Credit Card: క్రెడిట్‌ కార్డు బకాయిలనూ బదిలీ చేసుకోవచ్చని తెలుసా?

Credit Card balance tranfer: క్రెడిట్‌ కార్డు బకాయిలు భారంగా మారినప్పుడు దాన్ని మరో కార్డుకు బదిలీ చేసుకునేందుకు కొన్ని సంస్థలు అనుమతి ఇస్తుంటాయి. ఎలా చేసుకోవాలి? ఏయే బ్యాంకులు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయో చూద్దాం..

Updated : 12 Jan 2023 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముందు కొనుగోలు చేసి తర్వాత చెల్లించడానికి వీలు కల్పించేదే క్రెడిట్‌ కార్డు (Credit Card). అయితే, దీన్ని సరిగా ఉపయోగించుకోవడానికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఎప్పటికప్పుడు ఖర్చులను ట్రాక్‌ చేస్తూ సకాలంలో చెల్లింపులు చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. లేదంటే ఆ ప్రభావం క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)పై పడుతుంది. ఎంత క్రమశిక్షణతో ఉన్నా.. ఒక్కోసారి సమయానికి డబ్బులు చేతిలో ఉండవు. సరిగ్గా అదే సమయంలో క్రెడిట్‌ కార్డు (Credit Card) బిల్లు చెల్లించాల్సిన గడువు సమీపిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అలాంటప్పుడు క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (Credit Card balance tranfer) ఆప్షన్‌ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.

ఏంటీ సదుపాయం?

ఒక క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ను మరో కార్డుకు బదిలీ చేస్తే దాన్నే క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (Credit Card balance tranfer)గా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఇతర బ్యాంకుల క్రెడిట్‌ కార్డుల (Credit Card)ను ఉపయోగిస్తున్న కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కార్డు జారీ సంస్థలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్డులోని అప్పుపై పడే అధిక వడ్డీ భారాన్ని తప్పించుకోవడానికి లేదా ఇతర బ్యాంకులు తక్కువ వడ్డీరేటును కల్పించినప్పుడు ఇది కస్టమర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది?

ఒక కార్డు నుంచి మరో కార్డుకు బకాయిలను బదిలీ (Credit Card balance tranfer) చేస్తే.. కొత్త కార్డు జారీ సంస్థ ఆ మొత్తాన్ని పాత కార్డు సంస్థకు చెల్లిస్తుంది. ఆ సొమ్మును కస్టమర్‌ కొత్త కార్డు సంస్థకు నియమ, నిబంధనలకు లోబడి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొంత సమయం ఇస్తారు. దానికి సున్నా వడ్డీరేటు లేదా నామమాత్రపు వడ్డీని మాత్రమే వసూలు చేస్తారు. కొత్త క్రెడిట్‌ కార్డు లిమిట్‌లో 75- 80 శాతం వరకు బ్యాలెన్స్‌ను బదిలీ చేయడానికి సంస్థలు అనుమతి ఇస్తాయి.

ప్రయోజనాలు..

క్రెడిట్‌ కార్డు (Credit Card) బిల్లు చెల్లించలేనప్పుడు కస్టమర్‌ దాన్ని బదిలీ చేసి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అలా అన్ని కార్డు బకాయిలను ఒకే దగ్గరకు చేర్చుకోవచ్చు. దీంతో బకాయిలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి.

బకాయిలను ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్న కార్డు సంస్థలు కచ్చితంగా తక్కువ వడ్డీరేటు ఆఫర్‌ చేస్తాయి. ఫలితంగా కొంత భారం తగ్గి త్వరగా చెల్లించేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఒకసారి చెల్లింపులు సకాలంలో చేయడం ప్రారంభిస్తే క్రెడిట్‌ స్కోర్‌ తిరిగి గాడిన పడుతుంది.

బ్యాలెన్స్‌ బదిలీ చేసిన తర్వాత దాన్ని చెల్లించేందుకు కొత్త కార్డు సంస్థలు కొంత సమయాన్ని ఇస్తాయి. అలా డబ్బును సర్దుబాటు చేసుకోవడానికి అదనపు సమయం లభిస్తుంది. ఈ కాలానికి కొన్ని సంస్థలు ఎలాంటి వడ్డీ వసూలు చేయవు. కొన్ని నామమాత్రపు వడ్డీరేటును వర్తింపజేస్తాయి. ఈ సమయంలో కొత్త కొనుగోళ్లు చేసేందుకు అవకాశమూ ఉంటుంది.

బదిలీ చేసిన బకాయిని తక్కువ వడ్డీరేటుతో నెలవారీ వాయిదాల (EMI) కిందకూ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.

అయితే క్రెడిట్‌ కార్డుల బకాయిల బదిలీ వల్ల కేవలం లాభాలే కాదు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.

బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌కు అనుమతి కోరుతూ అర్జీ పెట్టుకున్నప్పుడు సంస్థలు ఏమాత్రం జాప్యం చేసినా వడ్డీ పెరిగిపోతుంది. తీరా క్రెడిట్‌ స్కోర్‌, భారీ మొత్తంలో బకాయిల పేరిట కొత్త సంస్థ తిరస్కరిస్తే భారం మరింత ఎక్కువవుతుంది. మరోవైపు పలు కారణాలరీత్యా వడ్డీరేటులో రాయితీ ఇవ్వలేమని చెబితే అప్పటి వరకు అదనపు వడ్డీభారం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అవకాశం ఉంది కదా అని.. అన్ని బకాయిలను కొత్త కార్డు బదిలీ చేస్తే ఆ మొత్తాన్ని చెల్లించలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకవేళ సకాలంలో చెల్లించలేకపోతే వడ్డీ భారం అంతకంతకూ పెరుగుతూ పోతుంది.

బకాయిలు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడే కస్టమర్లు సాధారణంగా దాన్ని బదిలీ చేయాలని ఆలోచిస్తారు. అంటే కచ్చితంగా ఆ మొత్తం కొత్త కార్డు యుటిలైజేషన్‌ రేషియో కంటే ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఇది క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫీజు, కొత్త కార్డు వార్షిక రుసుములు అదనపు ఖర్చులు. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకొని లాభదాయకమనుకుంటేనే ఈ ఆప్షన్‌కు వెళ్లాలి.

ఈ సంస్థలు అందిస్తున్నాయి..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌ వంటి ప్రముఖ బ్యాంకులన్నీ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఇస్తున్నాయి. బ్యాంకుని బట్టి షరతులు, నియమనిబంధనలు మారతాయి.

ఎలా చేయాలి?

సంస్థ నియమ నిబంధనల ప్రకారం.. బ్యాంకు అర్హతగల కస్టమర్లకు మాత్రమే ఈ వెసులుబాటును కల్పిస్తాయి. బ్యాంకుల్లో దీనికి నిర్దిష్టమైన ఫారాలు ఉంటాయి. వాటిని పూర్తి చేసి క్రెడిట్‌ వివరాలు, పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు, క్రెడిట్‌ బిల్లు స్టేట్‌మెంట్ల వంటి ప్రాథమిక పత్రాలు జత చేసి ట్రాన్స్‌ఫర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఎలాంటి పత్రాలు అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో అర్జీ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మరికొన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్ మాధ్యమం ద్వారా కూడా ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి. క్రెడిట్‌ స్కోరు, బకాయి మొత్తం వంటి అంశాలన్నింటినీ పరిశీలించి బదిలీకి అనుమతి ఇస్తాయి. కొత్త కార్డు జారీ సంస్థలు పాత కార్డు సంస్థకు డీడీ, నెఫ్ట్‌ లేదా ఇతర మార్గాల్లో బకాయి మొత్తాన్ని చెల్లిస్తాయి. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని