Loan: లోన్ పొందే అర్హతపై వయసు ప్రభావం ఎలా ఉంటుందంటే..

Loan: బ్యాంకులు లోన్‌ ఇవ్వడానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. అందులో వయసు ఒకటి. మరి వయసు మన లోన్‌ అర్హతను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం..

Updated : 09 Dec 2022 11:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంత డబ్బుతో ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు నెరవేర్చుకోలేని వ్యక్తులకు బ్యాంకు రుణాలు (Loan) సాయంగా నిలుస్తాయి. తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వివిధ రకాల రుణ సదుపాయాలను రూపొందిస్తుంటాయి. ఉదాహరణకు, వివాహ ఖర్చులకు వెడ్డింగ్ లోన్‌లు (Wedding Loans), విహారయాత్రల కోసం హాలిడే లోన్‌లు (Holiday Loans), సాధారణ ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాలు (Personal Loans) ఇలా నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకించిన అనేక రకాల రుణాలను అందిస్తున్నాయి. అయితే, వాటిని పొందడానికి బ్యాంకులు కొన్ని అర్హతలను నిర్దేశిస్తాయి. అందులో వయసు చాలా ప్రధానమైంది. మరి వయసు రుణ అర్హతను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకుందాం...

ఆదాయం తక్కువున్నా..

మీరు యుక్తవయస్సులో ఉండి, రుణం (Loan) కోసం దరఖాస్తు చేసుకున్నారనుకుందాం. EMIలను చెల్లించడానికి మీ ఆదాయం సరిపోకపోయినప్పటికీ.. బ్యాంకులు మీకు రుణాన్ని మంజూరు చేస్తాయి. రుణ కాలపరిమితి (Loan Tenure) పెంచడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. అప్పుడు నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (EMI) మొత్తం తగ్గుతుంది. అంటే చిన్న వయసులో వాయిదాలు చెల్లించే సామర్థ్యం లేకపోయినప్పటికీ.. రుణం మంజూరు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు పదవీ విరమణకు దగ్గరవుతున్న కొద్దీ రుణ కాలపరిమితి (Loan Tenure)ని పెంచే అవకాశాలు సన్నగిల్లుతూ వస్తాయి.

బ్యాంకులు సాధారణంగా రుణగ్రహీత నికర నెలవారీ ఆదాయానికి 60 రెట్ల వరకు రుణాన్ని ఇస్తాయి. అంటే రూ.50 లక్షల రుణం పొందడానికి చేతికి అందే నెలజీతం దాదాపు రూ.83,000 ఉండాలి. 30 ఏళ్ల వయసులో రుణాన్ని తీసుకుంటే మరో 30 సంవత్సరాలు రుణం తిరిగి చెల్లించడానికి గడువు ఉంటుంది (పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలుగా పరిగణనలోకి తీసుకుంటే). అప్పుడు రూ.38,446 EMIని సులభంగా చెల్లించవచ్చు. మిగిలిన డబ్బు ఇతర అవసరాలకు సరిపోతుంది. అదే 40 ఏళ్ల వయసులో లోన్‌ తీసుకుంటే, మీ EMI రూ.43,391కి పెరుగుతుంది. అప్పుడు చేతిలో రూ.39,600 మాత్రమే మిగిలి ఉంటాయి. ఒకవేళ 50 ఏళ్ల వయసులో లోన్ తీసుకుంటే EMI సుమారు రూ.62,000కి పెరుగుతుంది. అప్పుడు చేతిలో కేవలం రూ.21,000 మాత్రమే ఉంటాయి. రుణగ్రహీత వయసు పదవీ విరమణకు దగ్గరగా ఉన్నట్లయితే.. రుణం సకాలంలో రికవరీ అయ్యేలా చూసుకోవడానికి సహ-రుణగ్రహీతను చేర్చుకోవడం, లోన్ మార్జిన్‌ను పెంచడం, లోన్ మొత్తాన్ని తగ్గించడం వంటి చర్యలను బ్యాంకులు సూచిస్తాయి.

రిటైర్‌ అయితే అవకాశాలు పరిమితమే..

పదవీ విరమణ చేసిన వారికి బ్యాంకులు అన్ని రకాల లోన్‌లను ఇవ్వలేవు. పింఛను ఆదాయంపై రుణాన్ని పొందే అవకాశం ఉన్నప్పటికీ.. కొన్ని పరిమితులు ఉంటాయి. గోల్డ్ లోన్, FDలపై రుణం వంటి సెక్యూర్డ్‌ లోన్‌లను పొందొచ్చు. అలాగే వయసు పెరిగిన తర్వాత వ్యక్తిగత రుణం (Personal Loan) పొందడం కూడా కష్టంగా మారుతుంది. ఎందుకంటే బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాయి. తగినంత ఆదాయం, చెల్లించే స్తోమత, ఉపాధి వంటివి పక్కాగా ఉంటేనే లోన్‌ తీసుకున్నవారు సకాలంలో చెల్లించగలరని బ్యాంకులు నమ్ముతాయి.

వయసు పెరుగుతున్న కొద్దీ అన్‌సెక్యూర్డ్‌ రుణాలు పొందే అర్హత తగ్గుతూ వస్తుంది. అయినప్పటికీ, సహ-రుణగ్రహీతను చేర్చుకోవడం, డౌన్ పేమెంట్‌ని పెంచడం ద్వారా లోన్‌ పొందొచ్చు. లేదా గోల్డ్ లోన్, ఏదైనా ఆస్తిని తనఖా పెట్టి రుణం తీసుకోవడం వంటి మార్గాలనూ అన్వేషించొచ్చు. అయితే, మలి వయసులో అత్యంత అవసరమైతే తప్ప రుణం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు