సొంతింట్లో నివ‌సిస్తున్నారా... అద్దెకిచ్చారా? ప‌న్ను మిన‌హాయింపుల్లో తేడాలివే...

సొంతింట్లో ఉండేవారు, దాన్ని అద్దెకిచ్చేవారికి గృహ‌రుణ పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల్లో తేడా ఏమిటో తెలుసుకోండి

Published : 16 Dec 2020 15:43 IST

గృహ‌రుణం తీసుకున్న వారు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తింప‌జేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. గృహ‌రుణం తీసుకున్న‌వారు ఇంటిని నిర్మించి అందులో తామే స్వ‌యంగా ఉండొచ్చు. లేదా కొంద‌రు ఇత‌రుల‌కు అద్దెకు ఇవ్వ‌వ‌చ్చు. ఈ రెండూ వేర్వేరు సంద‌ర్భాలు. ఈ రెండింటికీ ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపుల సెక్ష‌న్‌లు దాదాపు ఒక‌టే అయినా సొంత ఇంట్లో నివ‌సించేవారికి, ఇంటిని అద్దెకిచ్చేవారి విష‌యంలో స్వ‌ల్ప తేడాలు ఉన్నాయి. అవేమిటో గ‌మ‌నిద్దాం.

గృహ రుణం : అస‌లు & వ‌డ్డీ మొత్తాల‌పై, ఇల్లు కొనుగోలుపై ప‌న్ను ఆదా

సెక్ష‌న్ 80 సీ - అస‌లు మొత్తం :

అస‌లు మొత్తం తిరిగి చెల్లింపుల‌పై గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

సెక్ష‌న్ 24 బీ - వ‌డ్డీ మొత్తం :

రుణం తీసుకుని అదే ఇంట్లో నివ‌సిస్తూ వ‌డ్డీ చెల్లిస్తున్న‌ట్ల‌యితే, ఇంటి నిర్మాణం ఆర్ధిక సంవ‌త్స‌రం ముగిసే లోపు మూడు సంవ‌త్స‌రాల‌లో పూర్త‌యితే రూ.2 ల‌క్ష‌ల‌కు, లేక‌పోతే రూ.30 వేల‌కు ప‌న్ను మిన‌హాయింపులుంటాయి. ఒక‌వేళ అద్దెకు ఇచ్చిన‌ట్ల‌యితే చెల్లించే వ‌డ్డీ మీద ప‌న్ను మిన‌హాయింపున‌కు ఎలాంటి గ‌రిష్ట ప‌రిమితులుండ‌వు.

సెక్ష‌న్ 80 ఈఈ- ప్ర‌కారం మొద‌టి సారి కొనుగోలు చేసే ఇంటి పై :

మొద‌టి సారి కొనుగోలు చేసే ఇంటి పై, దాని మొత్తం విలువ రూ.50 లక్ష‌ల‌కు మించ‌కుండా, అందులోనూ ఆ ఇంటికి తీసుకున్న రుణం 35 లక్ష‌ల‌కు స‌మానం లేదా అంత‌కంటే త‌క్కువ‌గా ఉన్న‌ట్ల‌యితే దానీ మీద చెల్లించే వ‌డ్డీపై గ‌రిష్టంగా రూ.50 వేల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అయితే ఆ రుణం ఏప్రిల్ 1, 2016 నుంచి మార్చి 31, 2017 మ‌ధ్య‌లో మంజూరు చేసిన‌దై ఉండాలి.

అద్దెకిచ్చిన ఇంటిపై ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు

  • సెక్ష‌న్ 80 సీ , సెక్ష‌న్ 80 ఈఈ ల‌ను అనుస‌రించి సొంతింట్లో స్వ‌యంగా నివ‌సించేవారికి, ఇంటిని అద్దెకిచ్చేవారికి ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ఒక‌టే. సెక్ష‌న్ 80సీ కింద రూ.1.5ల‌క్ష‌లు, సెక్ష‌న్ 80ఈఈ కింద రూ.50వేల ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల్లో తేడా కేవ‌లం సెక్ష‌న్ 24 బి లో మాత్ర‌మే.
  • ఇంటిని ఎవ‌రికైనా అద్దెకిచ్చిన‌ట్ల‌యితే … సెక్ష‌న్ 24 బి కింద గృహ‌రుణ వ‌డ్డీపై పూర్తి ప‌న్ను మినహాయింపు ప్ర‌యోజ‌నాల‌ను ఎటువంటి ప‌రిమితులు లేకుండా పొంద‌వ‌చ్చు.

గ‌మ‌నిక 1: సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసి దాన్ని 5 ఏళ్ల‌లోపు విక్ర‌యించిన‌ట్ల‌యితే ప‌న్ను ప్ర‌యోజ‌నాలు కోల్పోతాం. స్తిరాస్తి అమ్మిన సంవ‌త్స‌రానికి గాను ప‌న్ను వ‌ర్తిస్తుంది. ప్ర‌స్తుత రేట్ల ప్ర‌కారం ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు.

గ‌మ‌నిక 2: సెక్ష‌న్ 80 సీ, సెక్ష‌న్ 24ల ప్ర‌కారం పన్ను ప్ర‌యోజ‌నాలు స‌ద‌రు ఇంటి నిర్మాణం పూర్త‌యిన‌ప్పుడు లేదా ఇంట్లో నివ‌సించ‌డం ప్రారంభించిన‌ప్పుడు మాత్ర‌మే అమ‌లవుతుంద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. నిర్మాణంలో ఉన్న ఇంటికి అస‌లు పై కానీ, వ‌డ్డీ పై కానీ ప‌న్ను ప్ర‌యోజ‌నాలు వ‌ర్తించ‌వు.

గ‌మ‌నిక 3: ఉమ్మ‌డి గృహ‌రుణం పొందిన ప‌క్షంలో మీరూ, మీ భాగ‌స్వామి విడివిడిగా ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అప్పుడు సెక్ష‌న్ 80సీ కింద రూ.3ల‌క్ష‌ల ప‌రిమితి, సెక్ష‌న్ 24 బీ ప్ర‌కారం రూ.4ల‌క్ష‌ల వ‌డ్డీ వ‌ర‌కు ప‌న్ను ప‌రిమితి ప్ర‌యోజనం చేకూరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని