Fed Rate Hike: అమెరికాలో వడ్డీరేట్లు పెరిగితే మన మార్కెట్లు ఎందుకు వణుకుతాయి?.. 10 పాయింట్స్‌

US interest rates affect on Indian stock markets: ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయాలు మన మార్కెట్లను ఎలా ప్రభావితం చేస్తాయి?

Published : 16 Jun 2022 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కీలక వడ్డీ రేటును 0.75 శాతం పెంచుతున్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌  (US Fed) బుధవారం ప్రకటించింది. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు కావడం గమనార్హం. అమెరికా ద్రవ్యోల్బణం మేలో 41 ఏళ్ల 8.6 శాతానికి చేరడంతో అదుపు చేసేందుకు ఫెడ్‌ రేట్ల పెంపునకు మొగ్గు చూపింది. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో మన మార్కెట్లు (Stock market) గురువారం నాటి ట్రేడింగ్‌లో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఉదయం లాభాల్లో కొనసాగినప్పటికీ సాయంత్రానికి భారీగా పతనమయ్యాయి. అమెరికా ఫెడ్‌ సమావేశమైన ప్రతిసారీ ఇదే తంతు. ఈ రేటు పెంపు ముందుగా ఊహించినదే. దీంతో ఆ ప్రభావం మార్కెట్లపై చాలా రోజుల నుంచే ఉంటోంది. అయినా అర శాతం కంటే ఎక్కువ పెంపు ఉండడంతో ఆ ప్రభావం నేడూ కొనసాగింది. ఇంతకీ అక్కడి నిర్ణయాలు మన మార్కెట్లను ఎలా ప్రభావితం చేస్తాయి? 10 పాయింట్లలో..

  1. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అసలు విదేశీయులు భారత్‌లో ఎందుకు మదుపు చేస్తారు? అమెరికాలో ఎందుకు చేయరు? అనే విషయం తెలియాలి. అమెరికా ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశం. భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ముందుంది. అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధికి ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి.
  2. అమెరికాతో పోలిస్తే భారత్‌లో వడ్డీరేట్లు ఎక్కువ. దీంతో విదేశీ మదుపర్లు అక్కడ తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని అధిక రాబడికి అవకాశం ఉన్న భారత మార్కెట్లలో మదుపు చేస్తారు. దీంతో వారికి భారీ ఎత్తున ఆదాయం లభిస్తుంది.
  3. ఉదాహరణకు.. థామస్‌ అనే మదుపరి అమెరికాలో 3% వడ్డీరేటుతో రూ.1లక్ష రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని ఆయన భారత స్టాక్‌ మార్కెట్లలో మదుపు చేశారు. ఇక్కడ సగటున 12% రాబడి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ థామస్‌ రూ.1 లక్ష భారత్‌లో రుణంగా తీసుకుంటే 7-8% వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఇలా తక్కువ వడ్డీరేటు ఉన్న మార్కెట్ల నుంచి రుణం తీసుకొని వాటిని ఎక్కువ రాబడికి అవకాశం ఉన్న మార్కెట్లలో మదుపు చేసి లబ్ధి పొందుతుంటారు.
  4. అమెరికా వడ్డీరేట్లు పెంచితే ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ప్రభావితమవుతాయి. అక్కడ రేట్లు పెరగ్గానే విదేశీ మదుపర్లు ఇక్కడి నుంచి తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటారు.
  5. వడ్డీరేట్లు పెరిగితే బాండు ఈల్డులు కూడా పెరుగుతాయి. స్టాక్‌ మార్కెట్లతో పోలిస్తే ఇవి సురక్షితమైన పెట్టుబడులు. అందుకే భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకొని చాలా మంది మదుపర్లు తమ సొంత దేశ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తారు.
  6. వడ్డీరేట్లు పెరిగే కొద్దీ డాలర్‌ బలపడుతుంది. ఫలితంగా రూపాయి విలువ పతనమవుతుంది. దీంతో ఇక్కడ విదేశీయులు చేసిన మదుపు వల్ల వచ్చే రాబడిలో కోత పడుతుంది. కాబట్టి రూపాయి విలువ క్షీణించినా విదేశీ మదుపరులు అమ్మకాలకు దిగుతుంటారు. 
  7. దీర్ఘకాల మదుపర్లు వడ్డీరేట్ల పెంపు వల్ల పెద్దగా ఆందోళన చెందబోరు. కానీ, స్వల్పకాలం కోసం మదుపు చేసేవారు తమ పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకుంటారు. ఇది మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలడానికి దారి తీస్తుంది. 
  8. మదుపర్లతో పాటు ఆర్‌బీఐ కూడా ఫెడ్‌ నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తుంది. ఒకవేళ విదేశీ మదుపర్లు వేగంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటే విదేశీ మారక నిల్వలు పడిపోయే అవకాశం ఉంది. అయితే, ఆర్‌బీఐ ఎప్పుడూ రిస్క్‌ను దృష్టిలో పెట్టుకొని సరిపడా నిల్వలు నిర్వహిస్తుంది. ఇక మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని పరిమితం చేయడం అనివార్యమైతే వడ్డీరేట్లు తగ్గిస్తుంది. తద్వారా దేశీయ రిటైల్‌ మదుపర్లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు.
  9. 2019లో ఆర్థిక వృద్ధి మందగించడంతో ప్రజల్లో వినియోగం పెంచడానికి అమెరికా వడ్డీరేట్లను తగ్గించింది. అలా ఆ సంవత్సరంలో మొత్తం మూడు సార్లు వడ్డీరేట్లలో కోత విధించింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అక్కడ మూడోసారి రేట్ల కోత ప్రకటించిన తర్వాతి రోజు ఇక్కడ సెన్సెక్స్ రికార్డు స్థాయికి చేరుకుంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు వడ్డీరేట్లను తగ్గించిన ప్రతిసారీ భారత స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడతాయి. పైగా భారత్‌లో ద్రవ్యోల్బణం కూడా మరీ కలవరపెట్టే స్థాయికి చేరుకునే అవకాశాలు చాలా తక్కువ.
  10. వడ్డీరేట్ల పెంపు ఒక్కరోజులో తీసుకునే నిర్ణయం కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అనుసరించి సుదీర్ఘ చర్చల అనంతరం తుది నిర్ణయానికి వస్తారు. ఈలోపే సంకేతాలు బయటకువెళతాయి. వాటిని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునే మదుపర్లు ముందే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. భారీ నష్టాల నుంచి తప్పించుకుంటారు. అందుకే వడ్డీ రేటు పెంపు గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తుండడంతో విదేశీ మదుపర్లు కొన్ని నెలలుగా మన మార్కెట్ల నుంచి తరలిపోతున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని