Updated : 18 Jul 2022 14:36 IST

Rupee: రూపాయి పతనానికి ఆర్‌బీఐ అడ్డుకట్ట.. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలివే..

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2022 ఆరంభం నుంచి యుద్ధం ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందైన ఫిబ్రవరి 23 నాటికి రూపాయి విలువ 0.3 శాతం మాత్రమే తగ్గింది. కానీ, రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 6.9 శాతం పతనమైంది. ప్రస్తుతం ఒక అమెరికన్‌ డాలర్‌ ఇంచుమించు రూ.80 రూపాయల పలికేందుకు చేరువైంది. దేశచరిత్రలో ఇదే రికార్డు స్థాయి పతనం. అధిక ద్రవ్యోల్బణం, ధరల విపరీత పెరుగుదలతో ప్రస్తుతం దేశంలో సామాన్యుల జీవనం భారంగా మారింది. దీనికి రూపాయి పతనం కూడా జతకావడం ఆందోళన కలిగిస్తోంది.

(ఇదీ చదవండి: ధరలు మండుతున్నా... డాలరుదే హవా)

యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కమొడిటీ ధరలు పెరిగాయి. అదే సమయంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వు రేట్ల పెంపు కూడా చేపట్టింది. ఫలితంగా భారత్‌ వంటి వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులు భారీ ఎత్తున తరలిపోతున్నాయి. ఇది కూడా రూపాయి పతనానికి దారి తీసింది. ఈ క్రమంలో రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటోంది. విదేశీ మారక నిల్వల నుంచి గణనీయంగా ఖర్చు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్లను అమ్మడంతో నిల్వలు 50 బిలియన్‌ డాలర్ల మేర తరిగిపోయాయి. ఫలితంగానే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి మెరుగైన స్థితిలో ఉంది. గత నెలరోజులుగా విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకూ ఆర్‌బీఐ పలు చర్యలు చేపట్టింది.

(ఇదీ చదవండి: రూపాయి నేలచూపులు)

  • విదేశాల్లో ఆర్జించిన మొత్తాన్ని దేశీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకునేందుకు వీలుగా ‘ఫారిన్‌ కరెన్సీ నాన్‌ డిపాజిట్‌ రెసిడెంట్‌ (FCNR)’ ఖాతాలను ప్రారంభించేందుకు వీలుంటుంది. వీటిల్లో ఆయా దేశాల కరెన్సీని నేరుగా డిపాజిట్‌ చేయొచ్చు. దేశంలో విదేశీ మారక నిల్వలను పెంచే దిశగా ఆర్‌బీఐ ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచేందుకు అనుమతించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఈ మేరకు ఇప్పటికే వడ్డీరేట్లను సవరించాయి.
  • అంతర్జాతీయ వాణిజ్యంలో దేశీయ కరెన్సీ రూపాయికి ఆదరణ పెరిగేలా ‘ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలు మన రూపాయల్లో జరిగేందుకు వీలుగా అదనపు ఏర్పాట్లు చేయాల’ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) బ్యాంకులను సోమవారం ఆదేశించింది. ఈ వ్యవస్థను ప్రారంభించేందుకు బ్యాంకులు, ఆర్‌బీఐకి చెందిన విదేశీ మారకపు ఎక్స్ఛేంజీ విభాగం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించడంతో పాటు ట్రేడింగ్‌ చేసే వారిలో రూపాయిపై ఆసక్తి పెంచడానికి ఎగుమతులు/దిగుమతుల ఇన్‌వాయిసింగ్‌, చెల్లింపులు, సెటిల్‌మెంట్‌ మన రూపాయల్లో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌బీఐ పేర్కొంది.
  • గతంలో అనుమతించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాల కోసం అప్పుగా తీసుకున్న విదేశీ కరెన్సీని రుణంగా ఇవ్వడానికి అర్హత కలిగిన బ్యాంకులకు అక్టోబర్ 31 వరకు ఆర్‌బీఐ గడువును పెంచింది.
  • ఆర్‌బీఐ జూలై 30 నుంచి ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) (విదేశీ కరెన్సీని నిర్వహించే దేశీయ బ్యాంకు), ఎన్‌ఆర్‌ఈ (నాన్-రెసిడెంట్ బాహ్య రూపాయి)లో పెరుగుతున్న డిపాజిట్లపై ‘నగదు నిల్వల నిష్పత్తి (CRR)’, ‘చట్టబద్ధ ద్రవ్య లభ్యత నిష్పత్తి (SLR)’ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ తెలిపింది. దీని వల్ల బ్యాంకులకు ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
  • ఎక్సటర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్స్‌ (ECBs) మార్గాన కంపెనీలు సమకూర్చుకునే నిధుల పరిమితిని ఆర్‌బీఐ 750 మిలియన్‌ డాలర్ల నుంచి 1.5 బిలియన్‌ డాలర్లకు పెంచింది. అందుకు డిసెంబరు 31 గడువుగా విధించింది.
  • ఆర్‌బీఐ ఎఫ్‌పీఐల కోసం ‘పూర్తిగా యాక్సెస్ చేయగల మార్గం’ కిందకు వచ్చే సెక్యూరిటీలను ఏడు సంవత్సరాలు, 14 సంవత్సరాల సావరిన్ బాండ్‌లకు కూడా విస్తరించింది. ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి కలిగిన బాండ్లలో విదేశీ పెట్టుబడులపై 30 శాతం పరిమితిని కూడా తొలగించింది.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని