Credit Score: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా.. లోన్ పొందొచ్చిలా!

Credit Score: లోన్‌ ఇవ్వడానికి బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు క్రెడిట్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. అది తక్కువుంటే రుణం పొందడం కష్టమవుతుంది. అలాంటప్పుడు కూడా లోన్‌ పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని సకాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగుపర్చుకోవచ్చు.

Updated : 26 Oct 2022 11:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతదేశంలో చిన్న మొత్తంలో లోన్‌ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి లోన్‌లను రిటైల్‌ రుణాలు (Retail Loan)గా వ్యవహరిస్తుంటారు. ఈ మధ్య లోన్‌యాప్‌ (Loan App)ల వేధింపుల గురించి మనం చాలా వింటున్నాం. ఈ బాధితులంతా రిటైల్‌ రుణగ్రహీతలే. మోసం చేస్తున్నారని తెలిసినా రుణం తీసుకుంటున్న వారి సంఖ్య పెద్ద ఎత్తునే ఉంటోంది. అంటే రుణాల అవసరం ఏ స్థాయిలో పెరిగిపోయిందో తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని సంస్థలు ‘క్రెడిట్‌ రిస్క్‌’ ఉన్నవారికి కూడా లోన్ ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. క్రెడిట్ బ్యూరో అయిన ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ నివేదిక ప్రకారం, సబ్‌ప్రైమ్ రుణగ్రహీతలు (‘క్రెడిట్‌ రిస్క్‌’ ఉన్నవారు) ఇప్పుడు మొత్తం రిటైల్ లోన్‌లలో 32 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇది 2019లో 28 శాతంగా ఉంది.

సబ్‌ప్రైమ్‌ రుణగ్రహీత అంటే..

దీనికి ఒక నిర్దిష్టమైన నిర్వచనమేమీ లేదు. కానీ, క్రెడిట్‌ రిస్క్‌ ఉన్నవారందరినీ ఈ కేటగిరీ కింద వర్గీకరిస్తున్నారు. దివాలా, అపరాధ చరిత్ర ఉన్నవారితో పాటు రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువ ఉన్నవారిని సబ్‌ప్రైమ్‌ రుణగ్రహీతలుగా అనుకోవచ్చు. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ ప్రకారమైతే క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score) 300- 680 మధ్య ఉన్నవారు ఈ కేటగిరీ కిందకు వస్తారు.

ఎన్‌బీఎఫ్‌సీలు, డిజిటల్‌ సాధనాలే మార్గం..

లోన్‌ తీసుకోవడంలో క్రెడిట్‌ స్కోర్‌ది కీలక పాత్ర. దీంతో పాటు వయసు, ఆదాయం, ఉద్యోగం.. వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. లోన్‌ మంజూరుకు కావాల్సిన క్రెడిట్‌ స్కోర్‌ పరిమితి సంస్థను బట్టి మారుతుంటుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), కొత్తతరం డిజిటల్‌ యాప్‌లు క్రెడిట్‌ స్కోర్‌ సహా ఇతర విషయాల్లో బ్యాంకులతో పోలిస్తే అంత కఠినంగా ఉండడం లేదని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో సబ్‌ప్రైమ్‌ రుణగ్రహీతలు లోన్‌ కోసం వీటిని ఆశ్రయించవచ్చు. అయితే, వడ్డీరేటు అధికంగా ఉంటుంది. అలాగే డిజిటల్‌ రుణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్‌ మోసాలతో పాటు రుణయాప్‌ల వేధింపులు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. అత్యవసరమై.. ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాతే ఈ వేదికలపై రుణాలు తీసుకోవాలి.

లోన్‌ పొందడానికి ఈ కేటగిరీకి ఉన్న మరోమార్గం పసిడి. బంగారం చేతిలో ఉన్నవారు దాన్ని తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు. ఒకవేళ రుణం ఎగ్గొట్టినా.. దాన్ని వేలం వేసి సంస్థలు రికవరీ చేసుకుంటాయి. అందుకే క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా, ప్రొఫైల్‌ రిస్క్‌తో కూడినదైనప్పటికీ బంగారం రుణాలు ఇవ్వడానికి సంస్థలు ఆసక్తి చూపిస్తాయి.

సబ్‌ప్రైమ్‌ మూల్యం..

క్రెడిట్‌ స్కోర్‌ మన ఆర్థిక చరిత్రను సూచిస్తుంది. అంటే ఆర్థిక విషయాల్లో మనం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నామో తెలియజేస్తుంది. తక్కువ క్రెడిట్‌ స్కోర్ ఉంటే రుణం పొందడం కష్టతరమవుతుంది. ఒకవేళ పొందినా వడ్డీరేటు అధికంగా ఉంటుంది. వాస్తవానికి సబ్‌ప్రైమ్‌ కేటగిరికీకి.. మిగిలిన వారికి క్రెడిట్‌ స్కోర్‌ మధ్య వ్యత్యాసం కేవలం 100-150 పాయింట్లే ఉంటుంది. కానీ, వడ్డీరేటులో మాత్రం 2-5 శాతం వరకు అధికంగా ఉండొచ్చు.

సబ్‌ప్రైమ్‌ నుంచి బయటకు రావడమెలా..

క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగుపర్చుకుంటే సబ్‌ప్రైమ్‌ నుంచి ప్రైమ్‌ కేటగిరీలో చేరొచ్చు. క్రెడిట్‌ స్కోర్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ప్రతి త్రైమాసికంలో ఒకసారి దాన్ని క్షుణ్నంగా సమీక్షించుకోవాలి. ఎక్కడ లోపం ఉందో తెలుస్తుంది. అన్ని బకాయిలు, వాయిదాలను సకాలంలో చెల్లించాలి. అలాగే ‘క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో’ పరిమితి దాటకుండా చూసుకోవాలి. అంటే స్తోమతకు మించిన అప్పులు చేయొద్దు. రుణాలు పెరిగిన కొద్దీ క్రెడిట్‌ రిస్క్‌ అధికమవుతోందని అర్థం. ఆదాయంలో ఈఎంఐల మొత్తం 50 శాతం మించకుండా చూసుకోవాలి. క్రెడిట్‌ కార్డుపై బకాయిల మొత్తం ఏ సమయంలోనూ క్రెడిట్‌ పరిమితిలో 30-40 శాతం దాటకుండా చూసుకోవాలి. అవసరం లేకున్నా తరచూ లోన్స్‌ కోసం ఆన్‌లైన్‌లో ఆరా తీయొద్దు. ఇది మీ అస్థిరత్వాన్ని సూచిస్తుంది. మరోవైపు సెక్యూర్డ్‌, అన్‌సెక్యూర్డ్‌ రుణాల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి.

కొత్తగా రుణాలు తీసుకునేవారు..

కొత్తగా ఉద్యోగంలో చేరి ఆర్జించడం ప్రారంభించినవారికి కూడా క్రెడిట్‌ స్కోర్ మెరుగ్గా ఉండకపోవచ్చు. అలాంటి వారు రుణం పొందడం కష్టమవుతుంది. అలాగే రుణం తీసుకొని దాన్ని సకాలంలో తీర్చడం ప్రారంభిస్తేనే స్కోరు మెరుగవుతుంది. ఇది ఒక సంకట స్థితి అనే చెప్పాలి.

అలాంటివారు వినియోగవస్తువుల రుణాలు తీసుకోవడంతో ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఉదాహరణకు మొబైల్‌ ఫోన్‌, రిఫ్రిజిరేటర్‌, టీవీ వంటి వాటిని రుణంతో కొని వాయిదాలను సకాలంలో చెల్లించాలి.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్లపై క్రెడిట్‌ కార్డుని తీసుకోవడం ద్వారా కూడా క్రెడిట్‌ స్కోర్‌ను పెంచుకోవచ్చు.

పెద్ద మొత్తంలో రుణం కావాలంటే మాత్రం బంగారం లేదా ఇతర ఏదైనా ఆస్తి పత్రాలను తనఖా పెట్టి తీసుకోవాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని