Honda City e:HEV: హోండా సిటీలో హైబ్రిడ్‌ మోడల్‌ @19.50 లక్షలు

హోండా కార్స్‌ ఇండియా తమ సెడాన్‌ విభాగంలోని సిటీ కారులో హైబ్రిడ్‌ మోడల్‌ను విడుదల చేసింది.....

Published : 04 May 2022 17:51 IST

దిల్లీ: హోండా కార్స్‌ ఇండియా తమ సెడాన్‌ విభాగంలోని సిటీ కారులో హైబ్రిడ్‌ మోడల్‌ను విడుదల చేసింది. సిటీ ఇ:హెచ్‌ఈవీ (Honda City e:HEV)గా పిలుస్తున్న ఈ కారు ధర రూ.19.49 లక్షలు (దిల్లీ, ఎక్స్‌షోరూం). దీంతో దేశంలో హైబ్రిడ్ విభాగంలోకి ప్రవేశించిన మరో సంస్థగా హోండా నిలిచింది. 

తమ సిటీ మోడల్‌ (Honda City)ను మరింత ఆధునికీకరిస్తూ ఈ హైబ్రిడ్‌ మోడల్‌ (Hybrid Car)ను తీసుకొచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం జెడ్‌ఎక్స్‌ ట్రిమ్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అట్కిన్‌సన్‌ సైకిల్‌తో కూడిన 1.5 లీటర్‌ ఇంజిన్‌ ఈ ఇ:హెచ్‌ఈవీ (Honda City e:HEV) ప్రత్యేకత. పెట్రోల్‌ మోటార్‌ 86 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్‌ 94 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మొత్తంగా ఈ కారు 253 ఎన్‌ఎం టార్క్ వద్ద 125 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ మోటార్లను ఈ-సీవీటీ సింగిల్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌కు అనుసంధానించారు. ఈ హైబ్రిడ్‌ కారు లీటరుకు 26.5 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

హోండా సిటీ (Honda City) స్టాండర్డ్‌ కారుతో పోలిస్తే ఈ ఇ:హెచ్‌ఈవీ (Honda City e:HEV)లో డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. ముందు, వెనుక భాగంలో హైబ్రిడ్‌కు గుర్తుగా లోగోలను గ్రీన్‌ రంగు బోర్డర్‌తో రూపొందించారు. లోపలి భాగంలో బ్లాక్‌, ఐవరీ రంగులతో కూడిన డ్యుయల్‌ టోన్ ఫినిషింగ్‌ ఇచ్చారు. ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్‌ బ్రేక్‌ను పొందుపరిచారు. లేన్‌ కీప్‌ అసిస్ట్‌, లేన్‌ డిపార్చర్ వార్నింగ్‌, అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌, హై బీమ్‌ అసిస్ట్‌, కొలిజన్ మిటిగేషన్‌ బ్రేకింగ్‌ వంటి అడాస్‌ ఫీచర్లను అందిస్తున్నారు. రిమోట్‌ ఇంజిన్‌ స్టార్ట్‌, డోర్‌ లాక్‌/అన్‌లాక్‌, ఏసీ ఆన్‌/ఆఫ్‌ వంటి ఫంక్షన్లకు స్పందించే అలెక్సా, గూగుల్‌కు అనుసంధానమయ్యే హోండా కనెక్ట్‌ను ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని