ITR Filing: ఐటీ రిటర్నుల ఫైలింగ్‌.. రిఫండ్స్‌ విషయంలో ఈ తప్పులొద్దు!

IT Refunds: ఐటీ రిటర్నులు ఫైల్‌ చేశారా? రిఫండ్‌ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. రిఫండ్ల కోసం ఆన్‌లైన్‌లో స్టేటస్‌ ఎలా చెక్‌ చేయాలి? రీ ఇష్యూ కోసం ఏం చేయాలి? వంటి వివరాలు తెలుసుకోండి.

Updated : 01 Aug 2023 19:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నులు (ITR Filing) దాఖలు చేయడానికి ఇచ్చిన గడువు ముగిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ దాదాపు ఆరున్నర కోట్ల మంది రిటర్నులు దాఖలు చేశారు. ముందుగా రిటర్నులు దాఖలు చేసిన కొందరికి రిఫండ్‌లు కూడా క్రెడిట్‌ అవుతున్నాయి. ఒకవేళ రిఫండ్‌ కోసం మీరూ ఎదురుచూస్తుంటే దానికంటే ముందు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏవైనా పొరపాట్లు చేస్తే రిఫండ్లు ఆలస్యం అవ్వడం లేదా పూర్తిగా నిలిచిపోయే అవకాశమూ ఉంది. ఇంతకీ రిటర్నులు ఫైల్‌ చేసిన తర్వాత ఏం చేయాలి? ఒకవేళ నిలిచిపోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

రిఫండ్‌ ఎవరికి?

పన్ను చెల్లించిన సంవత్సరానికి గానూ చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువ మొత్తం పన్ను చెల్లించిన వారు రిఫండ్‌ మొత్తానికి అర్హులు. వారికి ఆదాయపు పన్ను శాఖ ఆన్‌లైన్‌లో నిర్దేశిత బ్యాంకు అకౌంట్లకు రిఫండ్‌ మొత్తాన్ని జమ చేస్తుంది.

ఎన్ని రోజులు..?

సాధారణంగా ఐటీఆర్‌ దాఖలు చేసిన 20 నుంచి 45 రోజుల్లో ఆదాయపు పన్ను శాఖ రిఫండ్లను ప్రాసెస్‌ చేస్తుంది. కొందరికి 10-14 రోజుల్లోనే రిఫండ్‌ వస్తుంది. ఒకవేళ ముందుగా ఐటీఆర్‌ ఫైల్‌ చేసిన వారికి, ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఐటీఆర్‌ సమర్పించిన వారికి, ముందుగా ఐటీఆర్‌ను వెరిఫై చేసిన వారికి వేగంగా రిఫండ్లు రావడానికి అవకాశం ఉంటుంది.

ఈ తప్పులు చేయొద్దు..

 • చాలా మంది గడువు తేదీ కంటే ముందే ఐటీఆర్‌లు దాఖలు చేసినా దాన్ని వెరిఫై చేయడంలో ఆలస్యం చేస్తుంటారు. వాస్తవానికి ఐటీఆర్‌ వెరిఫై చేసిన తర్వాతే రిఫండ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
 • మీ రిటర్నులు ఐటీ శాఖ ప్రాసెస్‌ చేయకపోయినా రిఫండ్‌ ఆలస్యం కావొచ్చు. కాబట్టి రిఫండ్‌ ప్రాసెస్‌ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి.
 • ఒకవేళ ఏదైనా కారణంతో రిఫండ్‌ హోల్డ్‌లో గానీ, ఫెయిల్‌ గానీ అయితే.. ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో రిఫండ్‌ కోసం రీ ఇష్యూను కోరవచ్చు.
 • ఒకవేళ తప్పుడు లేదా చెల్లుబాటులో లేని బ్యాంక్‌ ఖాతా వివరాలు ఇచ్చినట్లయితే రిఫండ్‌ నిలిచిపోయే అవకాశమూ ఉంటుంది. అప్పుడు రిఫండ్‌ రీ ఇష్యూ కోరుతూ సరైన బ్యాంక్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
 • కొన్ని సార్లు రిఫండ్‌ విషయంలో ఐటీ శాఖ అదనపు పత్రాలు కావాలని కోరొచ్చు. అందుకోసం ట్యాక్స్‌పేయర్లకు ఆ విషయాన్ని ఐటీ శాఖ తెలియజేస్తుంది. నిర్దేశించిన సమయంలో ఆ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం ఎలా?

 • ముందుగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఇ-పైలింగ్‌ ట్యాక్స్‌ పోర్టల్‌కు వెళ్లండి
 • యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ వంటి వివరాలతో లాగిన్‌ అవ్వండి
 • మై అకౌంట్‌ అనే సెక్షన్‌లోకి వెళ్లండి
 • అందులో రిఫండ్‌/ డిమాండ్‌ స్టేటస్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. 
 • అక్కడ మీకు మదింపు సంవత్సరం, స్టేటస్‌, పేమెంట్‌ మోడ్‌ కనిపిస్తాయి. ఒకవేళ రిఫండ్‌ ఫెయిల్‌ అయితే కారణం సైతం కనిపిస్తుంది.

రీ ఇష్యూ కోసం..

 • ముందుగా ఆదాయపు పోర్టల్‌కు లాగిన్‌ అవ్వాలి.
 • సర్వీసెస్‌లో ఉన్న రిఫండ్‌ రీ-ఇష్యూ ఆప్షన్‌ ఎంచుకోవాలి.
 • ఇప్పుడు క్రియేట్‌ రిఫండ్‌ రీ-ఇష్యూ రిక్వెస్ట్‌పై క్లిక్‌ చేయాలి.
 • రిఫండ్‌ రీ ఇష్యూకు సంబంధించిన వివరాలు అక్కడ కనిపిస్తాయి.
 • తర్వాత రిఫండ్‌ క్రెడిట్‌ చేయాల్సిన బ్యాంకు ఖాతాను ఎంచుకోవాలి.
 • ఆ తర్వాత వెరిఫై ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆధార్‌తో లింకైన రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేస్తే ఇ-వెరికేషన్‌ పూర్తవుతుంది.
 • అప్పుడు రీ-ఇష్యూ కోసం అభ్యర్థన సబ్మిట్‌ చేసినట్లు మెసేజ్‌ వస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని