ఎన్ఆర్ఐ భారతదేశంలో ఆస్తులు కొనడం ఎలా?

ప్రవాస భారతీయులు భారతదేశంలో ఆస్తిని కొనుగోలు చేయడం ఇంతకు మునుపు కంటే చాలా సులభతరం అయ్యింది

Published : 15 Dec 2020 19:35 IST

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, ప్రవాస భారతీయుడు (ఎన్ఆర్ఐ) భారతదేశంలో కేవలం కొన్ని రకాల ఆస్తులను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిగిలిన ర‌కాల ఆస్తులను కొనుగోలు చేసేందుకు మాత్రం కొన్ని ప్రత్యేక అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. అలాగే కొత్త రియల్ ఎస్టేట్ నిబంధనల ప్రకారం, ప్రవాస భారతీయులు భారతదేశంలో ఆస్తిని కొనుగోలు చేసే ప్ర‌క్రియ మునుప‌టి కంటే చాలా సులభతరం అయ్యింది. భారతీయ పాస్ పోర్ట్ కలిగిన ఎన్ఆర్ఐలు ఎవరైనా భారత రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ వ్యవసాయ భూమి, తోటలు, ఫార్మ్ హౌస్ వంటి ఆస్తులను కొనుగోలు చేసే వీలుండదు. భారతదేశంలో ఆస్తిని కొనుగోలు చేయటానికి ఆసక్తి ఉన్న ఎన్ఆర్ఐలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ప్రకారం, భారతదేశంలోని స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి లేదా సొంతం చేసుకోడానికి ముందు కొన్ని చట్టపరమైన నిబంధనల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు విష‌యంలో ఎన్నారైలు, భారత సంతతికి చెందిన వారిని స‌మానంగా ప‌రిగ‌ణిస్తారు. భారతదేశంలో రియల్ ఎస్టేట్ ఆస్తులను కొనుగోలు చేయడం, విక్రయించడం, అద్దెకు ఇవ్వడం వంటివి చేయడానికి ఎన్ఆర్ఐలు కొన్ని ప్రత్యేకమైన చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి ఉండవలసి ఉంటుంది.

భారతదేశంలోని నివాస లేదా వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేసేందుకు, ఎన్ఆర్ఐ లకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతినిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంట్లో ఇకపై భారత దేశంలో నివాస లేదా వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి ప్రత్యేక అనుమతిని కొరవలసిన అవసరం లేద‌ని తెలిపింది.

ప్రస్తుతం విధానాల ప్రకారం, ఎన్ఆర్ఐలు ఏదైనా నివాస లేదా వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. ఆదాయం పన్ను చట్టం కూడా దీన్ని అనుమ‌తిస్తుంది.

ఒకవేళ ఎన్ఆర్ఐ భారతదేశానికి రాలేక పోయినట్లయితే, ఎన్ఆర్ఐ నుంచి పవర్ అఫ్ అటార్నీ తీసుకున్న వ్యక్తి కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలను అమలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం భారతదేశంలోని ఎలాంటి వ్యవసాయ భూమిని లేదా తోటలను ఎన్ఆర్ఐ కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా, ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఎన్ఆర్ఐలు భారతదేశంలోని వ్యవసాయ గృహాలను (ఫార్మ్ హౌస్) కూడా కొనుగోలు చేయకూడదు. ఒకవేళ ఎన్ఆర్ఐ భారతదేశంలో ఫార్మ్ హౌస్ ను కొనుగోలు చేయాలని భావించినట్లైతే, అతను ప్రత్యేకమైన అనుమతి కోసం ఆర్‌బీఐ ని సంప్రదించవలసి ఉంటుంది. అప్పుడు దీనిని పరిశీలించి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది.

ఉమ్మడి యాజమాన్యం:

ఎన్ఆర్ఐ అనే వ్యక్తి దేశంలోని ఆస్తిని ఒక్కడే కొనుగోలు చేయవచ్చా లేదా ఇతర ఎన్ఆర్ఐతో కలిసి సంయుక్తంగా కొనుగోలు చేసే అవకాశం ఉందా? భార‌త‌దేశంలోని పెట్టుబడులు పెట్టడానికి అనుమతి లేని వారికి, ఆస్తులు కొనుగోల్లో ఉమ్మడి వాటాదారుడుగా ఉండే అవకాశం లేదు.

కొనడం, అమ్మడం:

ఎన్ఆర్ఐ మన దేశానికి వచ్చి ఆస్తిని కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చేయవచ్చు. ఒకవేళ దేశానికీ రాలేని పరిస్థితిలో ఉంటే, ఇక్కడి నమ్మకస్తుడైన వ్యక్తికి పవర్ అఫ్ అటార్నీని అప్పగించి లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎన్ఆర్ఐలు మనదేశంలో గృహ రుణాలను కూడా పొందవచ్చు. ఎన్ఆర్ఐ స్థిరపడిన దేశం ఆధారంగా రుణం కోసం సమర్పించవలసిన పత్రాలు మారుతూ ఉంటాయి. ఎంత మొత్తం రుణంగా పొందడానికి ఎన్ఆర్ఐ అర్హుడో అతని వయస్సు, ఆదాయం, విద్య వంటి ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రుణ కాలపరిమితి సుమారు 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆస్తి కొనుగోలు కోసం ఆర్ధిక సహాయం చేసేటప్పుడు, ఒక నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) ఖాతాను ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ఎన్ఆర్ఐ ఆస్తిని అమ్మేసే సమయంలో పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకోవటానికి ఇది ఉప‌యోగ‌పడుతుంది.

వ్య‌క్తికి భారతీయ పాస్ పోర్ట్ ఉన్నట్లయితే, భారతదేశంలోని ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికి ముందస్తు అనుమతి తీసుకొనవసరం లేదు. రిజర్వు బ్యాంకు ఆఫ్ఇండియా దేశంలో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను ఈ నియమాలను సులభతరం చేసింది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం కింద తెలిపిన‌ నియమాల ప్రకారం నిర్వహిస్తాయి.

ఎన్ఆర్ఐ మన దేశంలో ఎన్ని ఆస్తులనైనా కొనే అధికారం ఉంటుంది. దీనిలో ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఎన్ఆర్ఐ, భారత సంతతికి చెందిన (పీఐఓ) వ్యక్తి, మనదేశంలో గృహాలను, వాణిజ్య ఆస్తులను ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు. ఏదేమైనా, విదేశీ పెట్టుబడులతో వ్యవసాయ భూమిని, తోటలను లేదా ఫామ్ హౌస్ లను కొనాలంటే మాత్రం ఎన్ఆర్ఐలకు అవకాశం లేదు. కానీ మన దేశంలో ఇటువంటి ఆస్తులను ఎన్ఆర్ఐ కేవలం బహుమతిగా లేదా వారసత్వంగా పొందే వీలుంది.

భారతదేశంలో ఎన్ఆర్ఐ ఏదైనా ఆస్తిపై పెట్టుబడి పెట్టాలంటే, అన్ని లావాదేవీలు భారతీయ కరెన్సీలో, భారతీయ బ్యాంకుల ద్వారా మాత్రమే జరగాలి. అదేవిధంగా ఎన్ఆర్ఐ తప్పనిసరిగా అధికారిక భారతీయ బ్యాంకులో ఎన్ఆర్ఐ ఖాతాను కలిగి ఉండాలి.

ఈ లావాదేవీలన్ని భారతీయ బ్యాంకింగ్ మార్గాల ద్వారా మాత్రమే నిర్వహించాలి. దీనికి ఎన్ఆర్ఓ / ఎన్ఆర్ఈ ఖాతాల‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ లేదా ఎఫ్సీఎన్ఆర్ (విదేశీ కరెన్సీ నాన్ రెసిడెంట్) ఖాతాకు చెందిన పోస్ట్ డేటెడ్ చెక్కులు లేదా ఈసీఎస్ ను కూడా ఇవ్వవచ్చు.

ఆర్థిక లావాదేవీలు, నిధులు:

నిధుల కోసం మీరు బ్యాంకులను సంప్రదించే ముందు, మీరు తయారు చేసిన డాక్యుమెంట్ల‌ను న్యాయవాది చేత ధ్రువీకరించుకోవడం మంచిది. మీరు ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, సదరు ఆస్తి వారసత్వంగా లేదా సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లైతే విక్రయదారు నుంచి నో డ్యూ సర్టిఫికేట్ను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఆ ఆస్తిపై ఎలాంటి పెండింగ్ బిల్లులు, బకాయిలు లేకుండా చూసుకోవాలి.

భారతదేశంలో ఆస్తులను కలిగి ఉన్న ఒక వ్యక్తి తరువాతి కాలంలో ఎన్ఆర్ఐ అయినట్లయితే, తన పేరు మీద ఉన్న ఆస్తులను యధావిధిగా కొనసాగించవచ్చు. అలాగే అతను ఎన్ఆర్ఐగా మరకముందు తన పేరు మీద ఏదైనా వ్యవసాయ భూమి, తోటలు, ఫార్మ్ హౌస్ ఉన్నట్లయితే, ఎన్ఆర్ఐ అయిన తరువాత కూడా వాటిపై అతనికి హక్కులు ఉంటాయి. అదే ఎన్ఆర్ఐ అయ్యాక అలాంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి అధికారం లేదు. ఎన్ఆర్ఐ లు సంబంధం లేకుండా ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లైతే, దానిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. అటువంటి ఆస్తుల ద్వారా వచ్చే అద్దెను పొందడానికి ముందు భారతీయ పన్నులు చెల్లించవలసి ఉంటుంది.

అదేవిధంగా, ఎన్ఆర్ఐ తనకు చెందిన స్థిరాస్తిని భారతదేశంలో నివాసముండే వ్యక్తికి విక్రయించడానికి లేదా బహుమతిగా ఇచ్చే అధికారం ఉంది.
నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే పవర్ అఫ్ అటార్నీ అధికారాన్ని బిల్డర్ కు లేదా మీకు బాగా నమ్మకస్తులైన వారికి ఇవ్వవలసి ఉంటుంది. సరైన డాక్యుమెంటేషన్ కొరకు మీ న్యాయవాది సహాయం తీసుకోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా ఫోర్జరీకి అవకాశం లేకుండా మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.

భారతదేశంలో నివాసముండే వ్యక్తికి గనక తన ఆస్తిని విక్రయించినట్లైతే ఎన్ఆర్ఐ అనేక పన్ను ప్రయోజనాలను పొందుతారు. మీరు ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్ 80 సి కింద రూ.1.50 లక్షలు మినహాయింపును పొందవచ్చు. ఆస్తిని కొనుగోలు చేసిన మూడు సంవత్సరాలలోపు విక్రయించినట్లైతే, దాన్ని స్వల్పకాలిక మూలధన ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను విధించబడుతుంది. అదే మూడు సంవత్సరాల తర్వాత ఆస్తిని విక్రయించినట్లైతే, మీరు మరొక ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాల మూలధన లాభాల పన్ను తగ్గించుకోవడమనే ఎంపికను కలిగి ఉంటారు.

కాన్ఫెడరేషన్ అఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఆర్ఈడీఏఐ) ఎన్ఆర్ఐ ల కోసం ప్రొపర్టీ షోలను నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ వివిధ పెట్టుబడి మార్గాల గురించి ఎన్ఆర్ఐ లకు అవగాహన కల్పించి, వెంటనే పెద్ద బ్యాంకుల ద్వారా రుణాలను కూడా అందిస్తారు. సులువైన పెట్టుబడి మార్గాలతో పాటు, తక్కువ మొత్తంలో డౌన్ పేమెంట్ అవకాశాన్ని కూడా అందిస్తారు. అందువల్ల ఇండియాలో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడానికి ముందు కాన్ఫెడరేషన్ అఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అందించే అన్ని రకాల ఆఫర్లను పరిశీలించడం మంచిది.

సరైన డాక్యుమెంటేషన్ ఉన్నట్లయితే ఎన్ఆర్ఐ ఆస్తి కొనుగోలుకు సులభంగా నిధులను పొందవచ్చు. భారతదేశంలో వివిధ రకాల ఎన్ఆర్ఐ గృహ రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఆస్తి విలువలో 80 శాతం నిధులను బ్యాంకులు రుణ రూపంలో చెల్లించగా, మిగిలిన 20 శాతం నిధులను మీ సొంత వనరుల ద్వారా చెల్లించవలసి ఉంటుంది.

ఎస్బీఐ, హెచ్డీఏఫ్సీ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్ వంటి బ్యాంకులు స్థలం / ఫ్లాట్ / ఇల్లు కొనుగోలు, పునరుద్ధరణకు రుణాలను అందిస్తున్నాయి. దీనికి రుణ కాలం గరిష్టంగా 30 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ రుసుము 1 శాతం నుంచి 3 శాతం వరకు ఉంటుంది. రుణం పై వడ్డీ రేట్లు స్థిరంగా లేదా మారుతూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు ఎటువంటి ఛార్జీలు విధించకుండా ముందస్తు చెల్లింపులను అంగీకరిస్తాయి. వడ్డీ రేట్లు రుణ మొత్తంపై ఆధార‌ప‌డి ఉంటాయి. సాధార‌ణంగా 8.5 శాతం నుంచి అందుబాటులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని