Insurance: జీతంలో ఎంత భాగం బీమాలో పెట్టుబ‌డి పెట్టొచ్చు?

మంచి బీమా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు.. ఏవైనా పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

Updated : 02 Dec 2021 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్ర‌స్తుత జీవ‌న‌శైలికి ప్ర‌తి ఒక్క‌రికీ బీమా ర‌క్ష‌ణ తప్పనిసరి. అనుకోని సంఘ‌ట‌న‌ల కార‌ణంగా జ‌రిగే న‌ష్టాల నుంచి.. ఆర్థిక రక్షణ పొందేందుకు జీవిత బీమా పాలసీ నుంచి కారు బీమా వరకు విభిన్న బీమా పాల‌సీలు ప్ర‌స్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే బీమా పాలసీ కొనేందుకు కొంతమంది ఆలోచిస్తుంటారు. వాటి ద్వారా నేరుగా రాబడి అందకపోవడం లాంటి కారణాలు చెబుతుంటారు. అయితే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో బీమా పాలసీలు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఎంత పెట్టుబడి పెట్టొచ్చు...

ఆరోగ్య బీమాను తీసుకుంటే.. ప్రీమియమ్‌లు చెల్లిస్తుంటాం, చెల్లించిన ప్రీమియం తిరిగిరాదు, ప్రీమియంపై వ‌డ్డీ కూడా రాదు. కానీ కుటుంబంలో స‌భ్యులు అనారోగ్యం పాలైతే కాపాడుతుంది. అప్పులు చేయ‌కుండా ఆర్థికంగా స‌హాయ‌ప‌డుతుంది. మంచి ఆరోగ్య బీమా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు, ఏదైనా పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అందువల్లే ఒక వ్య‌క్తి చేసే పొదుపు, పెట్టుబ‌డుల‌లో బీమాకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిపుణులు అంటుంటారు. దాని కోసం ఆదాయంలో కొంత భాగం బీమాకు కేటాయించాల‌ని చెబుతుంటారు. నెలసరి ఆదాయంలో 5 నుంచి 10 శాతం వరకు బీమా పాలసీల (జీవిత, ఆరోగ్య, ప్రమాద బీమా అన్ని కలిపి) మీద పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు.

టర్మ్‌ పాలసీ ఎంత ఉండాలి...

ఆరోగ్య బీమా... అత్య‌వ‌స‌ర‌ వైద్య సేవ‌ల‌ను అందించ‌డంతో పాటు ఆక‌స్మిక వైద్య అవ‌స‌రాలు, అంబులెన్స్‌, ప్రీ - పోస్ట్ ఆసుప‌త్రి ఛార్జీలు వంటివి కూడా క‌వ‌ర్‌ చేస్తుంది. ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే, ఖ‌ర్చుల గురించి ఆందోళ‌న ఉండ‌దు. ఒకవేళ మీకు ఎలాంటి బీమా తీసుకోవాలనే విషయంలో అయోమయం ఉంటే... ఆరోగ్య బీమాతోనే ప్రారంభించ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత టర్మ్ జీవిత బీమా, వ్యక్తిగత ప్రమాద బీమాను కొనుగోలు చేయాల‌ని సూచిస్తున్నారు. మీ మీద ఆధార‌ప‌డి జీవిస్తున్న స‌భ్యులు ఉన్న‌ప్పుడు త‌ప్ప‌కుండా టర్మ్‌ జీవిత బీమా తీసుకోవాలి. మీ వార్షిక ఆదాయానికి క‌నీసం 12-15 రెట్లు హామీ మొత్తం ఉండేలా చూసుకోవాలి. ఒక‌వేళ మీపై ఆధార‌ప‌డిన‌ స‌భ్యులు లేకపోతే ట‌ర్మ్ బీమా అవ‌స‌రం ఉండ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని