Gold: పాన్ లేకుండా ఎంత క్యాష్‌తో బంగారం కొనొచ్చు?

రూ.2,000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో చాలా మంది వాటితో నగలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, నగదుతో బంగారం కొనడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..!

Published : 25 May 2023 11:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నగదు నిర్వహణలో భాగంగా రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ఇటీవల ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2,000 నోట్లను ఖర్చు పెట్టేందుకు తొందరపడుతున్నారు. చాలా మంది బంగారం (Gold) కొనుగోలుకు రూ.2,000 నోట్లను తీసుకెళ్తున్నారు. అయితే, నగదుతో బంగారం కొనడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటో చూద్దాం..!

ప్రభుత్వం రత్నాభరణాల రంగాన్ని 2002లో ‘అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (PMLA)’ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి డిసెంబరు 2020లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఒక పరిమితికి మించిన నగదుతో కొనుగోలు చేసే వారి నుంచి ఆభరణాల సంస్థలు పాన్‌, ఆధార్‌ వంటి కేవైసీ డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో కొనుగోళ్లు చేసేవారి వివరాలను ప్రభుత్వానికి నివేదించాలి. మరి పాన్‌, ఆధార్‌ లేకుండా ఎంత మొత్తం నగదుతో ఆభరణాలు (Jewellery) కొనుగోలు చేయొచ్చు?

ఆదాయ పన్ను (Income Tax) నిబంధనల ప్రకారం.. ఒక పరిమితికి మించి నగదుతో లావాదేవీలు జరపడానికి వీలులేదు. సెక్షన్‌ 269ఎస్‌టీ ప్రకారం.. ఆభరణాల కొనుగోలులో ఒక వ్యక్తి ఒకరోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదుతో లావాదేవీ జరపడానికి అనుమతి లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదుతో ఆభరణాలు (Jewellery) కొంటే ఆదాయ పన్ను నిబంధనల్ని ఉల్లంఘించినట్లవుతుంది. అలాంటప్పుడు ఎవరైతే నగదును స్వీకరించారో వాళ్లు లావాదేవీ మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి ఓ నగల దుకాణంలో రూ.4 లక్షల విలువ చేసే ఆభరణాలు కొనుగోలు చేశాడనుకుందాం. ఇది ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 269ఎస్‌టీ ఉల్లంఘించినట్లే. అలాంటప్పుడు నగదు తీసుకున్న నగల వ్యాపారి.. లావాదేవీ మొత్తాన్ని పెనాల్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ రూ.4 లక్షలు పెనాల్టీగా కట్టాలి. నగల వ్యాపారే పెనాల్టీ చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో సాధారణంగా వారు రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం నగదును స్వీకరించడానికి ముందుకురారు.

రూ.2 లక్షలు దాటితే..

ఒకవేళ రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో నగలు కొనాలంటే.. కచ్చితంగా పాన్‌ లేదా ఆధార్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని నిబంధన 114బీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. నగదుతో చెల్లిస్తున్నారా లేక ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తున్నారా అనే దానితో సంబంధం లేదు. బంగారం కొనుగోలు విలువ రూ.2 లక్షలు దాటితే పాన్‌ లేదా ఆధార్‌ సమర్పించాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని