No-Cost EMI: నో-కాస్ట్‌ ఈఎంఐలో వస్తువు కొంటున్నారా?.. వడ్డీ వర్తిస్తుందా?

నో-కాస్ట్‌ ఈఎంఐ అంటే ఏంటి? దీనితో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం

Updated : 08 Oct 2022 15:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ సీజన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఇ-కామర్స్‌ సంస్థలు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొబైల్ ఫోన్లు, టీవీ, రిఫ్రిజిరేట‌ర్లు, వాషింగ్ మెషిన్లు వంటి ఖ‌రీదైన వ‌స్తువులను డిస్కౌంట్లలో అందించడంతో పాటు, క్రెడిట్‌ కార్డు ద్వారా ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే వీలు కల్పిస్తున్నాయి. కొన్ని వస్తువులపై నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అసలు నో-కాస్ట్‌ ఈఎంఐ అంటే ఏంటి? దీంతో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.. 

నో-కాస్ట్‌ ఈఎంఐ ఎలా పనిచేస్తుంది?

నో-కాస్ట్‌ ఈఎంఐ కింద వస్తువు ధరను ఒకేసారి చెల్లించనవసరం లేదు. వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. వస్తువు ధరను ఎంచుకున్న కాలపరిమితి ఆధారంగా సమాన భాగాలుగా విభజిస్తారు. ఉదాహరణకు.. ఒక వస్తువు ధర రూ.12 వేలు అనుకుందాం. మీరు ఆరు నెలల కాలపరిమితి ఎంచుకుంటే నెలకు రూ. 2000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది.

బ్యాంకు వడ్డీ విధించదా?

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఏ సంస్థ కూడా సున్నా వడ్డీతో రుణాలు ఇవ్వకూడదు. ఈ రూల్‌ ప్రకారం వడ్డీ రహిత ఈఎంఐలో వస్తువులు ఎలా అమ్ముతున్నారనే సందేహం రావొచ్చు. నిజానికి నో-కాస్ట్‌ ఈఎంఐ కింద వస్తువు కొనుగోలు చేసినప్పటికీ ఇచ్చిన రుణంపై బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తాయి. అంతే తప్ప వడ్డీ లేకుండా బ్యాంకులు రుణం ఇవ్వవు. ఇ-కామర్స్‌ సంస్థలు వెబ్‌సైట్‌లో నో-కాస్ట్‌ ఈఎంఐ వివరాలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

మరి వడ్డీని ఏవిధంగా వసూలు చేస్తారు?

సాధారణంగా ఇ-కామర్స్‌ వేదికల్లో నో-కాస్ట్‌ ఈఎంఐ బిల్లును గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక వస్తువును రూ.12 వేలు పెట్టి కొనుగోలు చేశామనుకుందాం. మూడు నెలలకు నో-కాస్ట్‌ ఈఎంఐ పెడితే.. మనం కట్టాల్సింది నెలకు రూ.4వేలు ఉంటుంది. ఇక్కడ వడ్డీ కట్టట్లేదు కదా అని సందేహం రావొచ్చు. కానీ మనం వాస్తవంగాా బిల్‌ పే చేసినప్పుడు బ్యాంకులు వసూలు చేసే వడ్డీని బిల్లు సమయంలో ముందుగానే మినహాయిస్తారు. అంటే బ్యాంకులు 13 శాతం వడ్డీ వేస్తాయనుకుంటే ఆ మేర 3 నెలలకు అయ్యే వడ్డీ మొత్తాన్ని ముందే మినహాయించి బిల్‌ రూపొందిస్తారు.

మరి వారికి నష్టం కాదా?

ఇ-కామర్స్‌ వేదికల్లో మనం ఒకేసారి డబ్బు మొత్తం చెల్లించి కొనుగోలు చేసినా, నో-కాస్ట్‌ ఈఎంఐలో వాయిదాల పద్ధతిలో చెల్లించినా ఒకే ధర వర్తిస్తుంది. అయితేే, ఈ విధంగా చేయడం వల్ల వడ్డీ భారాన్ని ఇ-కామర్స్‌ సంస్థలు మోస్తున్నాయి కదా అనే సందేహం రావొచ్చు. ఇక్కడో విషయం గమనించాలి. నో-కాస్ట్‌ ఈఎంఐ వల్ల వినియోగదారులు తమ వద్ద డబ్బులు లేకపోయినా వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చన్న ఉద్దేశంతో కొనుగోలుకు ముందుకు వస్తాడు. దీనివల్ల కంపెనీలు అమ్మకాలను పెంచుకునేందుకు వీలు పడుతుంది. కొన్నిసార్లు పాత స్టాక్‌ను క్లియర్‌ చేసేందుకు కూడా డిస్కౌంట్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని కంపెనీలు కల్పిస్తుంటాయి. దీనివల్ల డిస్కౌంట్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ పేరు చెప్పి వస్తువు ధర  తగ్గించినా వారు వాస్తవ విలువకే దాన్ని అమ్మగలుగుతారు.

వినియోగదారునికి వచ్చే ప్రయోజనం ఏంటి?

ఈఎంఐ ద్వారా వస్తువును వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసే వీలుంటుంది. అలాగే రుణం కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయనవసరం లేదు. తక్షణమే పథకాన్ని ఎంచుకుని ఒకేసారి వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ల సమయంలో ఇలా ఈఎంఐ రూపంలో కొన్నప్పుడు ఆ వడ్డీ ప్రయోజనాన్ని పొందే వీలుంటుంది.

చివరిగా: నో-కాస్ట్‌ ఈఎంఐ అనేది పూర్తిగా జీరో వడ్డీ లేదా జీరో ప్రాసిసంగ్‌ ఫీజుతో రాదు. మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు బిల్లులో ఈఎంఐ మొత్తంలో వడ్డీ, పాటు ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ కలిసి ఉంటాయి. ఒక్కోసారి కొనుగోలు చేసిన సమయంలో ఇ-కామర్స్‌ సంస్థలు నో-కాస్ట్‌ ఈఎంఐ పేరిట మినహాయించే మొత్తానికీ.. వాస్తవంలో మీరు చెల్లించే దానికి మధ్య అంతరం ఉండొచ్చు. నో-కాస్ట్‌ ఈఎంఐలో ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటప్పుడు బిల్లును నిశితంగా పరిశీలించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని