EV Insurance: విద్యుత్‌ Vs ఇంధన వాహనాలు.. బీమా ప్రీమియం ఎలా ఉంటుంది?

EV Insurance: సాధారణంగా పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ ఆధారిత వాహనాల్లో ఇంజిన్‌ సామర్థ్యాన్ని బట్టి బీమా ప్రీమియంను నిర్ణయిస్తారు. ఈవీల ప్రీమియం నిర్ధారణకు బ్యాటరీ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

Updated : 21 Mar 2023 13:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్తు వాహనాల (Electric vehicles- EV)కు గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది. దిల్లీలో వీటి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేవలం మెట్రో నగరాల్లోనే కాదు.. చిన్న చిన్న పట్టణాల్లో వీటికి ఆదరణ పెరుగుతోంది. చట్టప్రకారం  ఏ వాహనానికైనా బీమా తీసుకోవాల్సిందే! మరి ఇంధన ఆధారిత వాహనాలతో పోలిస్తే ఈవీలపై ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఎలా ఉంటుంది? చూద్దాం..

బ్యాటరీ ఆధారంగానే..

సాధారణంగా పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ ఆధారిత వాహనాల్లో ఇంజిన్‌ సామర్థ్యాన్ని బట్టి బీమా ప్రీమియంను నిర్ణయిస్తారు. ఎక్కువ క్యూబిక్‌ కెపాసిటీ ఉంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈవీల్లో ఇంజిన్‌ ఉండదు కదా! అందుకే విద్యుత్తు వాహనాల్లో బ్యాటరీ కెపాసిటీని బట్టి ప్రీమియంను నిర్ధారిస్తారు. ఎక్కువ కిలోవాట్ల బ్యాటరీకి ఎక్కువ ప్రీమియం అన్నమాట!

ఈవీ బీమా ఖరీదైనదా?

చట్టప్రకారం ప్రతి వాహనానికి థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. దీంట్లో ఈవీ, ఇంజిన్‌ ఆధారిత వాహనాలనే తేడా ఏమీ లేదు. అయితే, హరిత ఇంధన వాహనాలను ప్రోత్సహించడం కోసం బీమా నియంత్రణా సంస్థ ఐఆర్‌డీఏఐ ఈవీల బీమా ప్రీమియంపై 15 శాతం రాయితీనిస్తోంది. 30 కిలోవాట్ల కంటే తక్కువ సామర్థ్యం బ్యాటరీలున్న వాహనాలకు థర్డ్‌ పార్టీ బీమా తీసుకుంటే ప్రీమియం దాదాపు రూ.1,700 వరకు, అదే 65 కిలోవాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే సుమారు రూ.6,700 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 30-65 కిలోవాట్ల బ్యాటరీ ఉన్న వాహనాలకు బీమా తీసుకుంటే రూ.2,700 వరకు ప్రీమియం ఉండే అవకాశం ఉంది.

అదే ఇంధన ఆధారిత వాహనాల్లో 1,499 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటికి రూ.7,800 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి పన్నులు అదనం. అదే 1,000 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉంటే బీమా ప్రీమియం రూ.2,100 వరకు ఉంటుంది.

భవిష్యత్‌లో తగ్గొచ్చు..

ఈవీల్లో కీలక భాగం బ్యాటరీలే. అయితే, వీటితో రిస్క్‌ ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంటుంది. ఇంకా ఈ రంగం ప్రాథమిక దశలోనే ఉన్న నేపథ్యంలో ఈవీల రిస్క్‌ ప్రొఫైలింగ్‌ ఇంకా జరగాల్సి ఉంది. అదే ఇంధన ఆధారిత వాహనాల్లో ఉండే రిస్క్‌లు ఏంటో ఇప్పటికే కచ్చితమైన అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో ఈవీల విషయంలో స్పష్టత వచ్చే కొద్దీ బీమా ప్రీమియం సైతం తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరింత రక్షణ కోసం..

సాధారణ ఇంధన ఆధారిత వాహనాలకు చేసినట్లుగా ఈవీల మరమ్మతు అంత సులభం కాదు. ప్రత్యేక నిపుణులు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అంతర్గత భాగాల్లో వచ్చే సమస్యల్ని పరిష్కరించడం అంత సులభం కాదు. అందుకే సమగ్ర బీమా తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే బేసిక్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌కు యాడ్‌-ఆన్‌లు జత చేసుకోవాలి. రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, బ్యాటరీ ప్రొటెక్షన్‌ వంటి అదనపు ఫీచర్లను బీమాకు జత చేసుకుంటే మంచిది.

  • మరోవైపు ఆన్‌లైన్‌లో వివిధ కంపెనీలు అందించే పాలసీలను పోల్చి చూసుకొని ప్రీమియంను మరింత తగ్గించుకునే అవకాశం ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని