వేలం వేసే ప్రక్రియను ప్రారంభించ‌వ‌చ్చు.

రుణగ్రహీత ఏం చేయాలి?

ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈఎంఐని తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి. ఈఎంఐ చెల్లింపు మిస్‌ అయితే వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయాలి. దీనికి గల కారణాన్ని వివరించాలి. ఒకవేళ ఈఎంఐని చెల్లించడం నిజంగా మరచిపోయినట్లయితే భవిష్యత్‌లో అలాంటి సందర్భాలు రాకుండా ఉండేందుకు, మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్‌ సౌకర్యాన్ని ఎంచుకోవాలి. ఉద్యోగం కోల్పోవడం లేదా ఆదాయం తగ్గిపోవడం వంటి క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో చెల్లింపులు చేయడంలో విఫలమైతే.. మీ ఆర్థిక పరిస్థితిని పరిష్కరించుకోవడానికి త్వరగా ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. మీ అత్యవసర నిధి నుంచి ఈఎంఐలు చెల్లించాలి. ఇంకా అవసరమైతే మీ పెట్టుబడుల్లో కొన్నింటిని రద్దు చేసుకోవాలి. గృహ రుణ ఈఎంఐలు దీర్ఘకాలం ఉండేవి కాబట్టి, ప్రతికూల ఆర్థిక పరిస్థితిలో మీరు కొంత ఉపశమనం పొందేలా లోన్‌ రీపేమెంట్‌ వ్యవధిని పెంచమని బ్యాంకును అభ్యర్థించవచ్చు.

ఉద్యోగం కోల్పోయే పరిస్థితి లేదా మీరు ఎదుర్కొనే ఏదైనా ఇతర ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ డిఫాల్ట్‌ను నివారించడానికి 6 నెలల వరకు రుణ మారటోరియంను అనుమతించాలని మీ బ్యాంకును కోరవచ్చు. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారితే మీరు ఇప్పటికే ఉన్న మీ ఇంటిని అద్దెకు ఇచ్చి, వేరే చిన్న ఇంటికి మారిపోవచ్చు. దీనివల్ల రుణం పొందిన ఇంటికి వచ్చే అద్దెతో రుణ బకాయిలను తీర్చడానికి కొద్దిగా అవకాశం దొరుకుతుంది. ఇంకా మీ అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని ఈఎంఐలను సకాలంలో తిరిగి చెల్లించడంపై దృష్టి పెట్టాలి. ఈఎంఐలు డిఫాల్ట్‌ అయితే క్రెడిట్‌ స్కోరు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో కొత్త రుణాలు పొందడం కష్టంగా ఉంటుంది.

చెల్లింపునకు ఇతర మార్గాలు

రుణగ్రహీత ఆల‌స్య చెల్లింపును నివారించ‌డానికి.. ఈఎంఐల‌ను తిరిగి చెల్లించ‌డానికి స్నేహితులు లేదా బంధువుల నుంచి డ‌బ్బు తీసుకోవ‌చ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉంటే వాటిని ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. జీవిత బీమా పాల‌సీలు ఉన్నవారు బీమా ప‌ట్టాను తనఖా పెట్టి రుణం తీసుకోవ‌చ్చు. పీఎఫ్ ఉన్న వారు అవ‌స‌రమైన మొత్తాన్ని ఆ నిధి నుంచి ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. పీపీఎఫ్ ఉంటే.. ఆ ఖాతా నుంచి కూడా న‌గ‌దుని ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. కారు, బంగారం లాంటి ఆస్తుల‌ను అమ్మి కూడా ఈ డ‌బ్బుని గృహ‌రుణ ఈఎంఐ బ‌కాయిల‌ను తీర్చడానికి ఉప‌యోగించ‌వ‌చ్చు.

చివరిగా: ఈఎంఐలు డిఫాల్ట్‌ అయినప్పుడు అయోమయానికి గురి కాకుండా మీ ఆర్థిక ప్రణాళికను సరిచేసుకోవడం మంచిది. రుణగ్రహీతలు ఎల్లప్పుడూ ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యూహంతో ముందుకెళ్లాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని