chip shortage: చైనాకు కొరుకుడు పడని ‘చిప్‌’..!

సినిమా టిక్కెట్ల నుంచి ఆహార ధాన్యాల వరకు వేటికి డిమాండ్‌ ఉంటే వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకోవడం దళారుల పని. కొవిడ్‌ సమయం నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వినియోగించే చిప్స్‌కు భారీగా కొరత ఏర్పడింది.

Published : 19 Jul 2022 17:27 IST

 బ్లాక్‌మార్కెట్‌కు సెమీకండెక్టర్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా టిక్కెట్ల నుంచి ఆహార ధాన్యాల వరకూ వేటికి డిమాండ్‌ ఉంటే వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకోవడం దళారుల పని. కొవిడ్‌ సమయం నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వినియోగించే చిప్స్‌కు భారీగా కొరత ఏర్పడింది. ముఖ్యంగా చైనాలోని షెన్‌జన్‌ వంటి ఆటోమొబైల్‌ హబ్‌లలో  కొన్ని నెలలపాటు లాక్‌ డౌన్‌ విధించడం వీటికి ఆజ్యం పోసింది. ఫలితంగా చిప్స్‌ కొరత తీవ్రమైంది. దీంతో విదేశాల్లో దొరికే చిప్స్‌ కొనుగోలు చేసి చైనాలో విక్రయించడం లేదా.. విదేశీ విక్రయదారులను చైనాలో కొనుగోలుదారులతో కలపడం వంటి వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఓ ఆంగ్ల వార్తా సంస్థ ఓ దళారీని కలవగా అతడి వద్ద 62,000 మైక్రోచిప్స్‌ ఉన్నాయి. ఒక్కో చిప్‌కు 23.80 డాలర్ల విలువ ఉండగా.. అతడు వాటిని షెన్‌జెన్‌లో 375 డాలర్లకు విక్రయించేందుకు సిద్ధం అయ్యారు. మొత్తం ఏక మొత్తంలో కొనుగోలు చేస్తే చిప్‌ 100 డాలర్ల చొప్పున విక్రయించేందుకు సిద్ధం అయ్యారు. సింగపూర్‌కు చెందిన ఆ దళారీ వద్ద ఏకంగా 6.2 మిలియన్‌ డాలర్ల విలువైన సెమీకండెక్టర్లు ఉన్నాయి.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్‌ సంస్థలకు అవసరమైన 100 రకాల చిప్స్‌ను ఐదు ప్రధాన కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఈ చిప్స్‌ కావాలంటే కనీసం ఏడాది పాటు ఎదురు చూడాల్సిందే. ప్రధాన ఆటోమొబైల్‌ సంస్థలైన జనరల్‌ మోటార్స్‌, ఫోర్డ్‌ మోటార్స్‌, నిస్సాన్‌ వంటి సంస్థలు నేరుగా తయారీ దారులను చేరుకొని డీల్స్‌ చేసుకొంటున్నాయి. చైనా పరిస్థితి అస్పష్టంగా ఉందని అక్కడి బ్రోకర్లు, నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా కార్లు తయారు చేసేది చైనాలోనే. అయినా.. ఐరోపా,అమెరికా, తైవాన్‌ నుంచి వచ్చే చిప్స్‌పైనే ఆ దేశం ఆధారపడుతోంది. ఫలితంగా అక్కడ విద్యుత్తు వాహనాల బూమ్‌ మందగించే పరిస్థితి తలెత్తింది. మరో రెండు మూడేళ్లపాటు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. జీపెంగ్‌ సంస్థ చౌకగా లభించే చిప్స్‌ లభించక ఇబ్బందిపడింది. ఒక దశలో పొకెమాన్‌ టాయ్‌లో వాడే చిప్స్‌ కోసం కూడా అభ్యర్థించింది.

అంచనాలకు అందకుండా..

ప్రతి సాధారణ, విద్యుత్తు వాహనంలో వేల సంఖ్యలో చిప్స్‌ వినియోగిస్తారు. ఎయిర్‌ బ్యాగ్స్‌ పనితీరు నుంచి కారు నియంత్రణ, ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్‌, నేవిగేషన్‌ వరకూ.. ఇలా ప్రతి అంశంలో వీటి అవసరం ఉంటుంది. ఇన్ఫీనియోన్‌, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, ఎన్‌ఎక్స్‌పీ, ఎస్‌టీమైక్రో ఎలక్ట్రానిక్స్‌, రెన్సెస్‌ వంటి కంపెనీలు .. వాహనాలకు చిప్స్‌ను అందిస్తున్నాయి. ఇక్కడ పంపిణీదారుల నుంచి వచ్చే కొత్త ఆర్డర్‌ పూర్తిచేయడానికి సగటున 49 వారాల సమయం పడుతుంది. ఆయా రకాలను బట్టి 6 నుంచి 198 వారాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జర్మనీ సంస్థ ఇన్ఫీనియోన్‌ వేగంగా తయారీ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నా.. ఇది పూర్తిగా అందుబాటులోకి రావడానికి సమయం పట్టవచ్చు. 2023 వరకు చిప్స్‌ తయారీని ఆయా ఫౌండ్రీలకు ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తోంది.

తయారీ కూడా సంక్లిష్టమే..

* చిప్స్‌ను చాలా పరిశుభ్రమైన వాతావరణంలో అత్యంత కచ్చితత్వంతో ఖరీదైన పరికరాల సాయంతో తయారు చేస్తారు. 

* అత్యంత స్వచ్ఛమైన సిలికాన్‌ వేఫర్లను పొరలతో కూడిన చిప్స్‌గా తయారు చేయాలంటే కనీసం మూడు నెలల ప్రాసెసింగ్‌ సమయం పడుతుంది. అందుకే ప్రస్తుత డిమాండ్‌ను పూర్తి చేయడానికి సంవత్సరాలు పడుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. సరికొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ఏళ్లు పట్టవచ్చు.

* అత్యంత సూక్ష్మమైన చిన్న దుమ్మురేణువు కూడా చిప్‌ను ధ్వంసం చేస్తుంది. అందుకే వీటి తయారీ కేంద్రాల్లోకి వెళ్లేవారు పూర్తి సురక్షితమైన దుస్తులను, కళ్లజోళ్లను ధరిస్తారు. తయారీ గదుల్లో గాలి కింద నుంచి ప్రసరిస్తుంది. దుమ్ము కణాలు గాల్లోకి రాకుండా ఈ జాగ్రత్త తీసుకొంటారు. 

* రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కూడా చిప్స్‌ కొరతకు ఆజ్యం పోసింది. చిప్స్‌ తయారీకి వినియోగించే పల్లాడియంలో 44శాతం రష్యా నుంచి, నియోన్‌ 70శాతం ఉక్రెయిన్‌ నుంచి ఎగుమతి అవుతుంది. ఆటోమొబైల్‌, మొబైల్‌ ఫోన్స్‌, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఇవి చాలా కీలకం.

దళారుల నుంచి చిప్స్‌ కొనుగోలు..

చైనాలోని ఆటోమొబైల్‌ సంస్థలు షెన్‌జన్‌, గ్రేమార్కెట్‌, దళారులు సరఫరా చేసిన చట్ట విరుద్ధమైన, గుర్తింపు లేని చిప్స్‌ విక్రేతలపై ఆధారపడ్డాయి. గ్రేమార్కెట్‌ నుంచి వచ్చే చిప్స్‌ రిసైకిల్‌ అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లేబుల్స్‌పై సరైన సమాచారం లేకపోవచ్చు. అదే సమయంలో విక్రేతలు దానిని సరైన పద్దతిలో భద్రపర్చకపోతే పనితీరు కూడా నాసిరకంగా ఉంటుంది. ఇక దళారులు చిప్స్‌ ధరలను 10 నుంచి 20 రెట్లు  పెంచి విక్రయిస్తున్నారు. ప్రధాన సరఫరాదారుల నుంచి అందకపోవడంతో చాలా కంపెనీలు బ్రోకర్లను కూడా ఆశ్రయిస్తున్నాయి. కాకపోతే వీరు తగిన్నని సరఫరా చేయలేరు. 

చైనా సొంతగా చిప్‌ డిజైన్‌ సామర్థ్యం సాధించలేదు. దీనికి తోడు ఆటోమొబైల్‌ సంస్థలకు అవసరమైన చిప్స్‌ చేయడం మరింత కష్టం. కార్ల తయారీలో వాడే చిప్స్‌లో ఎంసీయూల( మైక్రో కంట్రోలర్స్‌) వాటా విలువ 30శాతం వరకు ఉంటుంది. ఈ విభాగంలో చైనా ఇంకా స్వయం సమృద్ధి సాధించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని