వ్యక్తిగత రుణమా.. క్రెడిట్‌కార్డా.. ఏది బెటర్‌?

వ్యక్తిగత రుణాలు సాధారణంగా క్రెడిట్ కార్డుల కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నవి

Updated : 25 Jun 2021 18:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థికంగా ఏదైనా అవసరం అయితే అందరికీ ఠక్కున గుర్తొచ్చేవి రెండే.. వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు. ఇవి పొందాలంటే రుణగ్రహీత వారి ఆస్తిని తనఖా పెట్టాల్సిన‌ అవసరం లేదు. కానీ, వీటిని పొందాలంటే మంచి క్రెడిట్ స్కోరు మాత్రం అవసరం. ఏదైనా అవసరం ఏర్పడిన సందర్భాల్లో ఈ రెండింట్లో ఏది ఎంచుకోవాలన్న సందేహం ఎదురవుతుంది. అలాంటప్పుడు దేన్ని ఎంచుకోవాలి అనే దాని గురించి  ఇప్పుడు తెలుసుకుందాం.

మెడికల్ బిల్లులు, వాహనాల కొనుగోలు, వివాహం, గృహ పునర్నిర్మాణం వంటి పెద్ద పెద్ద ఖ‌ర్చులకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. ఈ రుణాల‌పై వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డుల‌తో పోలిస్తే త‌క్కువ‌గా ఉంటాయి. అంతేకాకుండా వేగంగా చేతికొస్తాయి. త‌న‌ఖా లేకుండా, సులభంగా తిరిగి చెల్లించే అవ‌కాశం ఉంటుంది. అయితే, క్ర‌మమైన చెల్లింపు విధానం ఉండ‌టం వ‌ల్ల క్రెడిట్ కార్డుకు ఉన్నంత సౌక‌ర్యం ఉండ‌క‌పోవ‌చ్చు. అలాగే, చాలా వ‌ర‌కు బ్యాంకులు టాప్-అప్ లేదా రుణ పొడిగింపు కోసం అదనపు డాక్యుమెంట్ల‌ను అడుగుతాయి. ముందస్తు రుణం చెల్లింపు కోసం రుసుము కూడా వసూలు చేస్తాయి. ఒకవేళ క్రమబద్ధమైన రీతిలో తిరిగి చెల్లించాల‌నుకుంటే మాత్రం క్రెడిట్ కార్డు కంటే వ్యక్తిగత రుణాన్ని ఎంచుకోవడం ఉత్తమం.

ఇక క్రెడిట్‌ కార్డు విషయానికొస్తే.. స్వల్పకాలిక అవసరాల కోసం డబ్బు తీసుకోవడానికి అత్యంత అనుకూలమైన మార్గాల్లో ఇదొకటి. ఈ క్రెడిట్ కార్డులను నిత్యావ‌స‌రాలు, ఇత‌ర‌ షాపింగ్ లేదా గ్యాడ్జెట్ల కొనుగోలు వంటి చిన్న, పునరావృత ఖర్చుల కోసం ఉపయోగించొచ్చు. సకాలంలో తిరిగి చెల్లించగలిగితే క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. క్రమశిక్షణతో బిల్లుల‌ను చెల్లించేవారికి క్రెడిట్ కార్డ్ సౌక‌ర్యంవ‌తంగా ఉంటుంది. క్యాష్‌బ్యాక్, ట్రావెల్ కూపన్లు లేదా మియం లాంజ్‌ల‌కు ఉచిత ఆఫ‌ర్లు వంటివి కూడా పొందొచ్చు. నిర్ణీత తేదీకి ముందే మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లయితే క్రెడిట్‌కార్డులు మీకు వడ్డీ లేని రుణాన్ని అందించినట్లే. క్రెడిట్ కార్డు ఉప‌యోగించేవారికి ఇదో సానుకూల అంశం. అదే సమయంలో నిర్ణీత తేదీలోపు పూర్తి చెల్లింపు చేయక‌పోతే భారీ వడ్డీ భారం మోయాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణంతో పోలిస్తే ఈ వడ్డీరేట్లు అధికమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే నెలవారీ చెల్లింపులు, సరకుల కొనుగోళ్లు వంటి వాటికి క్రెడిట్‌ కార్డు ఉపయోగించడం మంచిది. అదే సమయంలో పెద్దమొత్తంలో అవసరమైనప్పుడు వ్యక్తిగత రుణం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని వీటి ఎంపికలో మీరు నిర్ణయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని