
Apple: యాపిల్ సీఈవో జీతం ఎంతో తెలుసా..?
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా ఘనత దక్కించుకొన్న యాపిల్ కంపెనీ సీఈవో టిమ్‌కుక్ 2021లో భారీ వేతనం అందుకొన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే జీతం రూపంలో అందుకొన్న మొత్తంలో ఏమీ తేడా రాలేదు. ఈ సారి కూడా 3 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం తీసుకున్నారు. దీంతో పాటు 82 మిలియన్ డాలర్లు విలువైన వాటాలు కూడా ఆయనకు లభించాయి. మరో 12 మిలియన్ డాలర్ల విలువైన పరిహారాన్ని నాన్ ఈక్విటీ ఇన్సెంటీవ్‌గా అందించారు. ఇతరాల రూపంలో 1.39 మిలియన్ డాలర్లు కుక్‌కు లభించాయి.
ఆయనకు ఇతరాల రూపంలో లభించిన 1.39 మిలియన్ డాలర్లలో 7,12,488 డాలర్లను ప్రైవేట్ జెట్ ప్రయాణాలకు వినియోగించగా.. 6,30,630 డాలర్లను భద్రత కోసం ఖర్చు చేశారు. ఈ లెక్కలు మొత్తం చూసుకొంటే కుక్ 2021లో 98 మిలియన్ డాలర్లను కుక్ అందుకొన్నట్లైంది. టిమ్‌కుక్ అవసరాలు, భదత్ర రిత్యా యాపిల్ సంస్థ ఆయనకు ఒక ప్రైవేటు జెట్‌ను సమకూర్చింది. నాటి నుంచి ఆయన వాణిజ్య విమానాల్లో ప్రయాణించలేదు. యాపిల్ సీఈవో బాధ్యతలు చేపట్టి 2021 నాటికి 10 ఏళ్లు పూర్తయింది. ఆయన సీఈవోగా ప్రమోట్ అయిన నాటి నుంచి తొలిసారి వాటాను కేటాయించినట్లు యాపిల్ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.