IRCTC: మెరుగైన సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌లోనే రూమ్‌.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..?

IRCTC Retiring Room Booking: రైలు ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే తీసుకొచ్చిన అనేక సేవల్లో రిటైరింగ్‌ రూమ్స్‌ సదుపాయం ఒకటి. రైల్వే స్టేషన్‌లో ఎక్కువ సేపు గడపాల్సిన పరిస్థితుల్లో.. తక్కువ డబ్బుతో వసతి సదుపాయం కల్పించేందుకు ఐఆర్‌సీటీసీ ఈ సేవల్ని తీసుకొచ్చింది.

Updated : 04 Nov 2023 11:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్యోగం, వ్యాపారం అంటూ.. నిత్యం కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమో, ప్రమాదాల కారణంగానో రైళ్లు ఆలస్యం అవుతుంటాయి. లేదంటే ప్రయాణికులే వేరే రైలు అందుకోవడం కోసం రైల్వేస్టేషన్‌లో గంటల తరబడి ఎదురుచూడాల్సి రావొచ్చు. అలాంటప్పుడు బయట ఏ హోటల్‌ గదిలోనో బస చేయాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అలాంటి వారి కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) రిటైరింగ్‌ రూమ్స్‌ (Retiring Room), డార్మిటరీ సదుపాయాన్ని అందిస్తోంది. చాలా మందికి దీని గురించి సరైన అవగాహన లేదు.

ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఐఆర్‌సీటీసీ ఈ రిటైరింగ్‌ రూమ్స్‌ బుకింగ్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. చాలా తక్కువ ఖర్చుతోనే ఈ రూమ్స్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఏసీ, నాన్‌ ఏసీ, సింగిల్‌, డబుల్‌, డార్మిటరీ తరహా గదులు అందుబాటులో ఉంటాయి. కనిష్ఠంగా గంట నుంచి గరిష్ఠంగా 48 గంటల సమయం వరకు బుక్ చేసుకోవచ్చు. ప్రాంతాన్ని బట్టి రూమ్‌ బుకింగ్ ఛార్జీలు రూ.100 నుంచి రూ.700 వరకు ఉంటాయి. టికెట్‌ రిజర్వేషన్ ఓకే అయిన వ్యక్తులు మాత్రమే ఈ రూమ్స్‌ బుకింగ్‌ చేసుకోవటానికి వీలుంటుంది. వెయిట్-లిస్ట్‌లోని ప్రయాణికులకు ఈ సదుపాయం ఉండదు. దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ రిటైరింగ్‌ రూమ్స్‌ను ఆఫ్‌లైన్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో బుకింగ్‌..

  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లో లాగిన్‌ అవ్వాలి.
  • IRCTC account సెక్షన్‌లోకి వెళ్లి My bookingపై క్లిక్‌ చేయాలి.
  • కిందికి స్క్రోల్‌ చేయగానే ‘Retiring room’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీ పీఎన్‌ఆర్‌ (PNR) నంబర్‌, మీరు స్టే చేయాలనుకునే స్టేషన్‌ వివరాలు సమర్పించాలి.
  • తర్వాత చెక్‌ఇన్‌, చెక్‌ అవుట్‌ డేట్‌, బెడ్‌ టైప్‌.. ఇలా అడిగిన వివరాలన్నీ ఇవ్వాలి.
  • స్లాట్‌ డ్యూరేషన్‌ (Duration), ఐడీ కార్డ్‌ టైప్‌ వంటి వివరాల్ని సరిగ్గా చూసుకొని పేమెంట్‌ చేయాలి.
  • పేమెంట్‌ చేయగానే మీ రూమ్‌ బుకింగ్‌ పూర్తవుతుంది.
  • నేరుగా ఈ లింక్‌పై క్లిక్‌ చేసి కూడా రూమ్‌ బుక్‌ చేసుకోవచ్చు.

క్యాన్సిలేషన్‌ పాలసీ..

ఏదైనా కారణం చేత 48 గంటల కంటే ముందే రూమ్‌ బుకింగ్‌ రద్దు చేసుకుంటే 10 శాతం మీ రూమ్‌ బుకింగ్‌ ధర నుంచి మినహాయిస్తారు. అదే ప్రయాణానికి ఒక రోజు మందు క్యాన్సిల్‌ చేస్తే 50 శాతం మినహాయిస్తారు. ఆ తర్వాత రూమ్‌ క్యాన్సిల్ చేస్తే తిరిగి చెల్లింపులు చేయరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని