అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌లో క‌నీస పెన్ష‌న్ ఎంచుకున్నవారు ఎంత శాతం?

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ఖాతా తెరిచే యువ‌కుల సంఖ్య పెరిగింద‌ని స‌ర్వే తెలిపింది.

Updated : 01 Feb 2022 11:15 IST

ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన‌ ఆర్ధిక స‌ర్వే 2021-22 ప్ర‌కారం అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (ఏపీవై)లో 78% మంది చందాదారులు కేవ‌లం రూ. 1000 నెల పెన్ష‌న్‌ను ఎంచుకున్నారు. 14% మంది చందాదారులు రూ. 5000 పెన్ష‌న్‌ను ఎంచుకున్నారు. నెల‌కు రూ. 2000, 3,000, 4,000 పెన్ష‌న్‌ను ఎంచుకున్న చందాదారుల వాటా 8 శాతంగా ఉంద‌ని ఆర్దిక స‌ర్వే తెలిపింది.

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ఖాతా తెరిచే యువ‌కుల సంఖ్య పెరిగింద‌ని స‌ర్వే తెలిపింది. అయితే, స్కీమ్‌లో చిన్న వ‌య‌స్సులోనే జాయిన్ అయితే మంచిది. కంట్రిబ్యూష‌న్ త‌గ్గుతుంది. ఈ స్కీమ్‌లో సెప్టెంబ‌ర్ 2021 నాటికి 43% కంటే ఎక్కువ మంది స‌భ్యులు 18-25 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సుగ‌ల వారు జాయిన్ అయిన వారిలో ఉన్నారు. మార్చి 2016లో ఈ వ‌య‌స్సు వారు జాయిన్ అయింది 29% మందే ఉన్నారు. మ‌హిళా చందాదారులు కూడా ఈ స్కీమ్‌లో సెప్టెంబ‌ర్ 2021 నాటికి 44% మంది జాయిన్ అయ్యార‌ని ఆర్ధిక స‌ర్వే తెలిపింది.

స‌ర్వే ప్ర‌కారం కొత్త పెన్ష‌న్ స్కీమ్ (ఎన్‌పీఎస్‌), అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న కింద మొత్తం చందాదారులు సంఖ్య సెప్టెంబ‌ర్ 2021 నాటికి 4 కోట్ల 63 ల‌క్ష‌ల‌కు పెరిగింది. అంత‌కు ముందు ఏడాదితో చూసుకుంటే ఇది 23.7% వృద్ధి.

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న 9 తేదీ మే, 2015లో ప్రారంభించ‌బ‌డింది. భార‌తీయులంద‌రికీ, ముఖ్యంగా పేద‌లు, నిరుపేద‌లు, అసంఘ‌టిత రంగంలోని కార్మికుల కోసం సామాజిక భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను రూపొందించ‌డానికి అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న.. పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ద్వారా నిర్వ‌హించ‌బ‌డుతుంది. అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న అనేది రూ. 1000 - రూ. 5000 వ‌ర‌కు హామీ ఇవ్వ‌బ‌డిన పెన్ష‌న్ ప‌థ‌కం. ఎటువంటి చ‌ట్ట‌బ‌ద్ద‌మైన సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల ప‌రిధిలోకి రాని, ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపుదారు కానీ వారికి ప్ర‌భుత్వంచే కంట్రిబ్యూష‌న్‌లో స‌హ‌కారం అంద‌చేయ‌బ‌డుతుంది. జూన్ 1, 2015 నుండి మార్చి 31, 2016 మ‌ధ్య కాలంలో స్కీమ్‌లో చేరిన అర్హులైన ప్ర‌తి చందాదారుకు 5 ఏళ్ల పాటు భార‌త ప్ర‌భుత్వం స‌హ‌కారం అంద‌చేస్తుంది.

అర్హ‌తః

18-40 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న అర్హ‌తగ‌ల (అసంఘ‌టిత రంగంలో ప‌నిచేసే) భార‌త‌దేశ పౌరులంద‌రికీ అటల్ పెన్ష‌న్ యోజ‌నలో చందాదారులుగా న‌మోదు కావ‌చ్చు. ఈ చందాకు బ్యాంక్ ఖాతా త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. చందాదారులు నెల‌వారీ, త్రైమాసిక‌, అర్ధ వార్షిక ప్రాతిప‌దిక‌న ఈ పెన్ష‌న్ స్కీమ్‌కి చందా ఇవ్వ‌వ‌చ్చు. చందాదారులు కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి స్వ‌చ్ఛందంగా ఈ స్కీమ్ నుండి కూడా నిష్క్ర‌మించ‌వ‌చ్చు

60 ఏళ్ల అనంత‌రం నెల‌వారీ పెన్ష‌న్ చందాదారునికి అందుబాటులో ఉంటుంది. పెన్ష‌న్ తీసుకునే వ్య‌క్తి మ‌ర‌ణానంత‌రం నామినీకి  (చందాదారుని 60 ఏళ్ల వ‌య‌స్సు వ‌ర‌కు సేక‌రించ‌బ‌డిన) పెన్ష‌న్ నిధి తిరిగి ఇవ్వ‌బ‌డుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని