SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోయిందా? రెండే నిమిషాల్లో బ్లాక్ చేయండి!

ఐవీఆర్ సిస్ట‌మ్ ద్వారా ఇచ్చే సూచ‌న‌ల‌ను అనుస‌రిస్తే కార్డును బ్లాక్ చేయ‌డంతో పాటు కొత్త కార్డును పొంద‌చ్చు. 

Updated : 24 Dec 2021 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిత్యావ‌స‌ర వ‌స్తువుల ద‌గ్గ‌ర నుంచి పెట్రోల్ వ‌ర‌కు ఏది కొనుగోలు చేసినా కార్డుల‌తో పేమెంట్ చేసేస్తున్నారు. బ‌య‌ట‌కు వెళ్లాలంటే ప‌ర్సులో న‌గ‌దు మాటేమో గానీ, కార్డు మాత్రం త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. అనుకోకుండా కార్డు పోతే బ్యాంకుకు వెళ్లి కార్డు బ్లాక్ చేసే లోపు అందులో ఉన్న మొత్తం కాజేస్తారేమోననే భయం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ భ‌యం అవ‌స‌రం లేదు. నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కార్డును బ్లాక్ చేసే స‌దుపాయాన్ని ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు బ్యాంకులు అందిస్తున్నాయి. ఎస్‌బీఐ కూడా త‌మ వినియోగ‌దారుల‌కు ఈ సౌక‌ర్యాన్ని చాలా కాలం నుంచి అందిస్తోంది. ప్ర‌స్తుతం ఈ విధానాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తూ ఐవీఆర్ సిస్ట‌మ్ ద్వారా కార్డును సుల‌భంగా బ్లాక్ చేయ‌డంతో పాటు కొత్త కార్డును పొందే స‌దుపాయాన్ని అందిస్తోంది. ఇందుకోసం 1800 1234 నంబర్‌కు కాల్‌ చేయాలి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఈ స‌దుపాయం అందుబాటులో ఉండాలంటే ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ బ్యాంకు ఖాతాతో మొబైల్ నంబ‌ర్‌ను త‌ప్ప‌కుండా రిజిస్ట‌ర్ చేసుకోవాలి.

కార్డును ఎలా బ్లాక్ చేయాలి..?
*
ముందుగా రిజిస్ట‌ర్డ్‌ సెల్‌ఫోన్ నంబర్‌ నుంచి 1800 1234 టోల్‌-ఫ్రీ నంబ‌ర్‌కు డ‌యిల్ చేయాలి.


* కార్డు బ్లాక్ చేసేందుకు పై ప్రెస్ చేయాలి.
* ఇక్క‌డ మీకు రెండు ఆప్షన్లు క‌నిపిస్తాయి.
- రిజిస్ట‌ర్డ్‌ మొబైల్ నంబ‌రు, కార్డు నంబ‌రుతో కార్డు బ్లాక్ చేయాల‌నుకుంటే 1ని,
- రిజిస్ట‌ర్డ్‌ మొబైల్ నంబ‌రు, ఖాతా నంబ‌రుతో కార్డును బ్లాక్ చేయాలంటే 2ని ప్రెస్ చేయాలి.


* మీరు 1 ప్రెస్‌ చేసి రిజిస్ట‌ర్డ్‌ మొబైల్ నంబ‌రు, కార్డు నంబ‌రుతో కార్డు బ్లాక్ చేయాల‌నుకుంటే.. ఏటీఎమ్ కార్డు చివ‌రి 5 అంకెలను ఎంట‌ర్ చేసి, ధ్రువీకరించేందుకు 1 నొక్కాలి. ఇప్పుడు బ్లాక్ చేయాల్సిన ఏటీఎం కార్డు చివ‌రి 5 అంకెలను మ‌రోసారి ఎంట‌ర్ చేసి 2 నొక్కాలి. కార్డు చివ‌రి 5 అంకెలు మీకు గుర్తుంటేనే ఈ ఆప్ష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది.


* ఒక‌వేళ మీకు కార్డు చివ‌రి 5 నంబ‌ర్లు గుర్తులేక‌పోతే ఖాతా నంబ‌రుతో కూడా బ్లాక్ చేయొచ్చు. ఇందుకోసం 2 నంబ‌రును నొక్కి, ఖాతా నంబర్‌లోని చివరి ఐదు అంకెలను నమోదు చేసి, ధ్రువీకరించేందుకు 1ని నొక్కాలి. ఖాతా నంబ‌ర్‌లోని చివ‌రి ఐదు అంకెలను మ‌రోసారి ఎంట‌ర్ చేసి 2 నొక్కాలి.
* ఈ రెండింటిలో ఏది ఫాలో అయినా కార్డును బ్లాక్ చేయొచ్చు. విజ‌యంతంగా బ్లాక్ చేసిన‌ట్లు మీ ఫోన్‌కి మెసేజ్ వ‌స్తుంది.


* ఒక‌వేళ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఒక‌టి కంటే ఎక్కువ డెబిట్ కార్డులు లింక్ చేసి ఉంటే బ్లాకింగ్ కోసం మీ కాల్ ఎస్‌బీఐ ఏజెంట్‌కి బ‌దిలీ అవుతుంది.

కార్డుని రీప్లేస్ చేయాలంటే..
* కార్డు బ్లాకింగ్ పూర్త‌యిన త‌ర్వాత కొత్త కార్డు పొందాల‌నుకుంటే 1ని ప్రెస్‌ చేసి పుట్టిన తేదీ ఎంట‌ర్ చేయాలి. ధ్రువీకరించేందుకు 1, రిక్వెస్ట్ క్యాన్సిల్ కోసం 2 ప్రెస్ చేయాలి.


* కార్డు మీ రిజిస్టర్డ్ చిరునామాకి పంపుతారు. రీప్లేస్‌మెంట్ ఛార్జీలు వ‌ర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని