Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. వ‌డ్డీ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ ప‌డండి!

క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ పొందిన ప్రతిసారీ, మొత్తం బకాయిలను సకాలంలో చెల్లించారని నిర్ధారించుకోండి

Updated : 04 May 2022 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌లో వ‌స్తువు కొనుగోలు చేయాలన్నా లేదా ఏదైనా షాపులో బిల్లు చెల్లించాల‌న్నా క్రెడిట్ కార్డు స్వైప్ చేయ‌డం నేటి రోజుల్లో స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. ఖాతాలో బ్యాలెన్స్ లేక‌పోయినా క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేయ‌గ‌ల‌గ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. క్రెడిట్ కార్డ్‌.. పేరులో ఉన్న‌ట్లే మ‌నం క్రెడిట్ కార్డుతో ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయీ అప్పు తీసుకున్న‌ట్లే. అయితే ఇక్క‌డ కొంత వ‌డ్డీ ర‌హిత కాల‌వ్య‌వ‌ధి ల‌భిస్తుంది. ఇదే ఇందులో ఉన్న ప్ర‌యోజ‌నం. దీన్ని ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం స‌రిగ్గా వాడుకుంటే ప్ర‌యోజ‌నాలే ఎక్కువ‌. అలా కాకుండా ఇష్టారీతిన వాడితే రుణ వ‌ల‌యంలో చిక్క‌కుపోవ‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌దు.  

త‌క్కువ వ‌డ్డీతో క్రెడిట్ కార్డును వినియోగించేందుకు స‌హాయ‌ప‌డే మార్గాలు..
1. పూర్తిగా చెల్లించండి: క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించేందుకు వ‌డ్డీ ర‌హిత కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది. ఈ లోపు పూర్తి బిల్లును చెల్లిస్తే ప‌ర్వాలేదు. లేదంటే వ‌డ్డీ ప‌డుతుంది. పూర్తి బిల్లును చెల్లించ‌లేని వారు క‌నీసం 5 శాతం బిల్లును చెల్లించి మిగిలిన మొత్తాన్ని త‌ర్వాతి నెల‌కు బదిలీ చేసుకోవ‌చ్చు. కానీ ప్ర‌తీసారి ఇదే ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తే వేగంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. ఒక‌వేళ క‌నీసం చెల్లించాల్సిన 5 శాతం బిల్లును కూడా స‌కాలంలో చెల్లించ‌క‌పోతే వ‌డ్డీ, ప‌న్నుల‌తో పాటు ఆల‌స్య‌పు రుసుములు ఛార్జ్ చేస్తారు. మీరు చెల్లించని 95 శాతం మొత్తం మీద వడ్డీ పడుతుందని గమనించాలి.

ఏం చేయాలి?
మీరు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ పొందిన ప్రతిసారీ, మొత్తం బకాయిలను సకాలంలో చెల్లించాలని నిర్ధారించుకోండి. స్టేట్‌మెంట్ తేదీ నుంచి బకాయి మొత్తాన్ని చెల్లించడానికి మీకు కొన్ని రోజుల సమయం లభిస్తుంది. సాధారణంగా ఇది 30-45 రోజులు ఉండొచ్చు. ఈ లోపు 5 శాతం క‌నీస బిల్లు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని వాయిదాలు వేయ‌కుండా పూర్తి బిల్లును స‌కాలంలో చెల్లించ‌డం వ‌ల్ల వ‌డ్డీ, పెనాల్టీల అద‌న‌పు భారం ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డొచ్చు.

2. కొత్త కొనుగోళ్లు వ‌ద్దు: మీరు మునుపటి నెల బాకీని పూర్తిగా చెల్లించ‌కుంటే, కొత్త కొనుగోళ్లపై వడ్డీ రహిత వ్యవధి గురించి మర్చిపోండి. పాత బిల్లును చెల్లించ‌కుండా, కొత్త కొనుగోళ్లు చేస్తే.. 'రోల్ ఓవర్' చేసిన మొత్తంతో పాటు కొత్త కొనుగోళ్ల‌కు వడ్డీ రహిత వ్యవధి ప్రయోజనం కోల్పోతారు. దీంతో రెండింటిపైనా వడ్డీ రేటు వ‌ర్తిస్తుంది. సాధార‌ణంగా త‌ర్వాతి బిల్లు సైకిల్‌కి బ‌దిలీ చేసిన బ్యాలెన్స్‌పై 3-4 శాతం నెల‌వారీ వ‌డ్డీ ప‌డుతుంది. ప్ర‌తి నెలా పాత బ‌కాయిల‌ను పూర్తిగా చెల్లించ‌కుండా కొత్త కొనుగోళ్లు చేస్తూ పోతే వ‌డ్డీ మొత్తం పెరిగిపోతుంది. దీంతో క్రెడిట్ కార్డు బిల్లు మ‌రింత భారం అవుతుంది.

ఏం చేయాలి?
బ‌కాయి ఉన్న మొత్తాన్ని చెల్లించేంత వ‌ర‌కు కొత్త కొనుగోళ్లు చేయ‌కండి. దీంతో వ‌డ్డీ భారం కాస్త త‌గ్గించుకోవ‌చ్చు.

3. ఈఎమ్ఐ: క్రెడిట్ కార్డును ఉప‌యోగించి భారీ మొత్తంలో కొనుగోళ్లు చేసిన‌ప్పుడు మొత్తం బిల్లును వ‌డ్డీ ర‌హిత వ్య‌వ‌ధిలో చెల్లించ‌డం క‌ష్టం అవుతుంది. అలాంట‌ప్పుడు ఈఎంఐ మార్పిడి ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌డం ద్వారా దాదాపు 14-24 శాతం వ‌డ్డీ భారాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

ఏం చేయాలి?
ఈఎంఐ ఆప్ష‌న్ రెండు ర‌కాలుగా ఎంచుకోవ‌చ్చు. అధిక ధ‌రతో కూడిన వ‌స్తువుల‌ను కొనుగోలు చేసిన‌ప్పుడు కొన్ని వ్యాపార సంస్థ‌లు క్రెడిట్ కార్డు - ఈఎంఐ ఆప్ష‌న్‌తో బిల్లు చెల్లించే అవ‌కాశాన్ని క‌ల్పిస్తాయి. ఇలా వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం మొద‌టి ప‌ద్ధ‌తి. వ‌స్తువు కొనుగోలు చేసిన‌ప్పుడే ఈఎంఐ ఆప్ష‌న్‌, కాల‌ప‌రిమితుల‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక రెండోది - పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసిన‌ప్పుడు క్రెడిట్ కార్డు ప్రొవైడర్లు కూడా తక్కువ వడ్డీ రేటుతో నెలవారీ వాయిదాలలో చెల్లించే అవకాశానిస్తాయి. సాధార‌ణంగా ఈఎంఐ ద్వారా 6 - 12 నెలల పాటు చెల్లించే అవ‌కాశం ఉంటుంది. ఈ మధ్య వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తున్నారు. ఇలాంటి ఉన్నట్టయితే మీకు సమయం లభిస్తుంది. వడ్డీ భారం కూడా ఉండదు.

4. బ్యాలెన్స్ బ‌దిలీ: ఒక్కోనెల అనుకోని అద‌న‌పు ఖ‌ర్చులు చేయాల్సి వ‌స్తుంది. అటువంట‌ప్పుడు నిధుల కొర‌త కార‌ణంగా పూర్తి బిల్లు చెల్లించ‌లేక‌పోవ‌చ్చు. ఇలాంటి సంద‌ర్భాల్లో సాధార‌ణంగా క‌నీస బిల్లును చెల్లించి మిగిలిన మొత్తాన్ని త‌ర్వాతి నెల‌కు బ‌దిలీ చేస్తుంటాం. ఇందాక తెలిపినట్టుగా దీనిపై నెల‌కు 3 నుంచి 4 శాతం వ‌డ్డీ ప‌డుతుంది. 

ఏం చేయాలి?
బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లించ‌లేన‌ప్పుడు ‘బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ (బీటీ)’ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. బీటీ ఆప్ష‌న్ కింద, మీరు బకాయి ఉన్న మొత్తాన్ని తక్కువ వడ్డీ రేటుతో మరొక క్రెడిట్ కార్డ్‌కి బదిలీ చేసుకోవ‌చ్చు. కొన్ని సంస్థ‌లు ఆరు నెలలు వడ్డీ లేకుండా రుణాలు చెల్లించే అవకాశం కూడా ఇస్తాయి. ఇలాంటి అవకాశం లేకపోయినా, మరో కార్డుకి బ్యాలన్స్ బదిలీ చేయడం వల్ల మరి కాస్త సమయం లభిస్తుంది. ఈ లోపు మీరు డబ్బుని సద్దుబాటు చేయవచ్చు. అయితే, ఇది అలవాటుగా మారకూడదు. మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపవచ్చు.

5. నగదు విత్‌డ్రా వ‌ద్దు: క్రెడిట్ కార్డుల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ఈ విధానం స‌రికాద‌ని గుర్తుంచుకోండి. మీకు డబ్బు కావాలనుకుంటే డెబిట్ కార్డులను వాడాలి. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే నగదు ఉపసంహరణలపై అదే రోజు నుంచి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని గమనించాలి. ఇది మాత్రమే కాకుండా, కొన్ని క్రెడిట్ కార్డులు నగదు ఉపసంహరణలకు అదనపు వడ్డీని వసూలు చేస్తాయి.

ఏం చేయాలి?
ఒకవేళ అత్యవసర సమయంలో ఇంకొక ఆప్షన్ లేకపోతే, క్రెడిట్ కార్డు ద్వారా నగదును ఉపసంహరించుకొని, వీలైనంత త్వరగా ఆ మొత్తాన్ని చెల్లించడం మంచిది. వడ్డీ రోజువారీగా వసూలు చేస్తారు. అయితే, త్వరగా చెల్లించడం ద్వారా తక్కువ వడ్డీతో బయటపడే అవకాశం ఉంటుంది.

చివరిగా: క్రెడిట్ కార్డు రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. అత్యవసరం అనుకుంటేనే కార్డును ఉపయోగించి కొనుగోళ్లు చేయాలి. వ‌డ్డీ ర‌హిత కాల‌వ్య‌వ‌ధి ఉంది క‌దా అని అక్కర్లేనివన్నీ కొని.. తీరా స‌మ‌యానికి బిల్లు చెల్లించ‌క‌పోతే వ‌డ్డీ (సాధార‌ణంగా క్రెడిట్ కార్డుపై వార్షికంగా 30 - 45 శాతం వ‌డ్డీ వ‌ర్తిస్తుంది) భారం అవుతుంది. క్రెడిట్ స్కోరు దెబ్బ‌తింటుంది. అదే క్రెడిట్ కార్డును సమర్థంగా ఉపయోగించ‌గ‌లిగితే మంచి క్రెడిట్ స్కోరు సాధించేందుకు వీలవుతుంది. భవిష్యత్లో బ్యాంకు నుంచి రుణాల ఆమోదం, మంజూరు వంటివి సుల‌భం అవుతాయి. అందుకే క్రెడిట్ కార్డు విష‌యంలో బాధ్యతాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం చాలా అవ‌స‌రం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని