ITR filing: ఆన్‌లైన్‌లోనే రీఫండ్ స్టేట‌స్ చెక్ చేయండిలా..

రీఫండ్ క్లెయిమ్ చేయాలంటే రిట‌ర్నులు దాఖ‌లు చేయడం తప్పనిసరి. 

Updated : 15 Feb 2022 12:38 IST

పన్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో చెల్లించాల్సిన ప‌న్ను కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించిన‌ట్ల‌యితే.. అద‌నంగా చెల్లించిన మొత్తాన్ని ఐటీ శాఖ రీఫండ్ చేస్తుంది. ఐటి రిట‌ర్నులు దాఖ‌లు చేసి రీఫండ్ పొంద‌వ‌చ్చు. రిట‌ర్నులు ఫైల్ చేసేట‌ప్పుడు ఆదాయం, త‌గ్గింపు వివ‌రాలు, సంబంధిత డాక్యుమెంటేష‌న్ రుజువుల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, రీఫండ్ కోసం రిట‌ర్ను దాఖ‌లు చేసే స‌మ‌యంలో బ్యాంకు ఖాతా వివ‌రాలు ఐఎఫ్ఎస్‌సి కోడ్‌తో స‌హా ఇవ్వాలి. రీఫండ్ క్లెయిమ్ చేయాలంటే రిట‌ర్నులు ఫైల్ చేయడం తప్పనిసరి. 

రిటర్న్‌లు దాఖలు చేసిన తర్వాత, ఐటీ శాఖ వాటిని వెరిఫై చేసి రీఫండ్ పొందేందుకు అర్హులైన వారిని గుర్తిస్తుంది. ప‌న్ను చెల్లింపుదారులు రిట‌ర్నుల‌ను ఈ-వెరిఫై చేసిన త‌ర్వాత మాత్ర‌మే ఐటి శాఖ రీఫండ్ ప్రాసెస్ మొద‌ల‌వుతుంది. సాధారణంగా, ఈ-వెరిఫికేష‌న్ పూర్తి చేసిన 20-60 రోజుల లోపు మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్ర‌వ‌రి 7 వ‌ర‌కు 1.87 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ. 1.67 లక్షల కోట్లకు పైగా రీఫండ్‌లను జారీ చేసిన‌ట్లు ఐటి శాఖ తెలిపింది. మ‌రి మీకూ రీఫండ్ వ‌చ్చిందా?స్టేట‌స్ ఎలా చెక్ చేసుకోవాలి?ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆన్‌లైన్ ద్వారా రీఫండ్ స్టేట‌స్ చెక్ చేసుకునే విధానం..
ప‌న్ను చెల్లింపుదారులు పాన్ నంబ‌రు ద్వారా ఆన్‌లైన్‌లో రీఫండ్ స్టేట‌స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. ఇందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒక‌టి.. కొత్త ఐటీ ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్, రెండు.. ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్. ఈ రెండు విధానాల‌లోనూ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌చ్చు.

* ముందుగా ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్‌కి వెళ్లాలి. 
* యూజ‌ర్ ఐడి(పాన్ నెంబ‌రు), పాస్వ‌ర్డ్‌, క్యాప్చాను ఎంట‌ర్ చేసి లాగిన్‌ అవ్వాలి.
* ఈ-ఫైల్ ట్యాబ్‌లో ఉన్న 'ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్' ఆప్ష‌న్‌ను ఎంచుకొని.. వ్యూ రిట‌ర్న్స్‌/ఫారంపై క్లిక్ చేయాలి.
* మీరు తెలుసుకోవాల‌నుకుంటున్న అసెస్‌మెంట్ సంవ‌త్స‌రాన్ని ఎంచుకొని స‌బ్మిట్‌పై క్లిక్ చేస్తే సంబంధిత రిట‌ర్న్ స్టేట‌స్‌ను స్క్రీన్‌పై చూడొచ్చు. 

ఎన్ఎస్‌డీఎల్ పోర్ట‌ల్ ద్వారా..
రీఫండ్ ట్రాక్ చేయడానికి ఉన్న మ‌రో మార్గం ఎన్ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌.. 
* ముందుగా వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి పాన్, ఆధార్, అసెస్‌మెంట్ ఇయర్ (ఎవై) వంటి వివరాలను పూరించండి. 
* వివరాలను సమర్పించిన తరువాత, 'కంటిన్యూ' పై క్లిక్ చేయండి. 
* మీ ఆదాయపు పన్ను స్టేట‌స్‌ కంప్యూటర్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది.

గడువు తేదీ లోపు రిటర్న్ ఫైల్ చేసిన వారికి మాత్రమే రీఫండ్ వర్తిస్తుందని గమనించండి. వీలైనంత త్వరగా రిటర్న్ ఫైల్ చేస్తే త్వరగా రిఫండ్ కూడా పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని