Health insurance: మీ ఆదాయంలో ఎంత భాగం ఆరోగ్య బీమాలో పెట్టుబ‌డి పెట్టొచ్చు?

ఒక వ్య‌క్తి స‌రిగ్గా పెట్టుబ‌డి పెట్ట‌ని ఏకైక కేట‌గిరి ఉందంటే అది వారి ఆరోగ్యం.

Updated : 27 Dec 2021 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా తీసుకోవ‌డం భార‌త్‌లో ఇటీవల కాలంలో పెరుగుతోంది. కొవిడ్ కారణంగా జ‌రిగిన ప‌రిణామాలు ఆరోగ్య బీమాలో పెట్టుబ‌డులు ఎంత అవ‌స‌ర‌మో చాలా మందికి తెలిసి వ‌చ్చింది. ఆరోగ్య బీమాను క‌లిగి ఉండ‌టం దీర్ఘ‌కాలంలో మేలే జ‌రుగుతుంది. ఇది ఆసుప‌త్రి ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేయడమే కాకుండా అనారోగ్య ప‌రిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఎవ‌రైనా సంపాదించ‌డం ప్రారంభించిన‌పుడు మొద‌టగా పొదుపు గురించి ఆలోచన చేస్తారు. శాశ్వ‌త ఆదాయ వ‌న‌రుని క‌లిగి ఉండ‌టం ప్రారంభించినప్ప‌టి నుంచి పొదుపు, ఖ‌ర్చుల మ‌ధ్య స‌మ‌తుల్య‌త‌ను కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. సాధార‌ణంగా ఆలోచిస్తే పెట్టుబ‌డి అనేది కూడా ఒక ఆస్తి. ఇది మరింత ఆదాయ సముపార్జనకు ఉపయోగపడుతుంది. వ్యక్తి ఎంత మొత్తం అయినా పెట్టుబ‌డి పెట్టొచ్చు. మ్యూచువ‌ల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్‌ లేదా బ్యాంక్‌, పోస్టాఫీస్‌ ఇలా దేన్లోనైనా మదుపు చేయొచ్చు. అయితే ఒక వ్య‌క్తి స‌రిగ్గా పెట్టుబ‌డి పెట్ట‌ని ఏకైక కేట‌గిరీ ఏదైనా ఉందంటే అది వారి ఆరోగ్యం గురించి మాత్రమే. ఇది నిజ‌మైన ఆదాయాన్ని అందివ్వదు. కానీ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఉప‌యోగపడుతుంది. ఆరోగ్య బీమా అనేది ఒక‌రి పొదుపు లేదా పెట్టుబ‌డిలో కొన్ని ప్ర‌ధాన భాగాలుగా ప‌రిగ‌ణించాలని నిపుణులు భావిస్తున్నారు. ఒక ఉద్యోగి నెల‌వారీ సంపాద‌న‌లో దాదాపు 30 శాతం వరకు వారి పొదుపు పెట్టుబ‌డుల‌కు వెళ్లాలి. అందులో త‌క్కువ‌లో త‌క్కువ‌గా 3-4 శాతం ఆరోగ్య బీమాకి వెళ్లాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మీకు, మీ కుటుంబానికి బీమా క‌వ‌రేజ్ అనేది.. వైద్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మీ చేతి డ‌బ్బులు ఖ‌ర్చ‌వ్య‌కుండా మిమ్మ‌ల్ని, మీ ఆర్ధిక ప‌రిస్థితిని కాపాడుతుంది. మంచి పాల‌సీలో ఏవైనా ఆక‌స్మిక వైద్య అవ‌స‌రాల‌తో పాటు అంబులెన్స్ ఖ‌ర్చు, ఆసుప‌త్రి వెళ్లే ముందు పోస్ట్ ఛార్జీలు మొద‌లైన ఖ‌ర్చులను కూడా బీమా సంస్థ‌లు భ‌రిస్తాయి. ఇవి ఆసుప‌త్రి ప్ర‌క్రియ‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసి, మాన‌సిక, ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ముందుగా బీమా తీసుకోవాల‌ని ఆలోచ‌న వ‌చ్చిన వెంట‌నే మొద‌ట‌గా ఆరోగ్య బీమా తీసుకోవ‌డానికే మొద‌టి అవ‌కాశంగా చూడాల‌ని, త‌ర్వాతే జీవిత బీమాను (ట‌ర్మ్ ఇన్సూరెన్స్‌ను) తీసుకోవాల‌ని నిపుణులు తెలిపారు. మీపై ఆధార‌ప‌డే వారు ఎవ‌రూ లేకుంటే జీవిత బీమాను తీసుకోవ‌డం మానివేయ‌వ‌చ్చేమోగానీ, ఆరోగ్య బీమా తీసుకోవ‌డాన్ని ఎపుడూ మ‌ర‌వొద్దు. ఆఫీసులో మీ య‌జ‌మాని నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ క‌లిగి ఉంటే, మీరు చిన్న వ‌య‌స్సులోనే ఉండి ఉంటే వేరే సొంతంగా ఆరోగ్య బీమాను క‌లిగి ఉండ‌టం కొంత కాలం ఆల‌స్యం చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని