ఆరోగ్య బీమా పాలసీని రద్దు చేయడం సాధ్యమేనా?

మీరు పాలసీ పత్రాలను స్వీకరించినప్పటి నుంచి ఈ ఫ్రీ-లుక్ విండో తెరచి ఉంటుంది

Published : 20 Dec 2020 19:58 IST

జీవిత బీమా పాలసీలు ఫ్రీ లుక్ పీరియడ్ ను కలిగి ఉంటాయనే విషయం చాలామందికి తెలిసుండొచ్చు. మీరు పాలసీ డాక్యుమెంట్ ను స్వీకరించినప్పటి నుంచి 15 రోజుల పాటు దానిని సమీక్షించడానికి సమయం ఉంటుంది. ఒకవేళ మీరు సదరు పాలసీ విషయంలో అసంతృప్తితో ఉన్నట్లయితే, పాలసీని బీమా సంస్థకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. పాలసీని తిరిగిచ్చే సమయంలో బీమా సంస్థ మీ పై ఎలాంటి ఒత్తిడి చేయరు. ఈ విధానం అన్ని బీమా పాలసీలకు వర్తిస్తుంది. కాబట్టి మీరు పాలసీ పత్రాలను పొందిన వెంటనే దానిని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకోవడం ముఖ్యం. అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీలు - ఆసుపత్రిలో చెల్లించే నష్టపరిహార కవరేజ్, క్లిష్టమైన అనారోగ్య పాలసీలు, వ్యక్తిగత ప్రమాదం వంటి నిర్వచించిన ప్రయోజన ప్లాన్లు కనీసం ఒక సంవత్సర కాలపరిమితితో కవర్ అవుతాయి. ఇది 15 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ను కలిగి ఉంటుంది. మీరు పాలసీ పత్రాలను స్వీకరించినప్పటి నుంచి ఈ ఫ్రీ-లుక్ విండో తెరచి ఉంటుంది, కొన్ని బీమా సంస్థలు పాలసీని పంపిణీ చేసిన రోజు నుంచి 30 రోజుల వరకు ఈ విండోను తెరిచే ఉంచుతాయి. ఒకవేళ మీరు పాలసీని తిరిగి ఇవ్వాలనుకుంటే, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు, బీమా కోసం వెచ్చించిన ఛార్జీలు, ఏదైనా వైద్య పరీక్షలకు వెచ్చించిన మొత్తాన్ని బీమా సంస్థ తీసివేసి మిగిలిన ప్రీమియంను మీకు చెల్లిస్తుంది.

వార్షిక ఆరోగ్య బీమా ఒప్పందాల సందర్భంలో, మీరు పాలసీని కొనుగోలు చేసే సమయంలో తీసుకోవలసిన వైద్య పరీక్షల ఖర్చులో కనీసం 50 శాతంను బీమా సంస్థ చెల్లించవలసి ఉంటుంది. బీమా సంస్థ మీ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా తెలుసుకోడానికి వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. కొన్ని బీమా సంస్థలు మాత్రం పూర్తి మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకుంటారు. అయితే, ఒకవేళ బీమా సంస్థ పాలసీని తిరస్కరించినట్లయితే, వైద్య పరీక్షల వ్యయాన్ని పాలసీదారుడు చెల్లించవలసి ఉంటుంది.

మీరు పాలసీ పత్రాలను స్వీకరించినప్పుడు, మీ ఆరోగ్య బీమా పాలసీ యాక్టీవ్ లో ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలి. అయితే, మొదటి నెలలో మీరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి దానికి సంబంధించిన క్లెయిమ్ ను బీమా సంస్థకు ఇచ్చినట్లయితే, చాలా బీమా సంస్థలు వాటిని పరిగణలోకి తీసుకోవు. దీనినే ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ అని పిలుస్తారు. కానీ అనుకోకుండా జరిగే ప్రమాదాలను బీమా సంస్థలు పరిగణిస్తాయి. ఒకవేళ మీరు ప్రమాదానికి సంబంధించిన క్లెయిమ్ దాఖలు చేస్తే, బీమా సంస్థలు డబ్బును చెల్లిస్తాయి.

పాలసీని తిరిగి ఇవ్వడానికి అనుసరించాల్సిన ప్రక్రియను కింద తెలియచేస్తున్నాము:

  1. మీరు పాలసీ పత్రాలను స్వీకరించిన వెంటనే వాటిని జాగ్రత్తగా చదవండి.

  2. ఫ్రీ - లుక్ పీరియడ్ లో పాలసీని తిరిగి ఇవ్వాలనుకున్నట్లైతే, కస్టమర్ కేర్ కి కాల్ చేయడం, ఈ - మెయిల్ పంపడం, మీ ఏజెంట్ ను సంప్రదించడం, బీమా సంస్థకి లేఖ రాయడం వంటివి చేయాలి. ఫోన్ కాల్, ఈ - మెయిల్, బీమా సంస్థను సందర్శించడం లాంటివి చేయడం వలన ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.

  3. బీమా సంస్థ ఆమోదం తెలిపిన 7 రోజుల్లోగా డబ్బును తిరిగి మీకు చెల్లిస్తుంది.

  4. మీరు కేవలం ఫ్రీ - లుక్ పీరియడ్ లో మాత్రమే పాలసీని రద్దు చేయగలరు. కానీ దానిని పోర్ట్ చేయలేరు. పునరుద్ధరణ సమయంలో మాత్రమే పాలసీని పోర్ట్ చేయడం సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని