Published : 10 Jun 2022 14:52 IST

Credit Score: బ్యాంకు రుణాలు పొంద‌డంలో క్రెడిట్‌ స్కోరు ఎలా సాయపడుతుంది?

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్ కార్డులు (Credit card) క‌లిగిన వారికి, ఇప్ప‌టికే బ్యాంకు రుణాలు (Bank loan) పొందిన వారికి క్రెడిట్‌ స్కోరు (Credit Score) అనే ప‌దం సుప‌రిచిత‌మే. క్రెడిట్‌ స్కోరు అనేది కేవలం ఓ సంఖ్య మాత్ర‌మే కాదు.. అది మీకు వేగ‌వంత‌మైన‌, చౌకైన రుణాల‌ను పొంద‌డంలో సాయపడే శ‌క్తిమంతమైన సాధ‌నం. బ్యాంకు రుణాలు పొందాలంటే ఎవ‌రికైనా మంచి క్రెడిట్ చ‌రిత్ర ఉండాలి. అది లేనివారికి రుణాలు పొంద‌డంలో తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర‌వుతాయి. చిన్న రుణ సంస్థ‌ల్లో రుణాలు దొరికినా అధిక వ‌డ్డీకి రుణాలు ఇచ్చే సంస్థ‌ల చేతుల్లో ఇరుక్కుంటారు. క్రెడిట్ చ‌రిత్ర‌ను కాపాడుకుని మంచి సిబిల్ స్కోరును క‌లిగి ఉంటే మాత్రం రుణాలు పొంద‌డంలో గానీ, అద‌నంగా క్రెడిట్ కార్డుల‌ను పొంద‌డంలో గానీ ఇబ్బందులు ఏ మాత్రం ఉండ‌వ‌ని చెప్పొచ్చు.

క్రెడిట్ కార్డుపై ప‌రిమితుల‌ను బ్యాంకు నిర్ణ‌యిస్తుంది. క్రెడిట్ వినియోగంలో (కార్డు వాడ‌కంలో) ఉన్న పరిమితి కంటే 30% త‌క్కువ ఉండాల‌ని బ్యాంకింగ్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చాలా మందికి కీల‌క‌మైన రుణంలో గృహ రుణ‌మే పెద్ద అప్పు. ఈ రుణాన్ని వ్య‌క్తుల ద‌గ్గ‌ర చేయ‌లేం. బ్యాంకుల వ‌ద్ద‌కు వెళ్లాల్సిందే. కానీ స‌రైన క్రెడిట్ స్కోరు లేనిదే స‌ర‌స‌మైన వ‌డ్డీ రేటుకి బ్యాంకులు ఈ రుణాన్ని ఇవ్వవు.

ఇంటిని కొనుగోలు చేయ‌డం అనేది మీరు ఎప్పుడైనా తీసుకునే అత్యంత ముఖ్య‌మైన భావోద్వేగ‌, పెద్ద ఆర్థిక నిర్ణ‌యాల్లో ఒక‌టి. మీరు కుటుంబాన్ని ప్రారంభించాల‌న్నా లేదా ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత సొంతంగా ఇంటిని నిర్మించాలన్నా.. మెరుగైన సిబిల్ స్కోరు అవ‌స‌రం. ఈ స్కోరు 750 ఇంత‌కంటే ఎక్కువ ఉండాల‌ని బ్యాంకులు ఆశిస్తాయి. కానీ భార‌తీయుల్లో సిబిల్ స్కోరు 720 కంటే త‌క్కువ ఉన్న‌వారు ఎక్కువ మంది ఉన్న‌ట్లుగా బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.

రుణాలు పొంద‌డంలో క్రెడిట్ స్కోరు ప్ర‌ధాన‌ పాత్ర పోషిస్తుంది. మీ సిబిల్ స్కోరు నివేదిక మీ క్రెడిట్ ప్ర‌వ‌ర్త‌న‌కు ప్ర‌తిబింబం లాంటిది. రుణాల‌ను పొంద‌డంలో, సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. త‌మ క్రెడిట్ ఆరోగ్యాన్ని పెంచుకోవాల‌ని, క్రెడిట్‌ స్కోరుని మెరుగుప‌ర‌చుకోవాల‌ని చూస్తున్న వారి కోసం ఇక్క‌డ కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు ఉన్నాయి.

  • గృహ రుణమే కాదు.. విద్యా రుణం, మోటారు వాహ‌న రుణం, వ్య‌క్తిగ‌త రుణం ఏదైనా ఇత‌ర రుణాల‌ను పొంద‌డానికి ప్ర‌య‌త్నించేవారు ముందు మీ సిబిల్ స్కోరు నివేదిక‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌ర్య‌వేక్షించాలి. ఇది ఆరోగ్య‌క‌ర‌మైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్వ‌హించ‌డంలో సాయపడుతుంది. మీ నివేదిక‌ను త‌నిఖీ చేయ‌డం వ‌ల్ల మీ స్కోరులోని మార్పుల‌ను వేగంగా గ‌మ‌నించి క్రెడిట్‌ స్కోరును పెంచుకోవ‌డంలో శ్ర‌ద్ధ వ‌హించ‌వ‌చ్చు. ఆరోగ్య‌క‌ర‌మైన క్రెడిట్ రికార్డుని నిర్వ‌హించ‌డానికి సిద్ధం కావ‌చ్చు. మంచి క్రెడిట్‌ స్కోరును పొంద‌డానికి అన్ని రుణ‌ బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించ‌డమే గాక‌, ఆర్థికప‌ర‌మైన విష‌యాల్లో ప్ర‌తిసారీ బాధ్య‌తాయుత‌మైన ప్ర‌వ‌ర్త‌న‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో, సానుకూల క్రెడిట్ ప్రొఫైల్‌ను రూపొందించ‌డంలో చాలా మార్పులు తీసుకురావ‌చ్చు. ఇవి మీ క్రెడిట్ స్కోర్‌ని పెంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.
  • ఏదైనా రుణాల గురించి దర‌ఖాస్తు చేసేట‌ప్పుడు ప‌రిశోధ‌న చేసి చ‌క్క‌టి ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించాలి. ఒకే స‌మ‌యంలో అనేక బ్యాంకుల‌, రుణ సంస్థ‌ల నుంచి వెంట వెంట‌నే రుణాల కోసం దర‌ఖాస్తు చేయ‌కూడ‌దు. ఎవ‌రైనా కూడా రుణ స‌మ‌స్య‌ల‌తో ఉన్న‌ట్లు రుణ సంస్థ‌ల‌కు క‌నిపించ‌కుండా ఉండ‌టం మంచిది. కాబ‌ట్టి రుణ విచార‌ణ‌ల‌ను తెలివిగా, ఓపిగ్గా చేయ‌డం మంచిది.
  • ఏదైనా రుణాల‌కి స‌హ సంత‌కం గానీ, రుణ హామీ సంత‌కం గానీ చేస్తే.. ఆ రుణాల ప్ర‌భావం కూడా మీపై ఉంటుంది. ఆ రుణాలు తీసుకున్న వారు స‌రిగా చెల్లింపులు చేయ‌క‌పోయినా వారికి హామీగా సంత‌కం చేసినందుకు మీ క్రెడిట్ స్కోరు, ప్రొఫైల్‌పై కూడా ప్ర‌భావం ఉంటుంది. ఆయా రుణ ఖాతాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌ర్య‌వేక్షించ‌డం వ‌ల్ల మీ క్రెడిట్ స్కోరు వేరొక‌రి నిర్ల‌క్ష్యం వ‌ల్ల ప్ర‌భావితం కాకుండా ఉంటుంది.
  • సిబిల్ స్కోరును రుణ సంస్థ‌లు మాత్ర‌మే త‌నిఖీ చేస్తాయని అనుకోవ‌ద్దు. కొన్ని మెట్రో న‌గ‌రాల్లో, పెద్ద ప‌ట్ట‌ణాల్లో అద్దెకు నివాసం గానీ, ఏదైనా వాణిజ్య స్థలంలో అద్దెకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు కూడా వాటి య‌జ‌మానులు అద్దెకు సంప్ర‌దించేవారి క్రెడిట్ స్కోర్‌ను వాక‌బు చేస్తున్నారు. కార‌ణమేమిటంటే అద్దెకు తీసుకునే వారి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ, న‌మ్మ‌కాన్ని క్రెడిట్ స్కోరుతో బేరీజు వేసుకుంటున్నారు. ఈ సంస్కృతి ఇప్ప‌టికే పెద్ద న‌గ‌రాల్లో ఉన్నా, భ‌విష్య‌త్తులో దేశంలో అన్ని ప్రాంతాల‌కు విస్త‌రిస్తుంది. కాబట్టి, క్రెడిట్ స్కోరుని కాపాడుకోవ‌డం అంటే మ‌నం ఆర్థికంగా మ‌న‌ల్ని కాపాడుకున్న‌ట్లే.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని