ఇంటి రుణం ఎంతిస్తారు?

సొంతింటి కల కనేవారికి పండగలకు మించిన తరుణం లేదు. నిర్మాణ సంస్థల ప్రోత్సాహకాలు, బ్యాంకులు వడ్డీలో రాయితీలు ఇవ్వడం ఇల్లు కొనాలనుకునే వారికి కలిసొచ్చే అంశాలు. మరి మనం కొనే ఇంటికి బ్యాంకు రుణమెంత మంజూరు చేస్తుందో కనుక్కోవడమెలా? తీరా మనం ఇల్లు చూసుకున్నాక

Published : 15 Dec 2020 22:32 IST

సొంతింటి కల కనేవారికి పండగలకు మించిన తరుణం లేదు. నిర్మాణ సంస్థల ప్రోత్సాహకాలు, బ్యాంకులు వడ్డీలో రాయితీలు ఇవ్వడం ఇల్లు కొనాలనుకునే వారికి కలిసొచ్చే అంశాలు. మరి మనం కొనే ఇంటికి బ్యాంకు రుణమెంత మంజూరు చేస్తుందో కనుక్కోవడమెలా? తీరా మనం ఇల్లు చూసుకున్నాక బ్యాంకు తగినంత అప్పు ఇవ్వనంటే! కాబట్టి సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ రుణం ఎంతిస్తారో తప్పక తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి బ్యాంకూ ఎంత రుణం వస్తుందో తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది. బ్యాంకుల వెబ్‌సైట్లలో ఈ విషయం సులభంగా తెలిసిపోతుంది. కొన్ని ప్రైవేటు సంస్థలూ రుణం ఎంత రావచ్చనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

అయితే, ఇదేమీ తుది నిర్ణయం కాదు. మీరు కొనబోయే ఇంటి విలువను బట్టి రుణమెంత ఇవ్వాలనే విషయాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయని గుర్తుంచుకోండి. ఉదాహరణకు మీకు రూ.25 లక్షల రుణం వస్తుందని అనుకుందాం. మీరు కొనే ఇంటి విలువ కూడా అంతే ఉంటే… మీకు మొత్తం వందశాతం రుణమిస్తారని భావించకండి. పదిహేను శాతమైనా మీ చేతిలో నుంచి పెట్టుకోవాల్సిందే! బ్యాంకులను బట్టి ఇది గరిష్ఠంగా పాతిక శాతం వరకూ ఉండొచ్చు.

* రుణ అర్హత మొత్తాన్ని బట్టి ఆ బడ్జెట్‌ (మీ వాటా 25 శాతం వరకు కలిపి) అటుఇటూగా ఉండే ఇళ్ల కోసం వేట ప్రారంభించండి. బడ్జెట్‌పై స్పష్టత ఉండటం వల్ల మీక్కావాల్సిన ఇంటిని తేలికగా గుర్తించొచ్చు. ఇలా చేయడం వల్ల మీ సమయమెంతో ఆదా అవుతుంది. లేదంటే కన్పించిన ప్రాజెక్టును చూడటం… నచ్చిన వాటికి రుణం కోసం ప్రయత్నించి, తగినంత రాలేదని దాన్ని వదులుకోవడం… మరోటి చూడటం… ఇలా చేస్తే వృథా ప్రయాస తప్ప తప్ప మరోటి ఉండదు.

* ఇల్లు ఏ ప్రాంతంలో కొంటే బావుంటుందో నిర్ణయించుకోండి. ఇల్లు కొంటున్నది పెట్టుబడి దృష్టితోనా? మీరు అందులో నివసిస్తారా? వంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఉండటం కోసమే అయితే, ఆ ప్రాంతాన్ని పరిశీలించండి. చుట్టుపక్కల మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? మీ జీవనశైలికి అనువుగా ఉందా?అన్నది చూడండి.

* ఇల్లు కొనేది పెట్టుబడి కోసమైతే… విలువను పెంచే సానుకూల అంశాలేం ఉన్నాయి? అద్దె ఎంత వస్తుంది వంటి విషయాల్ని చూడాలి.

* ఇల్లు ముందా… రుణం ముందా అన్న సందేహం ఎవరికైనా కలగకమానదు. ఇల్లు ముందే దొరక్కపోయినా… అంతకంటే ముందే బ్యాంకు నుంచి గృహరుణానికి ఆమోదం పొందొచ్చు. మీ ఆదాయ వివరాల్ని తెలియజేస్తే రుణమెంత చేతికొస్తుందో బ్యాంకే తెలియజేస్తుంది. కొన్ని బ్యాంకులు గృహనిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇలాంటివాటిని ఎంపిక చేసుకున్నప్పుడు సులభంగా గృహరుణం పొందే వీలుంది. మొత్తానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే సమయం వృథా అన్నది కన్పించదు. మీక్కావాల్సిన ఇల్లు దొరికితే చాలు… వీలైనంత త్వరగా రుణం మంజూరవుతుంది.

ఇదీ లెక్క!

వార్షికాదాయం రూ.8 లక్షలున్న కుటుంబం ఖర్చులు, పొదుపు పోనూ రూ.40 లక్షల ఇల్లు కొనుక్కోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు కూడా రుణగ్రహీతకు భారం కాకుండా ఉండేలా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. సాధారణంగా చాలా బ్యాంకులు చేతికొచ్చే జీతంలో నెలసరి వాయిదా 40-50 శాతానికి మించకుండా చూస్తాయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని