Honda Activa: హోండా నుంచి కొత్త యాక్టివా.. సర్వీసింగ్‌ అలర్ట్‌ సహా మరిన్ని ఫీచర్లు

Honda New Activa: హోండా యాక్టివా మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో వచ్చింది. స్మార్ట్‌ కీ సహా ఆన్‌బోర్డ్‌ డయాగ్నొస్టిక్స్‌ సదుపాయం ఇందులో ఇస్తున్నారు.

Published : 23 Jan 2023 18:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హోండా మోటార్‌ సైకిల్‌ స్కూటర్‌ ఇండియా (HMSI) తన విజయవంతమైన మోడల్‌ యాక్టివాకు (Honda Activa) కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. యాక్టివా 6జీ H-smart పేరిట దీన్ని తీసుకొచ్చింది. దీని ధరను రూ.74,536 (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. రాబోయే ఉద్గార ప్రమాణ నిబంధనలకు అనుగుణంగా కొత్త యాక్టివాను తీర్చిదిద్దారు. మొత్తం మూడు వేరియంట్లను తీసుకొచ్చారు. స్టాండర్డ్‌ వేరియంట్ ధరను రూ.74,536, డీలక్స్‌ వేరియంట్‌ ధర రూ.77,036, స్మార్ట్‌ వేరియంట్‌ ధర రూ.80,537గా నిర్ణయించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కొత్తగా రాబోయే వాహనాల్లో ఉద్గార ప్రమాణాలను తెలిపే ఆన్‌ బోర్డ్‌ సెల్ఫ్‌ డయాగ్నోస్టిక్‌ డివైజ్‌లను వాహనాల్లో అమర్చాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కొత్త యాక్టివాలో ఆన్‌బోర్డ్‌ డయాగ్నొస్టిక్స్‌ (OBD 2) సదుపాయం తీసుకొచ్చారు. ఈ డివైజ్‌ ఎప్పటికప్పుడు ఉద్గారాలను సూచిస్తుంది. నిర్దేశించిన ఉద్గార ప్రమాణాలను దాటినప్పుడు వాహనాన్ని సర్వీసింగ్‌కు తీసుకెళ్లాలని వాహనదారుడిని అలర్ట్‌ చేస్తుంది.

కొత్త యాక్టివాలో వస్తున్న మరో ఫీచర్‌ స్మార్ట్‌ కీ. దీని ద్వారా వాహనం ఎక్కడుందో ఇట్టే గుర్తించొచ్చు.  కాస్త దూరం నుంచే స్కూటర్‌ ఇంజిన్‌ను స్టార్ట్‌ లేదా స్టాప్‌ చేయొచ్చు. యాక్టివాలో ఇంజిన్‌ స్టార్ట్‌, స్టాప్‌ స్విచ్ కూడా అందిస్తున్నారు. ఇక ఇంజిన్‌ విషయానికొస్తే ఇందులో 110 సీసీ పీజీఎం-ఎఫ్‌ఐ ఇస్తున్నారు. అతి ఎక్కువ వీల్‌ బేస్‌, లాంగ్‌ ఫుట్‌బోర్డ్‌ ఏరియా ఉన్నాయి. వినియోగదారులు కోరుకుంటున్న అన్ని మార్పులు కొత్త యాక్టివాలో ఉన్నాయని హెచ్‌ఎంఎస్‌ఐ ఎండీ, సీఈఓ, ప్రెసిడెంట్‌ అత్సుషి ఒగాటా అన్నారు. ప్రస్తుతం స్కూటర్‌ మార్కెట్‌లో హోండాకు దాదాపు 56 శాతానికి పైగా మార్కెట్‌ వాటా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని