Housing prices: ఇళ్ల ధరలు ఐదు శాతం పెరుగుతాయ్‌.. ఇండియా రేటింగ్స్‌ అంచనా!

Housing prices: నిర్మాణ వ్యయాలు ఎగబాకడం, రుణ రేట్లు పెరగడం, దేశీయంగా.. అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ.. 2022-23లో స్థిరాస్తి రంగం పురోగమించిందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది.

Published : 28 Mar 2023 17:47 IST

దిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు 8-10 శాతం పెరిగాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో ఐదు శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే వచ్చే ఏడాది రెసిడెన్షియల్‌ స్థిరాస్తి రంగ ఔట్‌లుక్‌ను ‘ఇంప్రూవింగ్‌’ నుంచి తటస్థానికి మార్చింది.

నిర్మాణ వ్యయాలు ఎగబాకడం, రుణ రేట్లు పెరగడం, దేశీయంగా.. అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ.. 2022-23లో స్థిరాస్తి రంగం పురోగమించిందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. మందగమనం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు స్వల్పకాలంలో గిరాకీని దెబ్బతీసినట్లు తెలిపింది. అయితే, రానున్న రోజుల్లో గిరాకీ క్రమంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 2023- 24లో ఇళ్ల విక్రయాలు తొమ్మిది శాతం పుంజుకుంటాయని అంచనా వేసింది.

పెరుగుతున్న వ్యయాలతో డెవలపర్లపై భారం పడుతోందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. అయినప్పటికీ.. వారు వచ్చే ఆరు నుంచి ఏడు నెలల పాటు దాన్ని పూర్తిగా కొనుగోలుదారులపైకి బదిలీ చేసే పరిస్థితులు లేవని పేర్కొంది. ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితులే అందుకు కారణమని వివరించింది. అయితే, ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పటికే కొంత వరకు ధరల్ని పెంచక తప్పలేదని తెలిపింది. దీంతో అందుబాటు ధరలో ఉండే ఇళ్ల సెగ్మెంట్‌లో గిరాకీ తగ్గిందని పేర్కొంది. దీనికి వడ్డీరేట్ల పెంపు కూడా జతకావడంతో సెంటిమెంటు మరింత దెబ్బతిన్నట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని