ఆరోగ్య బీమా అవ‌స‌రం ఎంత‌వ‌ర‌కు?

ఆరోగ్య‌మే మ‌న నిజ‌మైన సంప‌ద‌, ఈ సంప‌ద‌ను కాపాడుకోవాలంటే ఎవ‌రికైనా ఆరోగ్య బీమా అవ‌స‌రం. 

Updated : 25 Mar 2022 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ ఉపాధి ప్ర‌యాణాన్ని ప్రారంభించిన‌ప్పుడు ఆరోగ్య బీమా పాల‌సీని చిన్న వ‌య‌స్సులోనే కొనుగోలు చేయాల‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. పాల‌సీ ఎంత ముందుగా తీసుకుంటే అంత ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. కొత్త పాల‌సీలు ప్రాథమిక క‌వ‌రేజీని అందిస్తాయి. ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునేవారికి క్లిష్ట‌మైన అనారోగ్యాలు క‌వ‌ర్ చేయ‌డానికి 2-5 సంవ‌త్స‌రాలు వెయిటింగ్ పీరియ‌డ్ కూడా ఉంటుంది. అందుచేత, ఆరోగ్య బీమా పాల‌సీని చిన్న వ‌య‌స్సులోనే తీసుకొని కొన‌సాగించాలి. అధిక ఖ‌ర్చులు, వైద్య ప‌రిస్థితుల కార‌ణంగా వృద్ధాప్యంలో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయ‌డం క‌ష్టం అవుతుంది. ఆరోగ్య బీమా కొనుగోలు చేయ‌డాన్ని వాయిదా వేస్తూ ఉంటే, ఆర్థిక న‌ష్టాలు కూడా అధికంగానే ఉంటాయి. బీమా అనేది ఆర్థిక న‌ష్టాల నుంచి మిమ్మ‌ల్ని ర‌క్షించే రిస్క్ మేనేజ్‌మెంట్ సాధ‌నం.

ఆరోగ్య‌మే మ‌న నిజ‌మైన సంప‌ద‌. ఈ సంప‌ద‌ను కాపాడుకోవాలంటే ఎవ‌రికైనా ఆరోగ్య బీమా అవ‌స‌రం. ఆరోగ్య బీమా లేని పక్షంలో ప్ర‌జ‌లు త‌మ వైద్య బిల్లుల‌ను చెల్లించ‌డం అనేది ఒక స‌వాలు లాంటిదే. కొన్నిసార్లు వారి జీవిత‌కాల ఆదాయాల‌ను కూడా కోల్పోతారు. బాధిత కుటుంబం త‌మ ఇల్లు, బంగారాన్ని అమ్మేయ‌డం లేదా ఆసుప‌త్రి బిల్లులు చెల్లించ‌డానికి మొత్తం త‌మ దీర్ఘ‌కాల పొదుపును తీసి ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు నివారించాలంటే అత్యంత ముఖ్య‌మైన సాధ‌నాల్లో ఆరోగ్య బీమా ఒక‌టి.

బీమా పాల‌సీని కొనుగోలు చేసిన వ్య‌క్తి తీవ్ర‌మైన అనారోగ్యాన్ని దాచినా, స‌రైన స‌మాచారం ఇవ్వకపోయినా కొన్నిసార్లు ఆరోగ్య‌బీమా కంపెనీలు పాల‌సీల‌ క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రిస్తాయి. కొన్ని పాల‌సీల‌ను కొనుగోలు చేసే ముందు ఆ వ్య‌క్తులు వైద్య ప‌రీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ, సీనియ‌ర్ సిటిజ‌న్ లేదా తీవ్ర‌మైన అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారు త‌ప్ప ఈ రోజుల్లో చాలా పాల‌సీల‌ను మెడిక‌ల్ టెస్ట్ లేకుండా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

మీరు స్థానిక ఆసుప‌త్రుల నెట్‌వ‌ర్క్‌తో చిన్న న‌గ‌రంలో ఉన్న‌ట్ల‌యితే మీ ఖ‌ర్చులు త‌క్కువ‌గా ఉండ‌వ‌చ్చు. కానీ ప్ర‌త్యేక చికిత్స పొంద‌డానికి పెద్ద న‌గ‌రానికి వెళ్ల‌వ‌ల‌సి వ‌స్తే మీ వైద్య ఖ‌ర్చులు పెరుగుతాయి. అందువ‌ల్ల ఆసుప‌త్రిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా గ‌ది, తదితర సౌకర్యాలు అందించే పాల‌సీని కొనుగోలు చేయండి.

ఆరోగ్య బీమా ప్రీమియంలు మీ వ‌య‌స్సు, వైద్య చ‌రిత్ర‌, పొగాకు, మ‌ద్య‌పాన అల‌వాట్లు, మీరు నివ‌సించే న‌గ‌రం, జిల్లా మొద‌లైన వాటిపై ఆధార‌ప‌డి మార‌వ‌చ్చు. అలాగే మీ వ‌య‌స్సు, ముందుగా ఉన్న ఆరోగ్య ప‌రిస్థితులు కూడా మీరు తీసుకునే ఆరోగ్య పాల‌సీ ధ‌ర‌ను నిర్ణయించ‌వ‌చ్చు.

సీనియ‌ర్ సిటిజ‌న్లు ఆరోగ్య బీమాను కొనుగోలు చేయ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలు అనేకం ఉన్నాయి. ఆరోగ్య బీమాకు కొవిడ్ అనంత‌ర ప‌రిణామాలే కాకుండా చాలా ఆరోగ్య స‌మ‌స్య‌లతో ఇబ్బందులకు గుర‌య్యేది దాదాపు ఎక్కువ వృద్ధులే అని చెప్పాలి. సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు బీపీ, మధుమేహం స‌మ‌స్య‌ల‌తో పాటు వీటితో క‌లిపి వ‌చ్చే అనేక వ్యాధులు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. అస‌లు ఆరోగ్య బీమా అవ‌స‌రం యువ‌కుల‌తో పోలిస్తే వృద్ధులకే చాలా ఎక్కువ ఉంటుంది.

త‌ర‌చు మెడిక‌ల్ చెక‌ప్‌లు, డాక్ట‌ర్ సంప్ర‌దింపులు ఇత‌రుల‌తో పోలిస్తే వీరికే ఎక్కువ అవ‌స‌రం ప‌డ‌తాయి. అయితే సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు ఆరోగ్య బీమా క‌ల్పించ‌డానికి బీమా సంస్థ‌లు సంశ‌యం వ్య‌క్తం చేస్తాయి. ఒక‌వేళ పాల‌సీ ల‌భించినా కూడా వారి శాశ్వ‌త మిన‌హాయింపుల జాబితాలో పేర్కొన్న చికిత్స స‌మ‌యంలో చేసే నిర్దిష్ట ఖ‌ర్చుల కోసం బీమా కంపెనీలు క్లెయిమ్‌ను అంగీక‌రించ‌క‌పోవ‌చ్చు.

ఆరోగ్య బీమాపై కోవిడ్ ప్ర‌భావం: సాధార‌ణంగా ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌ని ఎక్కువ‌గా పెద్ద వ‌య‌స్సువారు స‌మ‌ర్పిస్తార‌ని మ‌నం అనుకుంటాం. కానీ 2021లో 25-35, 36-45 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న పాల‌సీదారులు అత్య‌ధిక సంఖ్య‌లో క్లెయిమ్‌ల‌ను నివేదించారు. చాలా మంది ఉద్యోగులు/వ్యాపారులు ఈ మ‌హమ్మారి బారిన ప‌డ్డారు. దీంతో వ‌య‌స్సుతో సంబంధం లేకుండా ఆరోగ్య బీమా ఎంత అవ‌స‌ర‌మో స్ప‌ష్టంగా తెలుస్తుంది.

బీమా కవర్ ఎంత ఉండాలి?
ఆరోగ్య బీమా మొత్తం ఎంత ఉండాలనేది మీ ఆరోగ్య స్థితిగతులు, దగ్గరలో ఉన్న నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో ఖర్చులు, కుటుంబ సభ్యులు లాంటి అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. రూ. 2-5 లక్షల బీమా పాలసీ తీసుకుని, దానికి సూపర్ టాప్ లాంటివి జోడించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని