పిల్ల‌ల ఉన్నత విద్యా ఖ‌ర్చుల‌కు నెల‌నెలా ఎంత పెట్టుబ‌డి పెట్టాలి?

పిల్ల‌ల విద్యా విష‌య‌మై త‌ల్లిదండ్రులు త‌మ పెట్టుబ‌డుల‌ను త‌క్కువ మొత్తంతో ప్రారంభించి త‌ర్వాత పెట్టుబ‌డుల‌ను పెంచుకుంటూ వెళ్లాలి.

Updated : 03 Jan 2022 14:50 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: త‌ల్లిదండ్రులంతా ఇప్పుడు తమ వృత్తి, ఉద్యోగ ప‌రిస్థితుల కంటే ఎక్కువగా తమ పిల్ల‌ల విద్యా విష‌యాల‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. భార‌త‌దేశంలో విద్య ప్రైవేటీక‌ర‌ణ చాలా వేగంగా ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పిల్ల‌లు చ‌దువులోగానీ, తెలివితేట‌ల్లో గానీ ఎంత ముందంజ‌లో ఉన్నా వాళ్ల కెరియర్‌ వేగంగా వెళ్లాలంటే డ‌బ్బు మాత్రం చాలా ముఖ్య‌మైన పాత్ర‌ పోషిస్తుంది. పిల్ల‌లు విద్య‌లో ఎంత ముందంజ‌లో ఉంటే మంచిదో.. త‌ల్లిదండ్రులు కూడా విద్యా పెట్టుబ‌డుల్లో అంత ముందంజ‌లో ఉంటే మంచిది. త‌ల్లిదండ్రులు స్ప‌ష్ట‌మైన ఆర్థిక లక్ష్యాలను క‌లిగి ఉండాలి. దీని గురించి త‌ల్లిదండ్రులు పిల్ల‌ల విద్య‌కు స‌రిప‌డా పెట్టుబ‌డుల‌ను సిద్ధం చేసుకోవ‌డం చాలా ముఖ్యం. స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక లేక‌పోతే పెరుగుతున్న ఫీజులు, ఉన్న‌త విద్య‌కు సంబంధించిన ఇత‌ర ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డం త‌ల్లిదండ్రుల‌కు ఆర్థికంగా భారంగా ఉంటుంది. పిల్ల‌ల విద్యా విష‌య‌మై త‌ల్లిదండ్రులు త‌మ పెట్టుబ‌డుల‌ను త‌క్కువ మొత్తంతో ప్రారంభించి త‌ర్వాత పెట్టుబ‌డుల‌ను పెంచుకుంటూ వెళ్లాలి.

చాలా మంది కుటుంబ పెద్ద‌లు త‌మ భ‌విష్య‌త్‌ను వివిధ ర‌కాలుగా ఊహించుకుని పెట్టుబ‌డుల‌ను బంగారానికి, ఇంటి నిర్మాణానికి కేటాయిస్తారు. కానీ ఏదైనా ఆస్తిని సంపాదిస్తే.. ఏ ప్ర‌యోజ‌నం కోసం కేటాయించారో ఆలోచించాలి. ప్ర‌త్యేకంగా విద్య‌ కోసం పెట్టుబ‌డులు కూడా ఈ రోజుల్లో త‌ప్ప‌నిస‌రి. పెట్టుబ‌డుల్లో అధిక మొత్తం న‌గ‌దు రూపంలో ఉండాలి. పెట్టుబ‌డి ఎంత పెట్టాలి? వారి పిల్ల‌ల చ‌దువు కోసం ఎన్ని సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డిని ఎలా పెంచాలి? అనేదానిని నిర్ణ‌యించుకోవాలి. ముందు, వారు ఎల్ల‌ప్పుడూ గుర్తుంచుకోవ‌ల‌సిన కొన్ని విష‌యాలు ఉన్నాయి. విద్యా ఖ‌ర్చును లెక్కించండి. ద్ర‌వ్యోల్బ‌ణం అనుస‌రించి పిల్ల‌ల చ‌దువు కోసం ఎంత ఆదా చేయాలి? ఎన్ని సంవ‌త్స‌రాలు ఆదా చేయాలి? అనేది తెలుసుకోవాలి. మీరు మీ పిల్ల‌ల విద్య కోసం పొదుపు చేయ‌డం ప్రారంభించిన‌పుడు ల‌క్ష్యం మొత్తాన్ని చేరుకోవ‌డానికి ప్ర‌స్తుత ద్ర‌వ్యోల్బ‌ణాన్ని, భ‌విష్య‌త్ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని గుర్తించుకోవాలి. ఏటేటా విద్యా వ్య‌యం పెరుగుతున్నందున నేడు ఉన్న కోర్సుల ఫీజులు 15-20 ఏళ్ల వ‌ర‌కు కొన‌సాగ‌వు. ఫీజుల పెరుగుద‌ల భారీగానే ఉంటుంది. అందుచేత పెరిగే ధ‌ర‌ల‌ను ముందుగానే అంచ‌నా క‌ట్టాలి.

ఈ రోజు దాదాపు రూ.7 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌య్యే ఇంజినీరింగ్ కోర్సుకు  16 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌, ద్ర‌వ్యోల్బ‌ణం 10 శాతంగా అంచ‌నా వేస్తే రూ.30 ల‌క్ష‌ల‌కు పైగా ఖ‌ర్చు అవుతుంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఉన్నత చ‌దువుల కోసం ఈ రోజు కోర్సు ఫీజులు, ఖ‌ర్చులు రూ.20 ల‌క్ష‌లు అయితే 20 ఏళ్ల త‌ర్వాత రూ. 1.30 కోట్లు కావ‌చ్చు. అందువ‌ల్ల పెట్టుబ‌డి పెట్ట‌డం ప్రారంభించే ముందు ద్ర‌వ్యోల్బ‌ణం వాస్త‌వ ప్ర‌భావాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి, లేదంటే అవ‌స‌ర‌మైన దాని కంటే త‌క్కువ ఆదా చేస్తారు. అస‌లు ఆర్థిక ల‌క్ష్యాన్ని చేరుకోలేరు.

15 సంవ‌త్స‌రాల త‌ర్వాత రూ.1 కోటి పొందాలంటే 12% వృద్ధి రేటుతో మీరు ప్ర‌తి నెలా రూ.20,000 పెట్టుబ‌డి పెట్టాలి. మీ పెట్టుబ‌డుల‌ను ప్లాన్ చేయ‌డానికి, దీర్ఘ‌కాలిక ల‌క్ష్య‌ల‌ను సుల‌భంగా చేరుకోవ‌డానికి ద్ర‌వ్యోల్బ‌ణ గ‌ణ‌న, సిప్ కాలిక్యులేట‌ర్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే భ‌విష్య‌త్‌లో ఉన్న‌త విద్య‌ కోసం అధిక భ‌ద్ర‌త ఉండే గ్యారెంటీ పొదుపు ప‌థ‌కాలు.. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (బాలిక‌ల‌కు), మ్యూచువ‌ల్ ఫండ్స్ లాంటి ప‌థ‌కాలు ప‌రిశీలించండి.

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో కూడా పిల్ల‌ల విద్యా నిధి ప్ర‌భావితం కాకూడ‌దు. కాబ‌ట్టి, అన్ని ర‌కాల అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కోసం వైద్య బీమా, జీవిత బీమా కోసం ప్ర‌ణాళిక‌లు వేసుకోండి. మీ పిల్ల‌ల విద్యా పెట్టుబడులను తాక‌కుండా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించండి. సరిపడా టర్మ్ పాలసీ (మీ పేరున), ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం మంచిది. పిల్లల కోసం ఉండే ప్రత్యేక విద్యా పథకాల నుంచి దూరంగా ఉండడం మేలు. వీటిలో బీమా, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని