SWP: సిస్ట‌మేటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ ఎలా ప‌నిచేస్తుంది?

మ్యూచువ‌ల్ ఫండ్ నుండి బ్యాంక్ అకౌంట్‌కి నిర్దిష్ట టైమ్‌కి, నిర్దిష్ట మొత్తంలో న‌గ‌దు బ‌దిలీ కావ‌డాన్ని `సిస్ట‌మాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌` (ఎస్‌డ‌బ్ల్యూపీ) అంటారు.

Published : 06 Jan 2022 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టి, అందులో నుంచి నెల నెలా నిర్ధిష్ట మొత్తంలో న‌గ‌దును ఉపసంహరించుకోవచ్చు తెలుసా? దీనినే `సిస్ట‌మేటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌` (SWP) అని అంటారు. మీ ఆదాయ అవ‌స‌రాల‌కు అవసరమైన డబ్బును నెల నెలా అందేలా ఎస్‌డబ్ల్యూపీ పని చేస్తుంది. ఈ విధానం సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు బాగా ఉపయుక్తమని చెప్పొచ్చు. నెలనెలా విత్‌డ్రా అవ్వగా... మిగిలిన న‌గ‌దు మొత్తానికి అప్ప‌టి లాభాలను బ‌ట్టి కొద్ది కొద్ది మొత్తంలో డబ్బులు యాడ్ అవుతుంటాయి. అవసరమైతే విత్‌డ్రా మొత్తాన్ని పెంచుకోవ‌చ్చు కూడా. పెట్టుబ‌డిదారులు విత్‌డ్రా తేదీల‌ను నెల‌వారీ, త్రైమాసికం, అర్ధ సంవ‌త్స‌రం, వార్షికంగా సెట్ చేసుకోవ‌చ్చు.

సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)కి వ్య‌తిరేక దిశ‌లో సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (SWP) ప‌నిచేస్తుంది. బ్యాంక్ ఖాతా నుంచి మ్యూచువ‌ల్ ఫండ్‌కు ప్రతి నెలా స్థిర‌మైన మొత్తం క్ర‌మం త‌ప్ప‌కుండా బ‌దిలీ అవుతుంది. దీనినే ‘సిప్‌’ అంటారు. అదే మ్యూచువ‌ల్ ఫండ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి నిర్దిష్ట సమయానికి, నిర్దిష్ట మొత్తంలో న‌గ‌దు బ‌దిలీ కావ‌డాన్ని ‘సిస్ట‌మాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌’ (SWP) అంటారు. పెట్టుబ‌డిదారుడు ‘సిస్ట‌మాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌’ ద్వారా డబ్బులు పొందాలనుకున్నప్పుడు... వారికి చెందిన మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్లు రెడీమ్‌ అవుతాయి.  

విత్‌డ్రాయల్‌ లెక్క ఇదీ...

మీరు ₹10 ఎన్ఏవీతో ఒక ఫండ్‌లో ఏక‌ మొత్తంగా ₹ల‌క్ష ఇన్వెస్ట్ చేశారు. దాంతో ఆ ప‌థ‌కంలో 10,000 యూనిట్లు వచ్చాయి. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా విత్‌డ్రా చేయాల‌నుకునే మొత్తం ప్ర‌తి నెల ₹1000 అని అనుకుంటే... ఆ ఫండ్‌లోని ₹1000 విలువైన యూనిట్ల‌ను రెడీమ్‌ చేసి, ఆ డబ్బును మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.  సిప్‌ ప్రారంభించిన ఒక సంవ‌త్స‌రం త‌ర్వాత ఎస్‌డబ్ల్యూపీని ప్రారంభించారు అనుకుందాం. అప్పుడు విత్‌డ్రా తేదీ నాటికి ఆ ఫండ్‌ ఎన్ఏవీ ₹20 ఉంటే, 50 యూనిట్ల‌ను విక్ర‌యిస్తుంది. దీంతో యూనిట్ల సంఖ్య 9,950కి త‌గ్గుతుంది. త‌దుప‌రి నెల‌లో చెల్లింపు తేదీ నాటికి ఎన్ఏవీ ₹25కి చేరుకుంటే, ₹1000 చెల్లింపునకు ఫండ్ 40 యూనిట్ల‌ను విక్ర‌యిస్తుంది. అప్పుడు యూనిట్ల సంఖ్య 9,910కి త‌గ్గుతుంది.

అదే అప్పుడు కూడా ఎన్‌ఏవీ 20 రూపాయలే ఉంటే... 50 యూనిట్లు విక్రయిస్తుంది. ఇదీ లెక్క. ఈ విధంగా ఎస్‌డ‌బ్ల్యూపీ ద్వారా పెన్షన్‌ తరహాలో మంచి మొత్తం ప్రతినెలా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. మీ అవ‌స‌రాల‌కు తగ్గట్టు దీన్ని కొనసాగించొచ్చు. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌రింత రెడీమ్ చేసుకునే సదుపాయమూ ఉంది. ఒకవేళ దీర్ఘకాల పెట్టుబడికి సమయం లేకపోతే, డెట్ ఫండ్‌లో పెద్ద మొత్తంలో డబ్బు మదుపు చేసి, ఆ తర్వాత ఎస్‌డబ్ల్యూపీ ఎంచుకోవచ్చు.

గమనిక: సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ చేసినా, సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ ఎంచుకున్నా, ఆ ఫండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వారి అధీకృత వెబ్‌సైట్‌లో వివరాలు చెక్‌ చేసుకొని పెట్టుబడి ప్రారంభించగలరు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని