Health Insurance: హాస్పిట‌ల్ క్యాష్ రైడ‌ర్ ఎలాంటి ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేస్తుంది?

ప్ర‌స్తుతం ఉన్న‌ ఆరోగ్య బీమా పాల‌సీకి యాడ్ - ఆన్‌గా దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Updated : 12 Apr 2022 15:29 IST

సాధార‌ణంగా అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన‌ప్పుడు.. సంబంధిత చికిత్స కోసం అయ్యే ఖ‌ర్చుల‌ను ఆరోగ్య బీమా క‌వ‌ర్ చేస్తుంది. అయితే రెండు లేదా అంత‌కంటే ఎక్కువ రోజులు ఆసుప‌త్రిలో ఉండాల్సి వ‌చ్చిన‌ప్పుడు చికిత్స కోసం అయ్యే ఖర్చులే కాకుండా ఇత‌ర‌ రోజువారీ ఖర్చులు కూడా చాలానే ఉంటాయి. ఒక‌వైపు ఆసుప్ర‌తి ఖ‌ర్చులు.. మ‌రోవైపు ఆసుప్ర‌తిలో చేర‌డం వ‌ల్ల ప‌నికి వెళ్ల‌లేక‌పోవ‌డంతో` రోజు వారి ఆదాయం ఆగిపోతుంది. దీంతో రోజువారి ఖ‌ర్చుల కోసం చాలా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. ఇలాంటి సంద‌ర్భంలోనే హాస్పిట‌ల్ క్యాష్ ప్లాన్ ఉంటే, ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు.. రోజుకి కొంత మొత్తం ( ముందుగానే నిర్ణ‌యించిన మొత్తం) చొప్పున బీమా సంస్థ పాల‌సీదారునికి అందజేస్తుంది.

హాస్పిట‌ల్ క్యాష్ ప్లాన్‌.. 
హాస్పిక్యాష్ లేదా హాస్పిట‌ల్ క్యాష్ అనేది రోజువారి ఆసుప్ర‌తి ఖ‌ర్చుల కోసం నిర్ణీత బీమా మొత్తాన్ని అందించే ప్లాన్‌. 24 గంట‌లు లేదా అంత‌కంటే ఎక్కువ స‌మయం ఆసుప్ర‌తిలో ఉండాల్సి వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ఇది అమ‌లులోకి వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఉన్న‌ ఆరోగ్య బీమా పాల‌సీకి యాడ్ - ఆన్‌గా దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి, ర‌మేష్.. రోజుకు రూ. 2వేలు ఇచ్చే హాస్పిట‌ల్ క్యాష్ ప్లాన్‌ను తీసుకున్నాడు.  ర‌మేష్ అనారోగ్యం కార‌ణంగా మూడు రోజుల పాటు ఆసుప్ర‌తిలో ఉండాల్సి వ‌చ్చింది. హాస్పిట‌ల్ క్యాష్ బెనిఫిట్ పొందేందుకు క‌నీసం 24 గంట‌లు ఆసుప‌త్రిలో చేరుండాలి కాబ‌ట్టి 2,3 రోజుల‌కు గానూ రూ. 4 వేలు బీమా సంస్థ ర‌మేష్‌కు అందిస్తుంది.  ఈ రూ. 4 వేలు కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి వ‌చ్చి వేళ్లేందుకు అయ్యే ఖ‌ర్చులు, స‌ర్జిక‌ల్ ప‌రికరాల కొనుగోలు, ఇత‌ర అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ఈ రైడ‌ర్ రోజువారి న‌గ‌దు ప్ర‌యోజ‌నాల‌ను నిర్ధిష్ట కాల‌వ్య‌వ‌ధి పాటు మాత్ర‌మే అందిస్తుంది. ఇది వేరు వేరు బీమా సంస్థ‌ల‌కు వేరు వేరుగా ఉంటుంది. ఈ ర‌క‌మైన ప్లాన్ సాధార‌ణంగా 15, 30, 45 రోజుల‌కు అందుబాటులో ఉంటుంది. క‌నీసం 24 గంట‌ల వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. 

మీ ప్ర‌స్తుత ఆరోగ్య బీమాతో పాటు ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. 18 నుంచి 65 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉన్న పెద్ద‌లు, త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌ల‌ను వారి పాల‌సీలో చేర్చిన‌ట్ల‌యితే 6 నెల‌ల నుంచి 25 సంవ‌త్స‌రాల పిల్ల‌లు సాధార‌ణంగా క‌వ‌రవుతారు. రోజువారి న‌గ‌దు క్లెయిమ్ చేసేందుకు మీరు ఆసుప‌త్రిలో చేరి 24 గంట‌ల కంటే ఎక్కువ స‌మ‌యం ఆసుప‌త్రిలో ఉన్న‌ట్లు.. సంబంధిత ప‌త్రాల‌ను బీమా సంస్థ‌కు అందించాలి.   

ప్ర‌యోజ‌నాలు..
* ప్ర‌స్తుతం ఉన్న ఆరోగ్య బీమాకు ఉప ప‌రిమితులు ఉంటే, ఆదాయం కోల్పోవ‌డం, అటెండ‌ర్ల ఖ‌ర్చు, గృహ ఖ‌ర్చులు, ఎక్స్ రేలు, చిత‌ర శ‌స్త్ర‌చికిత్సా ప‌రికరాలక‌య్యే ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేయ‌దు. అటువంట‌ప్పుడు ఇది స‌హాయ‌ప‌డుతుంది. 
* ఈ ప్లాన్ కింద స‌పోర్టింగ్ బిల్లులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ప్లాన్‌లో పేర్కొన్న విధంగా పాల‌సీదారుడు ఆసుప్ర‌తిలో ఉన్న కాలానికి అనుగుణంగా, నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి నిర్థిష్ట మొత్తాన్ని చెల్లిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కి, మీ రోజువారి నిర్ణ‌త మొత్తం రూ. 2000 అనుకుంటే ఖ‌ర్చుల‌కు  రూ. 1000 అయిన‌ప్ప‌టికీ పూర్తి మొత్తాన్ని చెల్లిస్తారు. 

ఎప్పుడు క‌వ‌ర్ కాదు..
అనారోగ్యం కార‌ణంగా ఆసుపత్రిలో చేరినా 24 గంటల కంటే తక్కువ సమయం పాటు ఆసుప‌త్రిలో ఉంటే ఈ ప్లాన్‌ కవర్ చేయ‌దు. సంతానోత్పత్తికి సంబంధించిన అనారోగ్యాలు, స్వీయ గాయాలు, కాస్మెటిక్ సర్జరీలు, ముందుగా ఉన్న వ్యాధులు, నాన్-అల్లోపతి చికిత్స వంటివి కూడా సాధార‌ణంగా ఈ ప్లాన్‌లో క‌వ‌ర్‌కావు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని