Updated : 04 Jun 2022 13:53 IST

`ధూమ‌పానం` ఆరోగ్య బీమా ప్రీమియం ని ఎలా ప్ర‌భావితం చేస్తుంది?

ఆరోగ్య బీమా ఆవ‌శ్య‌క‌త అంద‌రికీ తెలిసిందే. దాని అవ‌స‌రం మ‌నిషి అనారోగ్యానికి గుర‌యిన‌ప్పుడు మాత్ర‌మే తెలుస్తుంది. అయితే, ఆరోగ్య బీమా చేయించేట‌ప్పుడు మ‌నిషి శ‌రీరంలో అప్ప‌టికే ఉన్న అనారోగ్య విష‌యాలు, అల‌వాట్లు, ముఖ్యంగా ధూమ‌పానం అల‌వాటు ఆరోగ్య బీమా కంపెనీకి ఖ‌చ్చితంగా తెల‌పాల్సి ఉంటుంది. ధూమ‌పానం అల‌వాటు ఉన్న‌వారికి, లేనివారికి ఆరోగ్య బీమా ప్రీమియంలో వ్యత్యాసాలు ఉంటాయి. ధూమ‌పానం అల‌వాటు ఉన్న‌వారు ఆ అల‌వాటును బీమా ఎంపిక చేసుకున్న‌ప్ప‌డే తెలపాలి. అలా చేయ‌ని ప‌క్షంలో భ‌విష్య‌త్తులో బీమా క్లెయిమ్ చేసేటప్పుడు చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొవ‌ల‌సి ఉంటుంది, క్లెయిమ్ కూడా రాకపోవచ్చు.

ధూమ‌పానం మీద ఆరోగ్య బీమా కంపెనీలు ప‌ట్టుద‌ల‌గా ఎందుకుంటాయంటే, ధూమ‌పానం అల‌వాటు ఉన్న వారి ఆరోగ్యం మీద దుష్ఫలితాలు చాలా వేగంగా ఉంటాయి. ధూమ‌పానం అల‌వాటు వారి ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్ర‌భావితం చేస్తుంది. నోటి క్యాన్స‌ర్‌, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌, క‌రోన‌రీ హార్ట్ డిసీజెస్‌, కీళ్ల సమస్యలు మొద‌లైన తీవ్ర‌మైన వ్యాధుల‌కు మూల కార‌ణం కావ‌చ్చు. దంతాలు, ఆఖ‌రికి మెద‌డుని కూడా తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది.

ధూమ‌పానం అల‌వాటు అనేక వ్యాధుల‌కు ముఖ‌ద్వారం లాంటిది, చిన్న అల‌వాటుగా ప్రారంభ‌మ‌యి వారి ఆర్ధిక, ఆరోగ్య కార‌కాల‌ను తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది. ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు ఎక్కువగా రావ‌డానికి కూడా ఈ చిన్న అల‌వాటుగా క‌నిపించే ధూమ‌పానం కార‌ణ‌మ‌వుతుంది. అందుచేత‌నే ఆరోగ్య బీమా కంపెనీలు బీమాకు ధ‌ర‌ఖాస్తు  చేర్చుకునేట‌ప్పుడు స్మోకర్, నాన్ స్మోకర్ అని వివ‌రాలు తెలుసుకుని బీమాను అంద‌చేస్తాయి.

అధిక ప్రీమియం రేటు:

ధూమ‌పానం చేసేవారు అనేక ర‌కాల వ్యాధుల బారిన ప‌డే ప్ర‌మాదం ఎక్కువ‌, దీని ఫ‌లితంగా వీరు అధిక రిస్క్ ప‌రిధిలోకి వ‌స్తారు. అంటే బీమాదారు బీమా పాల‌సీపై క్లెయిమ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్ర‌మాదాన్ని భ‌ర్తీ చేయ‌డానికి బీమా కంపెనీలు ధూమ‌పానం చేసేవారి నుండి అధిక ప్రీమియం మొత్తాన్ని వ‌సూలు చేస్తాయి. బీమా కంపెనీ నియ‌మ నిబంధ‌న‌ల‌నుస‌రించి ప్ర‌తి వ్య‌క్తికి ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేసే హ‌క్కు ఉంటుంది. ధూమ‌పానం అల‌వాటు ఉన్న‌వారు పాల‌సీ తీసుకునేట‌ప్పుడు ధూమ‌పానం అల‌వాటు ఉన్న‌ట్లుగానే బీమా కంపెనీకి తెలుపడం మంచిది. దీనివ‌ల్ల వారికుండే రిస్క్‌ని బ‌ట్టీ ప్రీమియం పెరుగుతుంది, కానీ క్లెయిమ్ చేసేట‌ప్పుడు ఇబ్బందులు ఉండ‌వు.

వ్యాధుల మిన‌హాయింపు:

కొన్ని బీమా కంపెనీలు, పాల‌సీల‌లో ధూమ‌పానం సంబంధిత వ్యాధుల‌ను క‌వ‌రేజ్ ప‌రిధి నుండి పూర్తిగా మిన‌హాయించ‌వ‌చ్చు. ఈ మిన‌హాయింపులు పాల‌సీలో పేర్కొన‌బ‌డ‌తాయి. 

పై కార‌ణాల వ‌ల్ల ధూమ‌పానం చేసేవారు బీమా ధ‌ర‌ఖాస్తును పూరించే స‌మ‌యంలో త‌ప్పుడు స‌మాచారాన్ని అందించ‌కూడ‌దు. అంటే ధూమ‌పానం చేసేవారు, చేయ‌నివారుగా పేర్కొన‌కూడ‌దు. ఈ త‌ప్పుడు స‌మాచారం విస్తృత‌మైన ప‌రిణామాల‌కు దారితీస్తుంది. ముఖ్యంగా ఇది మోసానికి సంబంధించిన క్లెయిమ్‌గా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. బీమా క్లెయిమ్ చేసుకునేట‌ప్పుడు ద‌ర్యాప్తులో వీరు బీమా సంస్థ‌తో త‌ప్పుడు స‌మాచారాన్ని పంచుకున్నార‌ని నిర్ధార‌ణ‌కు వ‌స్తే, వీరి క్లెయిమ్ తిర‌స్క‌రించ‌బ‌డుతుంది. బీమా పాల‌సీ ఉన్నా కూడా క్లెయిమ్ రాదు.

చివ‌రిగా:

నిస్సందేహంగా ధూమ‌పానం అల‌వాటు అనేది ఆరోగ్యాన్ని స‌వాలు చేసే అల‌వాటు. ఇది వీరి ఆరోగ్యాన్ని, సంప‌దను ప్ర‌తికూలంగా ప్ర‌భావితం చేస్తుంది. అందువ‌ల్ల, ధూమ‌పానం మానేయ‌డానికి చేసే ప్ర‌య‌త్నాల్లో ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టం చాలా ముఖ్యం. దీనికి అవ‌స‌ర‌మ‌యితే నిపుణులను సంప్ర‌దించ‌డం మంచిది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని