PPF: పీపీఎఫ్‌తో రూ.1 కోటి సమకూర్చడం సాధ్యమేనా?

పీపీఎఫ్‌లో దీర్ఘకాల పెట్టుబడి మంచి రాబడినివ్వడమే కాకుండా, రాబడిపై ఆదాయ పన్ను కూడా ఉండదు. మరి ఇందులో పెట్టుబడి పెట్టి ఎంత సమకూర్చుకోవచ్చో చూద్దాం.

Updated : 18 Nov 2022 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) ఖాతాను మీ స‌మీప పోస్టాఫీసులో గానీ, ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో గానీ ప్రారంభించొచ్చు. చాలా మంది సంప్రదాయ మదుపుదారులు పీపీీఎఫ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.  18 సంవత్సరాలు నిండిన భార‌తీయ పౌరులు ఎవ‌రైనా పీపీఎఫ్‌లో ఖాతాను తెరిచి పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఖాతా తెర‌వ‌డానికి గ‌రిష్ఠ వ‌యో ప‌రిమితి లేదు. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెర‌వాలి. ఉమ్మడి ఖాతా సౌకర్యం లేదు. దీనిపై వార్షికంగా 7.10% వడ్డీ పొందొచ్చు. ప్రస్తుతం సీనియర్‌ సిటిజన్లకు చాలా బ్యాంకులు ఈ వడ్డీ రేటు కన్నా కాస్తా ఎక్కువ ఇస్తున్నప్పటికీ.. రాబడిపై ఆదాయ పన్ను ఉంటుంది. పీపీఎఫ్‌ రాబడిపై ఆదాయ పన్ను లేదు.

పీపీఎఫ్‌లో ప్రస్తుత వడ్డీ 7.10%తో రోజుకు రూ. 411 (సంవత్సరానికి రూ. 1,50,000) పెట్టుబడి పెడితే.. 25 ఏళ్లకు రూ.1 కోటి సంపాదించొచ్చు. ఈ పథకం కింద అనుమతి ఉన్న గరిష్ఠ డిపాజిట్‌ ఏడాదికి రూ. 1.50 లక్షలు. నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఆ తరువాత ప్రతి 5 సంవత్సరాలకు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు. ఇలా అపరిమిత కాలానికి ఈ స్కీమ్‌ను పొడిగించొచ్చు.

15 ఏళ్లకు ఎంత పొందొచ్చు

ప్రస్తుత పీపీఎఫ్‌ వడ్డీ రేటు 7.1% ఉంది. ఇదే రేటు పూర్తి 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటే.. ఏడాదికి రూ. 1.5 లక్షలు (రోజు రూ. 411 పెట్టుబడికి సమానం) డిపాజిట్‌ చేసినవారు మెచ్యూరిటీ సమయంలో రూ. 40,68,209 వరకు పొందొచ్చు.

20 ఏళ్లకు ఎంత పొందొచ్చు

పైన తెలిపిన విధంగా 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత 5 సంవత్సరాల బ్లాక్‌లలో ఖాతాను పొడిగించొచ్చు. మీరు పై విధంగా పెట్టుబడి పెడితే మీ సంపద 20 సంవత్సరాల్లో రూ. 66,58,288కు పెరుగుతుంది. 

25 ఏళ్లకు..

మీరు ఖాతాను పొడిగించి, మరో 5 సంవత్సరాలు పెట్టుబడిని కొనసాగిస్తే.. మీ సంపద 25 ఏళ్లలో దాదాపు రూ. 1.03 కోట్లకు పెరుగుతుంది. ఈ మొత్తంలో మీరు డిపాజిట్‌ చేసేది రూ. 37,50,000 అయితే.. వడ్డీ రూ. 65,58,015 వస్తుంది.

30 ఏళ్లకు ఎంత?

ఇంకో 5 సంవత్సరాలు రూ. 1.50 లక్షలు పెట్టుబడిని కొనసాగిస్తే.. 30 ఏళ్ల తర్వాత మీరు మీ మదుపు, వడ్డీ కలిపి దాదాపు రూ. 1.50 కోట్లను కలిగి ఉంటారు.

స్వల్ప మొత్తంలో డిపాజిట్

పీపీఎఫ్‌లో గరిష్ఠ మొత్తాన్నే డిపాజిట్‌ చేయాలని లేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో క‌నీసం రూ. 500 డిపాజిట్ చేయొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో క‌నీస డిపాజిట్‌గా రూ. 500 కూడా చేయ‌ని ప‌క్షంలో పీపీఎఫ్ ఖాతా స్తంభింపజేస్తారు. పీపీఎఫ్ ఖాతాను మ‌ళ్లీ కొన‌సాగించ‌డానికి సంవత్సరానికి రూ. 50 స్వల్ప జ‌రిమానా చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు