Tax on rent: ఇల్లు ఖాళీగా ఉంటే అద్దె ప‌న్ను వ‌ర్తిస్తుందా?

ఇల్లు ఖాళీగా ఉన్న‌ప్ప‌టికీ దానిపై నోష‌న‌ల్ రెంట్‌ను లెక్కించి ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. 

Updated : 25 Nov 2021 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం పన్ను చెల్లింపుదారునికి రెండు కంటే ఎక్కువ ఇళ్లు ఉన్న‌ప్పుడు కొన్ని ష‌రతుల‌కు లోబ‌డి, ఏవైనా రెండు ఇళ్ల‌పై (నివ‌సిస్తున్న ఇంటితో స‌హా) మిన‌హాయింపు పొందొచ్చు. ఇత‌ర ఇంటి ఆస్తుల నుంచి వ‌చ్చే ఆదాయంపై ‘ఇంటి ఆస్తి నుంచి వచ్చే ఆదాయం’ పేరున ప‌న్ను చెల్లించాలి. రెండు ఇళ్ల‌ను స్వ‌యం ఆక్ర‌మిత ఆస్తిగా చూపించేందుకు అవ‌కాశం ఉంది. మూడు లేదా అంత‌కంటే ఎక్కువ ఇళ్లు ఉన్న‌ప్పుడు.. మూడో ఇంటి నుంచి వ‌చ్చే అద్దె ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఒక‌వేళ ఆయా ఇళ్లు ఖాళీగా ఉండి, ఎటువంటి అద్దె ఆదాయం లేక‌పోయిన‌ప్ప‌టికీ ప‌న్ను చెల్లింపుదారుడు నోష‌న‌ల్ రెంట్‌పై ప‌న్ను చెల్లించాల్సిందే. ఐటీ నిబంధనల ప్రకారం, స్వయం-ఆక్రమిత ఆస్తులు కాకుండా.. ఇత‌ర ఖాళీగా ఉన్న ఆస్తుల‌పై ప‌న్ను లెక్కించేందుకుగానూ ఇత‌ర ఆస్తుల‌ను డీమ్డ్ టు లెట్ అవుట్‌ (ఆదాయం ఉన్న‌ట్లు భావించ‌డం)గా పరిగణిస్తారు. దీని ప్రకారం, పన్ను చెల్లింపుదారులు అటువంటి ఆస్తులపై అతడు/ఆమె ఐటీఆర్‌లో నోషనల్ రెంట్‌ను నివేదించాలి. బ‌హుళ ఇంటి ఆస్తుల విష‌యంలో వివిధ ఇళ్ల నుంచి వ‌చ్చే అద్దెను లెక్కించి, ప‌న్నుచెల్లింపుదారుడు అత‌డు/ఆమెకు వర్తించే విధంగా ఐటీఆర్‌ ఫారమ్ 2/3/4లో విడివిడిగా ప్రకటించాలి. 

నోష‌న‌ల్ అద్దెను ఎలా లెక్కిస్తారు? 
సెక్షన్ 23(1)(ఎ) ప్రకారం.. ఆస్తి వార్షిక అద్దె విలువ ఆధారంగా డీమ్డ్ లేదా నోష‌న‌ల్ రెంట్ ఉంటుంది. ఫెయిర్ రెంట్, మున్సిప‌ల్ అద్దె విలువ‌, ప్రామాణిక అద్దె ఆధారంగా దీనిని లెక్కిస్తారు. వార్షిక అద్దె నుంచి మున్సిప‌ల్ ప‌న్నులు మిన‌హాయించుకోవ‌చ్చు.

ఫెయిర్ రెంట్.. ఆ ప్రాంతంలో అదే విధంగా ఉన్న ఇంటిపై వ‌చ్చే అద్దె ఆధారంగా ఫెయిర్ రెంట్‌ను నిర్ణ‌యిస్తారు. 
మున్సిప‌ల్ అద్దె విలువ‌.. ఆస్తిపై సంబంధిత మున్సిప‌ల్ అథారిటీ ఇచ్చే విలువ‌నే మున్సిప‌ల్ విలువగా నిర్ణ‌యిస్తారు. 
ప్ర‌మాణిక అద్దె.. అద్దె నియంత్ర‌ణ చ‌ట్టం (రెంట్ కంట్రోల్ యాక్ట్‌) కింద స్టాండ‌ర్డ్ రెంట్ స్థిరంగా ఉంటుంది. దీని ప్ర‌కారం య‌జ‌మాని ప‌రిమితికి మించి ఎక్కువ అద్దె వ‌సూలు చేసేందుకు వీలుండ‌దు.

అద్దెను అంచ‌నా వేసేందుకు ఫెయిర్ రెంట్, మున్సిప‌ల్ విలువ‌ల్లో ఏది ఎక్కువ‌గా ఉంటే అది ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఆ రెండింటిలో ఎక్క‌వగా ఉన్న‌ దానిని స్టాండ‌ర్డ్ రెంట్‌తో పోల్చిన‌ప్పుడు త‌క్కువ‌గా ఉన్న దానిని ప్రామాణికంగా తీసుకుంటారు. దీనిలోంచి మున్సిపల్‌ ప‌న్నును మిన‌హాయించి నోష‌న‌ల్ అద్దెను నిర్ణ‌యిస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు: ఒక అపార్ట్‌మెంట్ వార్షిక ఫెయిర్ రెంట్ రూ.2.50 లక్ష‌లు, మున్సిప‌ల్ విలువ రూ.1.90 లక్ష‌లు, ప్రామాణిక అద్దె రూ.3 ల‌క్ష‌లు అనుకుంటే.. నోష‌న‌ల్ అద్దె కోసం ముందుగా ఫెయిర్ రెంట్ రూ. 2.50 ల‌క్ష‌లు,  మున్సిప‌ల్ విలువ రూ. 1.90 ల‌క్ష‌ల‌లో ఫెయిర్ రెంట్ ఎక్కువ‌గా ఉంది కాబ‌ట్టి దీన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని స్టాండ‌ర్డ్ రెంట్ రూ.3 ల‌క్ష‌ల‌తో పోల్చి చూడాలి. ఈ రెండింటింలో ఫెయిర్ రెంట్ రూ. 2.50 ల‌క్ష‌లు త‌క్కువ‌గా ఉంది. కాబ‌ట్టి దీన్ని అద్దె అంచ‌నాగా తీసుకుంటారు. ఇందులో నుంచి మున్సిప‌ల్‌ ట్యాక్స్ రూ.20 వేలు మిన‌హాయింపు ల‌భిస్తే, ప‌న్ను చెల్లింపుల కోసం ప‌రిగ‌ణ‌నలోకి తీసుకునే వార్షిక అద్దె రూ. 2.30 లక్ష‌లుగా ఉంటుంది.

నివ‌సించే ఇంటిని ఎలా ఎంచుకోవాలి? 
2019 ముందు వ‌ర‌కు ఒక ఇంటిని మాత్ర‌మే స్వ‌యం ఆక్ర‌మిత ఆస్తిగా చూపించే అవ‌కాశం ఉండేది. రెండో ఇంటిపై నోష‌న‌ల్ రెంట్ చెల్లించాల్సి వ‌చ్చేది. అయితే బ‌డ్జెట్ 2019లో తీసుకొచ్చిన ప్ర‌తిపాద‌న ప్ర‌కారం రెండు ఇళ్ల‌ను స్వ‌యం ఆక్ర‌మిత ఆస్తిగా చూపించే వీలు క‌ల్పించారు. మూడో ఇంటిపై సంబంధిత ప‌న్ను వ‌ర్తిస్తుంది. 

స్వ‌యం ఆక్ర‌మిత ఆస్తి అంటే..
సెక్షన్ 23(2) ప్రకారం, ఇంటి య‌జ‌మాని, అతడు/ఆమె కుటుంబం నివసిస్తున్న ఇంటిని స్వ‌యం ఆక్ర‌మిత ఆస్తి అంటారు. అలాగే పూర్తిచేయాల్సిన ఇంటి రిపేర్లు, ఇత‌ర ప‌నుల‌ కార‌ణంగా య‌జ‌మాని, అతడు/ఆమె కుటుంబం ఇంటిలో నివ‌సించ‌కుండా వేరే అద్దె ఇంటిలో నివ‌సిస్తుంటే.. అప్పుడు కూడా ఆ ఇంటిని స్వ‌యం ఆక్ర‌మిత ఆస్తిగానే ప‌రిగ‌ణిస్తారు. నోష‌న‌ల్ రెంట్‌ను లెక్కించేప్పుడు ఆస్తి లేదా దానిలో కొంత భాగాన్ని విడిచిపెట్ట‌కూడ‌దు. 

ప‌న్ను చెల్లింపుదారుడు తాను నివ‌సించే ఇల్లు కాకుండా ఇత‌ర ఆస్తులను క‌లిగి ఉన్న‌ప్పుడు.. వారికి ఉన్న ఏ ఇంటినైనా స్వ‌యం ఆక్ర‌మిత ఆస్తిగా చూపించే అవ‌కాశం ఉంటుంది. ప‌న్ను త‌గ్గింపు కోసం అధిక వార్షిక అద్దె క‌లిగి ఉన్న ఇంటిని స్వ‌యం ఆక్ర‌మిత ఆస్తిగా చూపించ‌డం మంచిది. ఉదాహ‌ర‌ణ‌కు మీకు ఎ,బి,సి అని మూడు ఇళ్లు ఉన్నాయ‌నుకుందాం. ఇల్లు-A వార్షిక అద్దె రూ. 3 ల‌క్ష‌లు, ఇల్లు-B వార్షిక అద్దె రూ.2.5 ల‌క్ష‌లు, ఇల్లు-C వార్షిక అద్దె రూ.4 ల‌క్ష‌లు అనుకుంటే.. ఇల్లు- A, Cని స్వ‌యం ఆక్ర‌మిత ఆస్తిగా ఎంచుకుని,  ఇల్లు-Bని నోష‌న‌ల్ రెంట్ కోసం ఎంచుకోవ‌చ్చు.

స్థూల వార్షిక అద్దె నుంచి మున్సిపల్‌ పన్నులను తీసివేసిన తర్వాత నికర వార్షిక అద్దె విలువను లెక్కించాలి. ఇంటి యజమాని మున్సిప‌ల్ ప‌న్ను చెల్లించిన‌ప్పుడు మాత్రమే మినహాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఉమ్మడి ఆస్తుల విషయంలో, ఆస్తిలోని వారి సంబంధిత వాటాలకు ఆధారంగా, ఆస్తి వాటాదార్లంద‌రికీ నోషనల్ అద్దె వ‌ర్తిస్తుంది. త‌ద‌నుగుణంగా పన్ను చెల్లించాలి. అదే విధంగా, వారి వాటా మున్సిపల్‌ పన్నులను పన్నులను మాత్ర‌మే మిన‌హాయించుకోవ‌చ్చు.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు