Updated : 28 Feb 2022 15:09 IST

మీ పాన్ కార్డుపై ఎవ‌రైనా లోన్ తీసుకున్నారా? తెలుసుకునేదెలా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మునుప‌టి రోజుల్లో రుణం కోసం బ్యాంకుల‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. ద‌ర‌ఖాస్తు నుంచి మంజూరు అయ్యే వ‌ర‌కు చాలా ప్రాసెస్ ఉండేది. కానీ, ప్ర‌స్తుత కాలంలో రుణం పొంద‌డం చాలా సులువైంది. చాలా వ‌ర‌కు బ్యాంకులు, బ్యాంకేత‌ర సంస్థ‌లు ఆన్‌లైన్‌లోనే రుణాల‌ను అందిస్తున్నాయి. వివిధ‌ ఫిన్‌టెక్ సంస్థ‌లు, వాటి ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సుల‌భంగా రుణాలు అందించ‌డంలో ముందుంటున్నాయి. దీంతో ఈ ఫ్లాట్‌ఫామ్‌లు జనాలకు మ‌రింత‌ చేరువ అవుతున్నాయి. చేతిలో ఒక్క స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. కేవలం పాన్‌, ఆధార్ కార్డుల‌తో నిమిషాల వ్య‌వ‌ధిలోనే రుణ ద‌ర‌ఖాస్తు, మంజూరు ప్ర‌క్రియ రెండూ పూర్త‌యిపోతున్నాయి. దీన్ని అవ‌కాశంగా తీసుకుని కొంత మంది మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. వ్య‌క్తుల పాన్‌, ఆధార్ వివ‌రాల‌ను సేక‌రించి.. వారికి తెలియ‌కుండానే రుణం తీసుకుని జారుకుంటున్నారు. దీంతో సంబంధింత వ్య‌క్తుల క్రెడిట్ స్కోరు తీవ్రంగా ప్ర‌భావితం అవుతోంది.

ఇండియా బుల్స్ కన్జూమర్‌ ఫైనాన్స్ వారి ఫిన్‌కెట్ సంస్థ‌ ధ‌ని. ఇదో ఆన్‌లైన్ లెండింగ్ ఫ్లాట్ ఫామ్‌. ఈ యాప్‌లో ఎటువంటి పూచీక‌త్తూ లేకుండానే కేవ‌లం పాన్‌, ఆధార్ కార్డు వివ‌రాల‌తో నిమిషాల వ్య‌వ‌ధిలోనే రుణం మంజూరవుతుంది. దీన్ని అవ‌కాశంగా తీసుకుని ఈ యాప్ ద్వారా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.. త‌మ పాన్ కార్డుల‌ను వినియోగించి త‌మ‌కు తెలియ‌కుండానే రుణాలు తీసుకుంటున్నార‌ని చాలా మంది ఇటీవ‌ల ఫిర్యాదు చేస్తున్నారు. రుణాలు తీసుకోవ‌డ‌మే కాకుండా తిరిగి చెల్లించ‌క పోవ‌డంతో త‌మ క్రెడిట్ స్కోరు త‌గ్గిపోయింద‌ని పాన్ కార్డు హోల్డ‌ర్లు ఆందోళ‌న చెందుతున్నారు.

ఒకవేళ మీ పాన్ కార్డు కూడా దుర్వినియోగం అయ్యిందని భావిస్తున్నారా..? మీకు తెలియ‌కుండా మీ పాన్ కార్డును వినియోగించి ఎవ‌రైనా రుణం తీసుకున్నారని అనుమానిస్తున్నారా? అయితే సులువుగా తెలుసుకోవచ్చు. అలాంటిదేమైనా జరిగి ఉంటే.. సంబంధిత ఆన్‌లైన్ లెండింగ్ ఫ్లాట్‌ఫామ్‌కి వివ‌రాల‌తో ఫిర్యాదు చేయొచ్చు. మీ పేరుపై ఏమైనా రుణాలు ఉన్నాయా లేదా అనే వివరాలు మీ క్రెడిట్ రిపోర్టు ద్వారా సుల‌భంగా తెలుసుకోవచ్చు. సిబిల్‌, ఈక్వీఫ్యాక్స్, ఎక్స్‌పీరియన్, క్రిఫ్ హై మార్క్ వంటి సంస్థలు క్రెడిట్ రిపోర్టులు ఇస్తాయి. వీటిలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది సిబిల్ మాత్రమే.

పేటీఎం, బ్యాంక్ బజార్ లాంటి ఫిన్‌టెక్‌ సంస్థలు కస్టమర్లకు ఈ రిపోర్ట్స్ ఇస్తాయి. ఏదైనా ఒక ప్లాట్‌ఫామ్‌కు లాగిన్ అయ్యి పాన్ కార్డు వివ‌రాలతో పాటు మీ పేరు, పుట్టిన తేదీ, త‌దిత‌ర వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను న‌మోదు చేయ‌డం ద్వారా మీ క్రెడిట్ రిపోర్ట్ వివ‌రంగా పొందొచ్చు. ఇందులో మీ పాన్ కార్డును ఉప‌యోగించి ఇత‌రులు రుణం తీసుకుంటే మీకు తెలుస్తుంది. క్రెడిట్ రిపోర్టును ఎప్ప‌టిక‌ప్పుడు జనరేట్‌ చేసుకోవడం ద్వారా ఇలాంటి మోసాల‌ను అరిక‌ట్ట‌డంతో పాటు, క్రెడిట్ స్కోరును తెలుసుకుని, దాన్ని మ‌రింత మెరుగు ప‌ర్చుకునేందుకు కావాల్సిన ప్లాన్ చేసుకోవ‌చ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని