IRCTC: కోచ్‌ లేదా ట్రైన్‌ మొత్తం బుక్‌ చేసుకోవచ్చని తెలుసా?

Entire Train or coach booking: ఆధ్యాత్మిక పర్యటనకో, వివాహానికో వెళ్లాలనుకుంటున్నారా? అయితే, రైలు మొత్తం లేదంటే ఒకట్రెండు కోచ్‌లను బుక్‌ చేసుకోవచ్చని మీకు తెలుసా? 

Published : 27 May 2023 10:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐదారు కుటుంబాలు కలిసి ఏదైనా సుదూర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక యాత్ర చేయాలన్నా.. ఎవరైనా మిత్రుడి వివాహానికి ఆఫీసులో పనిచేసే వాళ్లందరూ వెళ్లాలన్నా ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఐదుగురో, పది మందో అయితే రైళ్లలో (Indian Railways) ముందస్తుగా టికెట్‌ రిజర్వ్‌ చేసి పెట్టుకోవచ్చు. కానీ పదుల సంఖ్యలో వెళ్లాలంటే మాత్రం ప్లాన్‌ చేసుకోవడం అంత సులభం కాదు. అలాంటి సందర్భాల్లో మీ మొత్తం కుటుంబ సభ్యుల కోసమో, స్నేహితుల కోసమో రైలు బోగీనే (coach) బుక్‌ చేసుకోవచ్చని తెలుసా? కావాలంటే ట్రైన్ (Train) మొత్తం బుక్‌ చేసుకోవచ్చు కూడా!! ఇంతకీ ఎక్కడ బుక్‌ చేసుకోవాలి? ఎలా బుక్‌ చేసుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కోచ్‌ లేదా రైలు మొత్తాన్ని బుక్‌ చేసుకోవడాన్ని ఫుల్ టారిఫ్ రేట్ (FTR) బుకింగ్ అంటారు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ ఎఫ్‌టీఆర్‌ వెబ్‌సైట్‌ను (IRCTC FTR website) సందర్శించాలి. ముందుగా మీ వ్యక్తిగత వివరాలతో సైనప్‌ అవ్వాలి. తర్వాత వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. లాగిన్‌ అయ్యాక మీరు కోచ్‌ లేదా ట్రైన్‌ను బుక్‌ చేసుకోవడానికి అక్కడ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. మీరు ఎక్కాలనుకుంటున్న స్టేషన్‌.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి? వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రైలు అందుబాటులో ఉంటే.. ఆన్‌లైన్‌లోనే పేమెంట్స్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏసీ ఫస్ట్‌ క్లాస్‌, ఏసీ- 2టైర్‌, ఏసీ-3 టైర్‌, స్లీపర్‌ క్లాస్‌.. ఇలా మనకు నచ్చిన కోచ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

ముఖ్యవిషయాలు..

  • కోచ్‌ను గానీ, రైలును గానీ గరిష్ఠంగా ఆరు నెలల ముందు గానీ, కనిష్ఠంగా 30 రోజుల ముందు బుక్‌ చేసుకోవచ్చు.
  • ఒక ట్రైన్‌లో గరిష్ఠంగా రెండు కోచ్‌లు బుక్‌ చేసుకోవచ్చు. కోచ్‌ను యాడ్‌ చేయడానికి, తొలగించడానికి వీలుగా 10 నిమిషాలు అంతకంటే ఎక్కువ సేపు ఆగే రైల్వేస్టేషన్లలో ఉన్న స్టేషన్ల నుంచే బుకింగ్‌కు అనుమతిస్తారు.
  • ఒకవేళ ట్రైన్‌ మొత్తం బుక్‌ చేయాల్సి వచ్చినప్పుడు కనిష్ఠంగా 18 కోచ్‌లు, గరిష్ఠంగా 24 కోచ్‌లకు అనుమతిస్తారు.
  • జర్నీ వివరాలు, రూట్లు, ఇతర వివరాలు అన్నీ సమర్పించాక ఆన్‌లైన్‌లో సెక్యూరిటీ డిపాజిట్‌ కింద ఒక్కో కోచ్‌కు రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుంది. 18 కోచ్‌లు ఉన్న రైలుకైతే రూ.9 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
  • సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించిన మొత్తం.. మీ ప్రయాణం పూర్తయ్యాక మీకు అందుతుంది.
  • కావాలంటే కోచ్‌ లేదా రైలు మొత్తానికి ఆహార సదుపాయం కూడా ఐఆర్‌సీటీసీ అందిస్తుంది.
  • ఈ రైళ్లలో ఎలాంటి రాయితీలు వర్తించవు.
  • కోచ్‌ లేదా ట్రైన్‌ బుకింగ్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే జోనల్‌ స్థాయిలో ఉన్న అధికారులు చర్యలు తీసుకుంటారు.
  • ఎఫ్‌టీఆర్‌ బుకింగ్‌ చేసేటప్పుడు సాంకేతిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు కోచ్‌ లేదా ట్రైన్‌ కేటాయిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని