Health insurance:ఆరోగ్య బీమా ఎంతుండాలి?

ఆరోగ్య బీమా అనేది ఒక‌రి పొదుపు లేదా పెట్టుబ‌డిలో ప్ర‌ధాన భాగంగా ప‌రిగ‌ణించ‌బ‌డాలి.

Updated : 31 Jan 2022 15:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది నెల అవ‌స‌రాలు పోనూ ఎంతో కొంత పొదుపు చేస్తారు. కానీ ఏదైనా అనారోగ్యం వ‌చ్చిన‌పుడు ఆ పొదుపులు స‌రిపోతాయా అంటే.. అవేవీ క్లిష్ట అనారోగ్య ప‌రిస్థితుల్లో స‌రిపోవ‌నే చెప్పాలి. పొదుపులు భ‌విష్య‌త్తులో మెరుగైన రాబ‌డుల కోసం పెట్టుబ‌డి పెట్ట‌డానికి స‌రిపోతాయి. కానీ అనారోగ్యం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి మ‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులు స‌రిపోకపోవ‌చ్చు. ఆరోగ్య బీమాయే దీనికి స‌రైన ప‌రిష్కారం.

క్యాన్స‌ర్‌, బీపీ వ‌ల్ల క‌లిగే వ్యాధులు ఇప్ప‌టికే మొద‌టి 2 అత్య‌ధిక ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల‌లో ఉండగా.. జీర్ణాశ‌య‌, శ్వాస‌కోశ వ్యాధులు తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇటువంటి ప‌రిస్థితుల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోవడానికి చాలా బీమా పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి.  ద్రవ్యోల్బణం లాంటి మెడిక‌ల్ ట్రెండ్ రేట్ ప్రస్తుతం ఆల్‌టైమ్‌ హైలో ఉంది. ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు స్థాయిలో ఈ రేటు ఉంది.

మీ చికిత్స‌కు ఆసుప‌త్రిలో చేరిన స‌మ‌యంలో అయ్యే ఖ‌ర్చుల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాదు. ముందుగా చేయించుకునే మెడిక‌ల్ చెక‌ప్‌లు, డాక్ట‌ర్ ఫీజులు, డాక్ట‌ర్ సూచించిన మందులు వంటి అనేక అంత‌ర్లీన ఖ‌ర్చులు త‌ర‌చుగా మీ హాస్పిట‌లైజేష‌న్ ఛార్జీల కంటే కూడా ఎక్కువ ఖ‌ర్చుకు కార‌ణ‌మ‌వుతాయి. స‌మాంత‌రంగా రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, పోస్ట్‌-స‌ర్జిక‌ల్‌/ఆప‌రేటివ్ కేర్‌లు ఉంటాయి. వీటికి అటెండెంట్ 2 వారాలు లేక నెల పాటు పేషంట్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న అంశాల‌న్నింటినీ క‌లిపితే, వైద్య ఖ‌ర్చులు ఎలా విప‌రీతంగా పెరుగుతున్నాయి? ఆరోగ్య బీమా ఎంత అవ‌స‌ర‌మో తెలుస్తుంది.

ఆరోగ్య బీమా ప‌థ‌కాలు అనేక ర‌కాల అనారోగ్యాలు, ప‌రిస్థితుల‌ను క‌వ‌ర్ చేస్తాయి. మీ హాస్పిట‌లైజేష‌న్‌కు సంబంధించిన అనేక అంశాల‌కు చెందిన పాల‌సీలు ఉన్నాయి. ప్రీ/పోస్ట్ హాస్పిట‌లైజేష‌న్ ఛార్జీలు, మందులు, మెడిక‌ల్ చెక‌ప్‌లు మ‌రెన్నో ఖ‌ర్చుల‌కు క‌వ‌ర్ అయ్యేలా ఆరోగ్య బీమా పాల‌సీలు ఉన్నాయి. ఆరోగ్య బీమాను ఎంపిక చేసుకునేట‌ప్పుడు మీ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా ప్ర‌ణాళిక వేసుకోవాలి. త‌గినంత ఆరోగ్య బీమా ర‌క్ష‌ణ‌ను క‌లిగి ఉండ‌టం ప్ర‌తి ఒక్క‌రి ఎజెండాలో ఉండాలి. స‌మ‌గ్ర ఆరోగ్య బీమా క‌వ‌ర్ మీ కుటుంబ ఆర్థిక ప‌రిస్థితుల‌ను కాపాడుతుంది. ఆరోగ్య బీమా నిపుణులు క‌నీసం రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌ల బీమాతో ఒక వ్య‌క్తి లేదా కుటుంబ ఫ్లోట‌ర్ పాల‌సీని క‌లిగి ఉండాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

ఆరోగ్య బీమాను క‌లిగి ఉండ‌టం దీర్ఘ‌కాలంలో మేలే జ‌రుగుతుంది. ఇది ఆసుప‌త్రి ప్ర‌క్రియ‌ను చాలా సుల‌భ‌త‌రం చేసి ఊహించ‌ని అనారోగ్య ప‌రిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఆరోగ్య బీమా అనేది ఒక‌రి పొదుపు లేదా పెట్టుబ‌డిలో ప్ర‌ధాన భాగంగా ప‌రిగ‌ణించాలని, ఒక వ్య‌క్తి ఆదాయంలో 3-4% ఆరోగ్య బీమాకి ఖ‌ర్చు పెట్టాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

కొన్ని పాల‌సీలు ఏవైనా ఆక‌స్మిక వైద్య అవ‌స‌రాల‌తో పాటు అంబులెన్స్ ఖ‌ర్చు, ఆసుప‌త్రి వెళ్లె ముందు పోస్ట్ ఛార్జీలు మొద‌లైన ఖ‌ర్చులను బీమా సంస్థ‌లు భ‌రిస్తాయి. ఇవి ఆసుప‌త్రి ప్ర‌క్రియ‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసి, మాన‌సిక, ఆర్థిక ఒత్తిడిని త‌గ్గిస్తాయి. ముందుగా బీమా తీసుకోవాల‌ని ఆలోచ‌న వ‌చ్చిన వెంట‌నే మొద‌ట‌గా ఆరోగ్య బీమానే తీసుకోవాల‌ని, త‌ర్వాతే జీవిత బీమా గురించి ఆలోచించాల‌ని ఇన్సూరెన్స్ నిపుణులు చెబుతున్నారు.  మీపై ఆధార‌ప‌డే వారు ఎవ‌రూ లేకుంటే జీవిత బీమాను తీసుకోవ‌డం మానివేయ‌వ‌చ్చేమోగానీ, ఆరోగ్య బీమా తీసుకోవ‌డాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని