Banking frauds: సైబర్‌ బూచోళ్లకు దొరకూడదంటే ఏం చేయాలి?

బ‌ల‌మైన పాస్‌వ‌ర్డ్‌ల‌ను సృష్టించ‌డానికి అప్ప‌ర్‌, లోయ‌ర్ కేస్ అక్ష‌రాలు, సంఖ్య‌లు, ప్ర‌త్యేక అక్ష‌రాల క‌ల‌యిక‌ను ఉప‌యోగించండి.

Updated : 18 Jul 2022 16:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్ బ్యాంకింగ్ స‌ర్వీసులు రావ‌డం వల్ల ఖాతాదారుల పనేకాదు.. డబ్బులు కొట్టేసే సైబర్‌ నేరగాళ్ల పనీ సులువైంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా డబ్బులు కొట్టేయడం ఖాయం. అందుకే మన ఖాతాలో న‌గ‌దు నిల్వ‌ల‌ను కాపాడుకోవ‌డానికి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఒకవేళ మీరూ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహిస్తున్న వారైతే ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం.

బ‌ల‌హీన‌మైన పాస్‌వ‌ర్డ్స్ పెట్టొద్దు: మీరు బ‌ల‌హీన‌మైన ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వ‌ర్డ్‌ని క‌లిగి ఉంటే హ్యాక‌ర్‌లు మీ ఖాతాను తెలివిగా తెర‌వ‌గ‌ల‌రు. qwerty, 123456 వంటి పాస్‌వర్డ్‌లు పెడితే మీ నగదును సులువుగా ఎత్తుకెళ్లిపోతారు సైబర్‌ నేరగాళ్లు. ఇంకా మీ ఇంట్లో వారి పేరు, మొబైల్ నంబర్‌, మీ వాహ‌నం నంబ‌ర్, మీ పుట్టిన సంవ‌త్స‌రం, వివాహ వార్షికోత్స‌వం వంటివి పాస్‌వర్డ్‌ పెట్టినా ఆన్‌లైన్‌ దొంగల చేతిలో మీరే స్వయంగా తాళాలు పెట్టినట్లే. ఎందుకంటే సైబర్‌ నేరగాళ్లు ఎప్పుడూ వీటిపై ఓ లుక్కేసి ఉంచుతారు. అన్ని ఖాతాల‌కూ ఒకే పాస్‌వ‌ర్డ్‌ను ఉపయోగించడమూ శ్రేయస్కరం కాదు. కాబ‌ట్టి, మీ ప్ర‌తి ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఖాతాకు ప్ర‌త్యేక‌మైన, బ‌ల‌మైన పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఉప‌యోగించండి. బ‌ల‌మైన పాస్‌వ‌ర్డ్‌ల‌ను సృష్టించ‌డానికి అప్ప‌ర్‌, లోయ‌ర్ కేస్ అక్ష‌రాలు, సంఖ్య‌లు, ప్ర‌త్యేక అక్ష‌రాలను ఉపయోగించండి. ఎప్పటికప్పుడు మీ పాస్‌వర్డ్‌లు మారుస్తూ ఉండండి.

వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఎవ‌రికీ చెప్పొద్దు: వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఇత‌రుల‌తో చెప్ప‌కూడ‌దు. మీ వ్య‌క్తిగ‌త వివ‌రాలు, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను తెలియ‌ని వ్య‌క్తితో పంచుకుంటే.. వారు మీ బ్యాంక్ ఖాతాను ప్ర‌మాదంలో ప‌డేస్తారు. మీ పుట్టిన తేదీ, వివాహ తేదీ, కుటుంబ స‌భ్యుల పేరు, గుర్తింపు రుజువులు, సంత‌కం మొద‌లైన మీ వివ‌రాల‌ను సేక‌రించి మోస‌గాళ్లు మీ బ్యాంకు పాస్‌వ‌ర్డ్‌లను ఛేదించే అవ‌కాశ‌ముంది. మీ వివ‌రాలు ల‌భిస్తే, మోస‌గాళ్ల‌కు వారు బ్యాంకు అధికార్లలా బ్యాంకు ఖాతాదారుల‌కు ఫోన్‌చేసి న‌మ్మ‌కంగా మీ వివ‌రాల‌న్ని చెబుతారు. వ్య‌క్తిగ‌త వివ‌రాలు న‌మ్మ‌కంగా చెప్ప‌డం వల్ల మిమ్మ‌ల్ని ఓటీపీని చెప్పించేవ‌ర‌కు చాలా తెలివిగా మాట్లాడి మీ పొదుపు ఖాతాను ఖాళీ చేసేస్తారు. ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి.. బ్యాంకు అధికారులు ఎప్పుడూ ఖాతాదారుల‌ను కాల్ చేసి ఓటీపీ అడగ‌రు.

బ్యాంకు భ‌ద్ర‌తా స‌ల‌హాల‌ను అనుస‌రించండి: బ్యాంకులు సాధార‌ణంగా ఇ-మెయిల్‌, సోష‌ల్ మీడియా ద్వారా ఎప్ప‌టిక‌ప్ప‌డు భ‌ద్ర‌తా స‌ల‌హాల‌ను పంపుతాయి. ఖాతాదారులు తమ ఖాతాల‌ను ఎలా సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు. మోసాలు, స్కామ్‌ల బారిన ప‌డ‌కుండా ఎలా జాగ్రత్త పడచ్చు అనేదానిపై ఖాతాదారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. ఈ స‌ల‌హాల‌పై శ్ర‌ద్ధ వ‌హించాలి, వాటిలోని సూచ‌న‌ల‌ను ఎల్ల‌వేళ‌లా అనుస‌రించాలి.

బ్యాంక్ స్టేట్‌మెంట్‌, మెసేజ్‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా చూసుకోవాలి: మీ బ్యాంకు ఖాతాపై నిఘా ఉంచాలి. ఏదైనా అసాంఘిక కార్య‌క‌లాపాన్ని వెంట‌నే ప‌సిగ‌ట్ట‌డానికి ఇది మీకు ఉప‌యోగ‌ప‌డుతుంది. బ్యాంకులు ఖాతాదారుల‌కు లావాదేవీల గురించి తెలుపుతూ ఎస్ఎంఎస్‌, ఇ-మెయిళ్లను పంపుతాయి. మీరు వాటిని గ‌మ‌నిస్తూ ఉండాలి.

సుర‌క్షిత నెట్‌వ‌ర్క్‌లో ఆన్‌లైన్ బ్యాంకింగ్‌: హోట‌ళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు మొద‌లైన ప‌బ్లిక్ నెట్‌వ‌ర్క్‌లో ఇంట‌ర్నెట్‌ని యాక్సెస్ చేస్తున్న‌ప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీల‌ను ఉప‌యోగించ‌కుండా ఉండండి. సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు ఇటువంటి స్థ‌లాలు స్పాట్‌లు కావ‌చ్చు. హ్యాక‌ర్లు అలాంటి నెట్‌వ‌ర్క్‌లో జ‌రిగే ఏదైనా లావాదేవీని ట్రాక్ చేయ‌గ‌ల‌రు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో, మీరు ప‌బ్లిక్ నెట్‌వ‌ర్క్‌ని ఉప‌యోగించి మీ బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేసి ఉంటే, మీరు సుర‌క్షిత‌మైన నెట్‌వ‌ర్క్‌లోకి వ‌చ్చిన వెంట‌నే పాస్‌వ‌ర్డ్‌ని మార్చేయండి.

డెబిట్‌, క్రెడిట్ కార్డ్‌ల‌ను ఉప‌యోగిస్తున్న‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించండి: మోస‌గాళ్లు ఏటీఎంలలో స్కిమ్మింగ్ ప‌రిక‌రాన్ని దాచిపెడ‌తారు. అటువంటి ఏటీఎంలో మీ కార్డ్‌ని స్వైప్ చేసిన‌ప్పుడు, మీ కార్డ్ వివ‌రాలు ఆ ప‌రిక‌రంలో నిల్వ అవుతాయి. మోస‌పూరిత లావాదేవీల కోసం మీ కార్డ్ న‌క‌లుని సృష్టించ‌డానికి దీనిని ఉప‌యోగిస్తారు. పీఓఎస్‌ వద్ద కార్డుని ఉప‌యోగిస్తున్న‌ప్పుడు జ‌రిగే అసాధార‌ణ సంఘ‌ట‌న‌ల‌ను గ‌మ‌నిస్తూ ఉండాలి.

చివ‌రిగా: పొదుపు ఖాతాదారుల‌కు వివిధ మోసాల గురించి ప్రాథ‌మిక అవ‌గాహ‌న చాలా అవ‌స‌రం. ఏదైనా ప‌రిస్థితుల్లో బ్యాంకింగ్ మోసానికి గురైతే, వెంట‌నే మీ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ కేర్‌ని సంప్ర‌దించండి. త‌దుప‌రి న‌ష్టాల‌ను నియంత్రించ‌డానికి మీ డెబిట్ కార్డ్‌, బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేయండి. మీకు జ‌రిగిన మోసం గురించి స‌కాలంలో బ్యాంకుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్ల‌యితే మీ డ‌బ్బుని తిరిగి పొందే లేదా మీ న‌ష్టాల‌ను త‌గ్గించుకునే అవ‌కాశాలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని