Bitcoin vs Gold: బిట్‌కాయిన్‌ వర్సెస్‌ బంగారం..‘యుద్ధం’లో ఏది ఎక్కువ లాభపడింది?

యుద్ధం ఆరంభమైన తర్వాత బిట్‌కాయిన్‌, బంగారం ధరలు ఎలా పెరిగాయో చూద్దాం...

Published : 21 Mar 2022 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత అనేక కమొడిటీల ధరలు పెరిగాయి. చమురు, బంగారం, సిమెంటు, ఉక్కు మరింత ఖరీదయ్యాయి. ఈ క్రమంలో బంగారం, ప్రముఖ క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ మధ్య పోలికలు ప్రారంభమయ్యాయి. 21వ శతాబ్దపు ‘డిజిటల్‌ గోల్డ్‌’గా బిట్‌కాయిన్‌ను వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పెట్టుబడుల విషయంలో ఈ రెండింటి మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని కొత్తతరం మదుపర్లు అంటుంటారు! అయితే, చట్టబద్ధత, విలువలో భారీ ఒడుదొడుకుల విషయానికి వస్తే.. బంగారాన్ని చేరుకోవడానికి బిట్‌కాయిన్‌ ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందనేది సుస్పష్టం.

వాస్తవానికి ఈ పెట్టుబడి సాధనాల విలువ ఏంటనేది ఇలాంటి సంక్షోభ సమయంలోనే తెలుస్తుంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య తీవ్ర సైనిక పోరు కొనసాగుతున్న ఈ సమయంలో బిట్‌కాయిన్ కంటే బంగారాన్ని నమ్ముకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మరి యుద్ధం ఆరంభమైన తర్వాత ఈ రెండింటి మధ్య ధరలు ఎలా పెరిగాయో చూద్దాం..

యుద్ధం ఆరంభం తర్వాత ధరలు ఇలా..

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రారంభించిన ఫిబ్రవరి 24న బిట్‌కాయిన్‌ విలువ 35,082 డాలర్ల వద్ద ట్రేడయింది. అక్కడి నుంచి అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంది. కాయిన్‌మార్కెట్‌ క్యాప్‌ సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం 4:45 గంటల సమయానికి బిట్‌కాయిన్‌ విలువ 41,307 డాలర్ల వద్ద చలిస్తోంది. మొత్తంగా యుద్ధంగా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ కాయిన్‌ విలువ 16% ఎగబాకింది. రష్యా, ఉక్రెయిన్‌లో క్రిప్టోలకు భారీ గిరాకీ లభిస్తోందన్న వార్తలతో ఓ దశలో 44,644 డాలర్ల మార్కుకు కూడా తాకింది. ఈ గరిష్ఠం నుంచి ప్రస్తుతం 8% కింద కదలాడుతోంది.

మరోవైపు బంగారం సైతం యుద్ధం ఆరంభమైన తొలినాళ్లలో భారీగా పెరిగింది. ప్రస్తుతం గరిష్ఠాల నుంచి కిందకు వచ్చి ట్రేడవుతోంది. ఫిబ్రవరి 24న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర భారత్‌లో రూ.50,180గా నమోదైంది. ప్రస్తుతం ఈ ధర దాదాపు రూ.52,900గా దగ్గర ట్రేడవుతోంది. మొత్తంగా ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధర 5.5శాతం పెరిగింది. ఓ దశలో రూ.55,558 మార్క్‌ను తాకింది.

మొత్తంగా చూస్తే యుద్ధం ప్రారంభమైన తర్వాత ధరల విషయంలో బంగారం కంటే బిట్‌కాయినే మదుపర్లకు అధిక ప్రతిఫలాన్ని సమకూర్చి పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని