Mutual Funds: మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మొద‌టిసారి ఇన్వెస్ట్ చేస్తున్నారా?

ఈక్విటీ ఫండ్లలో సిప్‌ ద్వారా దీర్ఘ‌కాలం మ‌దుపు చేస్తే మంచి రాబ‌డిని పొందొచ్చు. 

Published : 04 Jan 2022 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ‌నం ఆదా చేసిన డ‌బ్బును మ‌దుపు చేస్తేనే మంచి రాబ‌డి పొంద‌గ‌ల‌ం. నీటిలో దిగితే గానీ లోతు తెలియ‌దు. అలాగే పెట్టుబ‌డులు మొద‌లు పెడితే గానీ వాటి ప‌నితీరు అర్థం కాదు. మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్టుబ‌డులు మొద‌లు పెట్టాల‌నుకోవ‌డం మంచి నిర్ణ‌య‌మే. అయితే ఇప్ప‌టికే మ్యూచువ‌ల్ పండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన వారిని చూసి.. ఈక్విటీ ఫండ్లు మంచి రాబ‌డి ఇస్తున్నాయ‌ని, వాటి గురించి పెద్దగా అవగాహన తెచ్చుకోకుండా ఎక్కువ మొత్తంలో మదుపు చేయ‌డం తెలివైన నిర్ణ‌యం కాదు. ఈక్వీటీ ఫండ్లు మంచి రాబ‌డిని ఇస్తాయ‌నేది వాస్త‌వ‌మే.. అయిన‌ప్ప‌టికీ ఎప్పుడూ లాభాలే వ‌స్తాయ‌ని చెప్ప‌డం కష్టం. మంచి రాబ‌డి పొందేందుకు కొంత ఓర్పు, స‌హ‌నంతో వేచి ఉండడం అవ‌స‌రం. మీరు చూసిన మ‌దుప‌ర్లు ఎంతో కాలం నుంచి పెట్టుబ‌డులు పెడుతూ ఉండొచ్చు. అలాగే వారు మార్కెట్లు త‌క్కువ‌లో ఉన్న‌ప్పుడు మ‌దుపు చేయ‌డం ప్రారంభించి రెండంకెల వృద్ధి రేటును పొందుతూ ఉండొచ్చు. కానీ మీరు మొద‌టి సారిగా పెట్టుబ‌డులు పెడుతున్నారు. కాబ‌ట్టి మ్యూచువ‌ల్ ఫండ్లు మార్కెట్ రిస్క్‌ల‌కు లోబ‌డి ఉంటాయ‌ని తెలుసుకుని స‌రైన విధంగా మ‌దుపు చేయాల్సి ఉంటుంది.

ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులొద్దు: మ‌దుప‌ర్లు ఈక్విటీల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో మ‌దుపు చేయ‌డం నివారించాలి. ఎందుకంటే ప్ర‌తికూల ప‌రిస్థితుల కార‌ణంగా రాబ‌డి త‌గ్గినా, న‌ష్ట‌పోయే ప‌రిస్థితులు ఏర్పడినా మ‌దుప‌ర్లు నిరాశ‌కు గురికావ‌చ్చు. ప్రత్యేకించి మొదటిసారి మ‌దుపు చేసిన‌వారు, మూల‌ధ‌న త‌గ్గింపు ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌నివారు అటువంటి పరిస్థితిలో, భయాందోళనలకు గురయ్యే ప్ర‌మాదం ఉంది. అనుభవం లేని కార‌ణంగా మ‌దుప‌ర్లు తమ డబ్బును వెనక్కి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించి.. త‌ద్వారా నష్టాలను చవిచూస్తారు. అందువ‌ల్ల ఈక్విటీ ఫండ్లలో మ‌దుపు చేసేవారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌) ద్వారా మ‌దుపు చేయాలని నిపుణులు స‌ల‌హా ఇస్తుంటారు. 

త‌క్కువ రిస్క్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు: మొద‌టిసారిగా పెట్టుబ‌డులు చేసే మ‌దుప‌ర్లు మార్కెట్ హెచ్చుత‌గ్గుల‌ను అర్థం చేసుకుని అల‌వాటు ప‌డేంత వ‌ర‌కు ఈక్వీటీల‌కు బ‌దులు బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌డం మంచిది. ఈక్విటీ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం అధికంగా ఉంటుంది. వీటితో పోలిస్తే బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో.. మార్కెట్ల అనిశ్చితి స‌మ‌యంలోనూ త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉంటుంది. మొద‌టిసారి మ‌దుపు చేసేవారు ఒత్తిడికి గురికాకుండా దీర్ఘకాలం పాటు ధైర్యంగా పెట్టుబ‌డులు కొన‌సాగించేందుకు ఇవి స‌హ‌క‌రిస్తాయి. ఈక్విటీ ఫండ్స్ ఎంచుకున్నట్టయితే తక్కువ రిస్క్ ఉన్న ఇండెక్స్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు.

ఆర్థిక ప్ర‌ణాళిక‌: పెట్టుబ‌డిదారుల‌కు ఆర్థిక ప్ర‌ణాళిక చాలా ముఖ్యం. ఎలాంటి ప్ర‌ణాళికా లేకుండా రాబ‌డిని మాత్ర‌మే దృష్టిలో పెట్టుకుని ఈక్వీటీల్లో మ‌దుపు చేస్తే, స్వ‌ల్ప కాలంలో ఏర్ప‌డే హెచ్చుత‌గ్గుల‌కు భ‌య‌ప‌డి పెట్టుబ‌డులు వెన‌క్కి తీసుకుని న‌ష్ట‌పోయే అవ‌కాశాలు ఉన్నాయి. అదే స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక ప్రకారం దీర్ఘ‌కాలిక ఆర్థిక ల‌క్ష్య సాధ‌న‌ కోసం ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లో మ‌దుపు చేయ‌డం ప్రారంభిస్తే స్వ‌ల్ప‌కాలిక హెచ్చుత‌గ్గుల ప్ర‌భావం మ‌దుప‌ర్లపై చూపించ‌దు. దీర్ఘ‌కాలంపాటు కొన‌సాగిస్తే మంచి రాబ‌డి పొందేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి. కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు మీరు ఎంచుకున్న ల‌క్ష్యం, అందుకు ఉన్న కాల‌వ్య‌వ‌ధిని తెలుసుకుని ఏ కేటగిరీ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవడానికి ఆర్థిక ప్రణాళిక వేయడం మంచిది.

మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్‌ పద్ధతి (లేదా వారి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా అయినా)లో మ్యూచువల్ ఫండ్‌ సలహాదారుని ద్వారా మదుపు చేయొచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్‌సైట్లు (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  యాప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్లో మదుపు చేయొచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్‌ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. దీర్ఘకాలంలో దీని ప్రభావం అధికంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని