Income Tax: రూ. 100 వసూలుకు ఖర్చయ్యేది ఎంతో తెలుసా..?

బడ్జెట్‌ 2023లో వేతన జీవులకు కాసింత ఊరట కల్పిస్తూ రూ. 7 లక్షల వరకు పన్ను మినహాయింపును కల్పించింది. మరి, పన్ను వసూలుకు కేంద్రం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..?

Published : 02 Feb 2023 22:14 IST

హైదరాబాద్‌:  కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Budget 2023)లో ఆదాయపు  పన్ను (Income Tax) చెల్లించే వారికి ఊరట కలిగించింది. ఇంతకీ పన్ను వసూలు చేసేందుకు ఇన్‌కమ్‌ టాక్స్‌ విభాగం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?  ఇదే విషయాన్ని హైదరాబాద్ ఆదాయ పన్ను విభాగం చీఫ్‌ కమిషనర్ శిశిర్‌ అగర్వాల్ వెల్లడించారు. ప్రతి రూ. 100 పన్ను వసూలు కేంద్రం రూ. 0.57 పైసలు ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రపంచంలో పన్ను వసూలుకు ఇతర దేశాలు ఖర్చు చేసే దానితో పోలిస్తే ఇదే అత్యల్పం అని అన్నారు. వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు బడ్జెట్‌లో కేటాయింపులపై హైదరాబాద్‌లో ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్ ఇండస్ట్రీ (FTCCI) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘రూ. 100 పన్ను వసూలు చేసేందుకు కేంద్రం కేవలం రూ. 0.57 పైసలు మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. పన్ను వసూలుకు ప్రతి రూ. 100లకు బ్రిటన్‌ రూ. 0.73 పైసలు, జపాన్‌ రూ.1.74, జర్మనీ రూ. 1.35, కెనడా రూ. 1.50, ఫ్రాన్స్‌ రూ. 1.11 పైసలు ఖర్చు చేస్తున్నాయి. భారత్‌ కంటే తక్కువగా అమెరికా మాత్రమే ఖర్చు చేస్తోంది’’ అని అన్నారు. 

కొత్త పన్ను విధానం సులభతరంగా, మరింత పారదర్శంగా ఉందన్న ఆయన, దేశవ్యాప్తంగా 65 శాతం రిఫండ్‌లు ఐటీ రిటర్నలు దాఖలు చేసిన 24 గంటల వ్యవధిలోనే పూర్తవుతున్నాయని  తెలిపారు. విజన్‌ 2047 లక్ష్యంగా ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా బడ్జెట్‌ 2023ని రూపొందించారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు నెలకొన్న వేళ, వృద్ధిరేటులో  క్షీణతను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రజాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఈ సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని