Kisan vikas patra: డ‌బ్బు ఎంత కాలానికి రెట్టింపు అవుతుంది? 

ప్ర‌స్తుతం ఉన్న వార్షిక వ‌డ్డీ రేటు 6.9 శాతం ప్ర‌కారం.. దీని ప్రకారం పెట్టుబడి రెట్టింపు అవ్వడానికి ఎంత కాలం పడుతుందో చూద్దాం. 

Updated : 26 Nov 2021 17:09 IST

పోస్టాఫీస్ అందించే పొదుపు ప‌థ‌కాల‌లో కిసాన్ వికాస్ ప‌త్ర ఒక‌టి.  కచ్చితమైన రాబడి ఆశించేవారికి సురక్షితమైన పెట్టుబడి మార్గం ఇది. ఈ ప‌థకంలో పెట్టుబ‌డి పెట్టిన మొత్తం 124 నెల‌ల్లో రెట్టింపు అవుతుంది. క‌నీసం రూ.1000 తో పెట్టుబ‌డులు ప్రారంభించ‌వ‌చ్చు. గ‌రిష్ట ప‌రిమితి లేదు. ఒక వ్య‌క్తి ఒక‌టి కంటే ఎక్కువ కేవీపీ ఖాతాల‌ను తెరిచే వీలుంది. ఒక వ్యక్తి మరొకరికి కేవీపి ప‌త్రాల‌ను బదిలీ చేసుకోవచ్చు. రుణం కూడా ఇస్తారు. ఇందుకు కేవీపి తీసుకున్న వ్య‌క్తి సంబంధిత పోస్టాఫీస్‌కి అంగీకార ప‌త్రంతో కూడిన ద‌ర‌ఖాస్తు ఫారంను ఇవ్వాల్సి ఉంటుంది. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు కూడా బదిలీచేసుకునే వీలుంది. మెచ్యూరిటీ తేదిని స‌ర్టిఫికేట్‌లో ముద్రిస్తారు.

కిసాన్‌ వికాస్‌ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టేందుకు కనీస వయసు 18 సంవత్సరాలు. వ్య‌క్తిగ‌తంగా గానీ, ఉమ్మ‌డిగా గానీ ఖాతా తెరవవచ్చు. గరిష్టంగా ముగ్గురు పెద్దలు ఉమ్మడి ఖాతాను తెరవచ్చు. 10 ఏళ్లు నిండిన‌ పిల్లల పేరుతో కూడా ఖాతా తెర‌వ‌చ్చు. పిల్ల‌ల త‌ర‌పున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు(గార్డియ‌న్‌) ఖాతా తెర‌వాల్సి ఉంటుంది. నామినీని ఏర్పాటు చేసే వీలుంది. ఖాతా తెరిచేందుకు, ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడి కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్ లో ఏదైనా గుర్తింపు పత్రాన్ని ఇవ్వాలి. ఖాతా తెరిచిన రెండున్న‌ర సంవ‌త్స‌రాల త‌రువాత ష‌ర‌తుల‌కు లోబ‌డి ముంద‌స్తు విత్‌డ్రాలు అనుమతిస్తారు.

ఈ ప‌థ‌కం వ‌డ్డీ రేటును కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది. త్రైమాసికంగా (ప్ర‌తీ మూడు నెల‌ల‌కు ఒక‌సారి) వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వం స‌వ‌రిస్తుంది. ఖాతా తెరిచే స‌మ‌యంలో ఉన్న వ‌డ్డీ రేటు కాల‌ప‌రిమితికి మొత్తం వ‌ర్తిస్తుంది. ఉదాహర‌ణ‌కి, ఒక వ్య‌క్తి కిసాన్ వికాస్ ప‌త్ర ఖాతాను జ‌న‌వ‌రి-మార్చి 2020 త్రైమాసికంలో తెరిచి ఉంటే, అత‌ను/ఆమె మెచ్యూరిటి వ‌ర‌కు వార్షికంగా 7.6 శాతం వ‌డ్డీని పొందుతారు. కొత్త‌గా అంటే ప్ర‌స్తుత త్రైమాసికంలో ఖాతా తెరిచే వారికి వార్షికంగా 6.9 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇదే వ‌డ్డీ మెచ్యూరిటీ వ‌ర‌కు వ‌ర్తిస్తుంది. త్రైమాసికంలో కేవీపి వ‌డ్డీ రేటును 7.6 శాతం నుంచి 6.9 శాతానికి త‌గ్గించారు. అప్ప‌టి నుంచి అదే వ‌డ్డీ రేటును కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. 

పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర ఖాతాలో రాబ‌డికి న‌ష్ట‌భ‌యం ఉండ‌దు. అందువ‌ల్ల జిరో రిస్క్‌తో పెట్టుబ‌డి పెట్టాల‌నుకునే వారు ఈ ఖాతాను ఎంచుకోవ‌చ్చు. అంతేకాదు, పెట్టుబ‌డులు వైవిధ్యంగా ఉండాలంటే పోర్ట్‌ఫోలియోలో కొంత భాగం రిస్క్‌లేని పెట్టుబ‌డులు కూడా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని