Fixed Deposits: ఎఫ్‌డీల్లో లిక్విడిటీ స‌మ‌స్య కాకూడదంటే.. ఏం చేయాలి?

లిక్విడిటీ స‌మ‌స్య‌ను అధిగ‌మంచ‌డానికి చాలా బ్యాంకులు స్వీప్-ఇన్‌-ఖాతాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి

Published : 24 Nov 2021 16:39 IST

భార‌త్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌కు చాలా ఆద‌ర‌ణ ఉంది. సాంప్రదాయ పెట్టుబ‌డి మార్గం కావ‌డం, అలాగే న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉండడం వ‌ల్ల వ‌డ్డీ రేట్లు తగ్గిన‌ప్ప‌టికీ.. ఈ ప‌థ‌కాల‌ను ఎంచుకునే వారి సంఖ్య మాత్రం త‌గ్గ‌డం లేదు. 7 రోజుల నుంచి మొద‌లుకుని 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వివిధ కాల‌ప‌రిమితుల‌లో విస్తృత శ్రేణిలో ఎఫ్‌డీల‌ను అందిస్తున్నాయి బ్యాంకులు. అయితే, ఇందులో ఉన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ లిక్విడిటీ. మెచ్యూరిటి కంటే ముందుగానే ఉప‌సంహరించుకుంటే బ్యాంకులు కొంత జ‌రిమానా విధించ‌వ‌చ్చు. ఈ పెనాల్టీ వేరు వేరు బ్యాంకులకు వేరు వేరుగా ఉంటుంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు.. త‌మ బ్యాంకు నియ‌మ‌, నిబంధ‌నల‌ను అనుస‌రించి ప్రీమెచ్యూర్ విత్‌డ్రాల‌ను అనుమితిస్తాయి, అలాగే రుసుముల‌ను విధిస్తాయి. 

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు రెండు ర‌కాలుగా ఉంటాయి. 1. ప్రీ మెచ్యూర్ విత్‌డ్రా స‌దుపాయంతో 2. ప్రీ మెచ్యూర్ విత్‌డ్రా స‌దుపాయం లేకుండా. రెండ‌వ విధానంలో ఖ‌చ్చిత‌మైన‌ లాక్‌-ఇన్‌-పిరియ‌డ్ ఉంటుంది. 

ప్రీ-మెచ్యూర్ విత్‌డ్రాల‌పై పెనాల్టీ ఎంతుంటుంది? 
కాల‌వ్య‌వ‌ధి పూర్తికాక‌ముందే.. ఖాతా నుంచి డ‌బ్బును విత్‌డ్రా చేసుకున్నా, ఖాత‌ను ర‌ద్దు చేసినా బ్యాంకులు కొంత పెనాల్టీని చార్జ్ చేస్తాయి. ఇది సాధార‌ణంగా 0.55 శాతం నుంచి 1 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు, ఐసీఐసీఐ బ్యాంక్‌.. రూ. 5 కోట్ల కంటే త‌క్కువ మొత్తం ఉన్న.. ఒక సంవ‌త్స‌రం లోపు ఎఫ్‌డీ ముందస్తు విత్‌డ్రాల‌పై 0.50 శాతం, ఏడాది కంటే ఎక్కువ కాల‌ప‌రిమితి ఉన్న ఎఫ్‌డీ ముంద‌స్తు విత్‌డ్రాల‌పై 1 శాతం పెనాల్టీ విధిస్తుంది.

అదేవిధంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రూ.5 ల‌క్ష‌ల లోపు ఎఫ్‌డీ ముంద‌స్తు విత్‌డ్రాల‌కు 0.05 శాతం, రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ. 1 కోటి మ‌ధ్య ఎఫ్‌డీ ముంద‌స్తు విత్‌డ్రాల‌కు 1 శాతం జ‌రిమానా విధిస్తుంది. ఒక‌వేళ‌ మీరు ఎస్‌బీఐలో రూ. 3 ల‌క్ష‌ల‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి కాల‌ప‌రిమితి కంటే ముందుగా విత్‌డ్రా చేసుకుంటే.. రూ. 1500 జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ మీకు ఇదే బ్యాంకులో రూ. 18 ల‌క్ష‌ల‌ ఎఫ్‌డీ ఉంటే ముంద‌స్తు విత్‌డ్రాల‌కు రూ. 18,000 పెనాల్టీ వ‌సూలు చేస్తారు. పెనాల్టీ ని వడ్డీ మొత్తం నుంచి తగ్గించి మిగిలిన వడ్డీ మనకి అందిస్తారు.  

లిక్విడిటీ స‌మ‌స్య కాకూడ‌దంటే..
ఏదైనా అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో మెచ్యూరిటీకి ముందే డ‌బ్బు విత్‌డ్రా చేసుకుంటే లేదా మూసివేస్తే అద‌న‌పు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు, పెట్టుబడి పెట్టిన కాల పరిమితి తగ్గినందున వ‌డ్డీ రేట్లు కూడా త‌గ్గుతాయి. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మంచ‌డానికి చాలా బ్యాంకులు స్వీప్-ఇన్‌-ఖాతాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ ఖాతాల‌తో పొదుపు, డిపాజిట్ల‌కు కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంది. అదే విధంగా లిక్విడిటీకి అవ‌కాశం కూడా ఉంటుంది. సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే దీనిలో వ‌డ్డీ రేట్లు ఉంటాయి. స్వీప్‌-ఇన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఉన్న మ‌రో అద‌న‌పు ప్ర‌యోజ‌నం ఏంటంటే లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉండ‌దు. అదే విధంగా ముందుగా డ‌బ్బు తీసుకుంటే ఎలాంటి రుసుములు ఉండ‌వు. స్వీప్‌-ఇన్ ఖాతాలో క‌నీస నిల్వ‌ను ఖాతాదారుడు నిర్ణ‌యించుకుంటాడు. అంత‌కుమించి డిపాజిట్ చేస్తే, ఆ మొత్తం ఆటోమేటిక్‌గా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు బదిలీ అవుతుంది. ఎప్పుడైనా ఖాతాదారుడు డ‌బ్బు అవ‌స‌ర‌మ‌నుకుంటే సేవింగ్స్ ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ (స్వీప్ ఇన్‌) చేసుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు, పొదుపు ఖాతాలో రూ. 2 ల‌క్ష‌లు ఉంటే, మీరు  కనీస ప‌రిమితి రూ. 20 వేలుగా నిర్ణ‌యించుకున్నారు అనుకుందాం. మిగ‌తా రూ. 1,80,000 ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఖాతాకు ట్రాన్స్‌ప‌ర్ అవుతాయి. ఒక‌వేళ మీకు రూ. 20 వేల కంటే ఎక్కువ‌గా అవ‌స‌రం అయితే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ నుంచి పొదుపు ఖాతాలోకి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అయితే సొంతంగా ప‌రిమితి విధించుకునే అవ‌కాశాన్ని కొన్ని బ్యాంకులు మాత్ర‌మే ఇస్తాయి. మ‌రిన్ని బ్యాంకుల్లో రూ. 20 వేల నుంచి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ప‌రిమితిని వారే నిర్ణ‌యిస్తారు. దీంతో పాటు క‌నీస నిల్వ రూ. 1000 నుంచి రూ. 10,000 వ‌రకు ఉండాలి. కొన్ని బ్యాంకుల్లో స్వీప్‌-ఇన్ ఎఫ్‌డీల కాల‌ప‌రిమితి ఏడాది మాత్ర‌మే ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని