Rupee Value: రూపాయి చిక్కింది.. చుక్కలు చూపిస్తుంది..!

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా కుదేలైంది. ఏడాది క్రితం 73.21 వద్ద ఉన్న రూపాయి విలువ ఇప్పుడు ఆరు శాతం పతనమై 77.62 స్థాయికి చేరింది....

Published : 04 Jun 2022 12:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా కుదేలైంది. ఏడాది క్రితం 73.21 వద్ద ఉన్న రూపాయి విలువ ఇప్పుడు ఆరు శాతం పతనమై 77.69 స్థాయికి చేరింది. జనవరి నుంచే ఏకంగా 4 శాతం దిగజారింది. ఒకవేళ అమెరికాలో వడ్డీరేట్లు మళ్లీ పెరిగితే.. డాలరు బలపడి రూపాయి మరింత కిందకు రాక తప్పని పరిస్థితి.

సులభంగా చెప్పాలంటే.. ఒక డాలర్‌ విలువ చేసే వస్తువులకు 2017లో రూ.64 చెల్లిస్తే ఇప్పుడు రూ.77.62 చెల్లించాల్సిన పరిస్థితి. 2017తో పోలిస్తే రూపాయి విలువ ఏటా 3.75 శాతం చొప్పున దిగజారుతూ వచ్చింది. రూపాయి క్షీణత వల్ల మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు మన జేబుకు కూడా చిల్లుపడక తప్పదు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, చమురు ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలకు ఇది చేదువార్తనే చెప్పాలి.

దిగుమతి వస్తువుల ధరలకు రెక్కలు..

రూపాయి బలహీనపడితే.. మనం దిగుమతి చేసుకునే వస్తువులకు మరింత అధికమొత్తం చెల్లించాల్సి వస్తుంది. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ టీవీలు, డిజిటల్‌ కెమేరాలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాల్లో వాడే సర్క్యూట్‌ బోర్డులు దిగుమతి చేసుకుంటున్నందున.. వాటన్నింటి ధరలపై రూపాయి క్షీణత ప్రభావం ఉంటుంది. దిగుమతి చేసుకునే విలాసవంత కార్లు, బైక్‌లతో పాటు కార్ల విడిభాగాలు ప్రియం కావొచ్చు.

చమురు వదలక తప్పదు..

మనదేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. తాజాగా రూపాయి కూడా క్షీణించడంతో ఇంకా పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చమురు దిగుమతుల బిల్లులు పెరిగి దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ధరలు జీవనకాల గరిష్ఠాలకు చేరగా.. కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో వినియోగదారులపై కాస్త భారం తగ్గింది. మరోవైపు రష్యా నుంచి చౌక ధరకు చమురు దొరకడం కూడా ధరల నియంత్రణకు కలిసొచ్చింది.

నిత్యావసరాలూ ఖరీదవుతాయ్‌..

చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచాల్సి వస్తుంది. దీని వల్ల రవాణా ఖర్చులు ఎగబాకుతాయి. రవాణా వ్యయాలు భారమై.. కూరగాయలు, ఇతర వస్తువుల ధరలూ పెరుగుతాయి. ఫలితంగా కూరగాయల వంటి నిత్యావసరాల ధరలు కూడా ఎగబాకుతాయి. తయారీలో ముడి చమురును వినియోగించుకునే సబ్బులు, కాస్మొటిక్స్‌, పెయింట్స్‌ వంటి ఉత్పత్తులపై పడే భారాన్ని కంపెనీలు వినియోగదారులకు మళ్లిస్తాయి. ఫలితంగా ఆయా ఉత్పత్తులు ఖరీదవుతాయి. ఇలా ధరలన్నీ పెరిగి ద్రవ్యోల్బణం తెరపైకి వస్తుంది.

ఈఎంఐలు భారమవుతాయ్‌..

ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్‌బీఐ జోక్యం తప్పదు. ధరల పెరుగుదల కట్టడికి రేపోరేట్లు పెంచుతుంది. ఇప్పటికే ఆ దిశగా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో మరింత పెంచే సూచనలు ఉన్నాయి. ఫలితంగా వడ్డీరేట్లు పెరిగి నెలవారీ వాయిదాలు (ఈఎంఐ)లు భారమవుతాయి. ప్రధానంగా సామాన్యులు, మధ్యతరగతికి ఇది తీవ్ర ఇబ్బందికరం. ఒక వేళ మీ పిల్లలు విద్యా రుణం తీసుకుని విదేశాల్లో చదువుతూ ఉంటే, అదీ భారమవుతుంది.

విదేశీ ప్రయాణాలపైనా..

కొవిడ్‌ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రజలు విదేశీ ప్రయాణాలకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. డాలర్‌ విలువ రూ.70గా ఉన్నప్పుడు, 10,000 డాలర్ల విదేశీయానం ఖర్చు రూ.7 లక్షలు అయితే.. ప్రస్తుత మారకపు విలువ వద్ద అది రూ.7.75 లక్షలకు చేరుతుంది. అంటే డాలర్ల కోసం రూపాయల్లో అదనంగా చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని