ట‌ర్మ్ ఇన్సూరెన్స్‌లో రైడ‌ర్‌లు ఎలా ఎంపిక చేసుకోవాలి?

ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఇత‌ర జీవిత బీమా ప్లాన్‌ల‌తో పోలిస్తే త‌క్కువ‌ ప్రీమియంతో ల‌భించే సుల‌భ‌మైన జీవిత బీమా ప‌థ‌కాలు.

Updated : 25 Jan 2022 12:47 IST

జీవిత బీమా విష‌యంలో చాలామంది ట‌ర్మ్ బీమానే ఎంచుకుంటున్నారు. త‌క్కువ ఖ‌ర్చుతో అధిక బీమా ఇవ్వ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. ఇపుడు చాలా మంది ఎండోమెంట్, హోల్ లైఫ్, యూలిప్, మనీ బ్యాక్ లాంటి పాల‌సీల‌ను క‌ట్ట‌లేకుండా ఉన్నారు. ప్రీమియం ఎక్కువ, దీనిపై వ‌చ్చే బోన‌స్‌పై కూడా వినియోగ‌దారులు అంత‌గా ఆస‌క్తి చూప‌ట్లేదు. అధిక బీమా అందించే ట‌ర్మ్ ఇన్సూరెన్స్‌నే ఇష్ట‌ప‌డుతున్నారు.

స‌రైన ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవ‌డ‌మే కాకుండా రైడ‌ర్‌ల‌ను ఎంచుకోవ‌డంతో పాటు ప్లాన్ హామీ మొత్తం, కాల‌వ్య‌వ‌ధిని ఆలోచించి ఎంపిక చేసుకోవాలి. ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఇత‌ర జీవిత బీమా ప్లాన్‌ల‌తో పోలిస్తే త‌క్కువ‌ ప్రీమియంతో ల‌భించే సుల‌భ‌మైన జీవిత బీమా ప‌థ‌కాలు. ఒక వ్య‌క్తి అకాల మ‌ర‌ణం విష‌యంలో ఈ ప్లాన్‌లు ఆ కుటుంబ స‌భ్యుల‌కు ఆర్ధిక ర‌క్ష‌ణ అందించి ఆ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకుంటాయి. అవ‌స‌రాలు, స్థోమ‌త ఆధారంగా ఎంచుకోవ‌డానికి వివిధ ర‌కాల ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఉన్నాయి.

లెవెల్ ట‌ర్మ్ ప్లాన్‌లుః

భార‌త్‌లో చాలా బీమా సంస్థ‌లు అందించే డిఫాల్ట్ జీవిత బీమా క‌వ‌రేజీ ఒక స్థాయి ట‌ర్మ్ ప్లాన్‌. ఈ ర‌క‌మైన ప్లాన్‌లో, పాల‌సీ ప్రారంభంలో ఎంచుకున్న హామీ మొత్తం పాల‌సీ వ్య‌వ‌ధి అంత‌టా స్థిరంగా ఉంటుంది. ఈ ట‌ర్మ్ ప్లాన్‌ను కొనుగోలు చేసేట‌పుడు మీ వ‌య‌స్సు ఎంత త‌క్కువ‌గా ఉంటే మీరు క‌ట్టే ప్రీమియం అంత త‌క్కువ ఉంటుంది.

ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పెంపుః

పాల‌సీ ట‌ర్మ్‌లోని నిర్ధిష్ట పాయింట్ల వ‌ద్ద మీ హామీ మొత్తాన్ని పెంచుకునే సదుపాయాన్ని ఈ ప్లాన్ అందిస్తుంది. ఈ పెరుగుద‌ల రేటు ముందుగా నిర్ణ‌యించ‌బ‌డుతుంది. మీరు భ‌విష్య‌త్తులో మీ ఆర్ధిక బాధ్య‌త‌ల‌లో గ‌ణ‌నీయ‌మైన పెరుగుద‌ల‌ను ఆశించిన‌ట్ల‌యితే, పెరుగుతున్న ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవ‌డం మంచిది.

ట‌ర్మ్ ఇన్సూరెన్స్ తగ్గింపుః

ట‌ర్మ్ ఇన్సూరెన్స్‌ని పెంచ‌డం కాకుండా, ఈ సంద‌ర్భంలో ఇన్సూరెన్స్ చేయించిన‌ వ్య‌క్తి వ‌య‌స్సు పెరిగే కొద్దీ  బీమా మొత్తం ముందుగా నిర్ణ‌యించిన రేటుతో త‌గ్గుతుంది. వ‌య‌స్సు పెరిగే కొద్దీ ఆ వ్య‌క్తి బాధ్య‌త‌లు త‌గ్గ‌వ‌చ్చు. అంతేకాకుండా అధిక హామీ మొత్తం అవ‌స‌రం త‌గ్గ‌వ‌చ్చు అనే కాన్స‌ప్ట్‌తో ఇది ప‌నిచేస్తుంది.

క‌న్వ‌ర్ట‌బుల్ ట‌ర్మ్ ప్లాన్‌లుః

క‌న్వ‌ర్ట‌బుల్ ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది త‌ర్వాత ద‌శ‌లో మ‌రొక ర‌క‌మైన బీమా ప్లాన్‌గా మార్చ‌బ‌డే పాల‌సీ. రాబోయే సంవ‌త్స‌రాల్లో మీ ఆర్ధిక ప్రాధాన్య‌త‌లు మార‌తాయ‌ని మీరు భావించిన‌ట్ల‌యితే మీరు దీన్ని ఎంచుకోవ‌చ్చు.

ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో రైడ‌ర్స్ అని పిలువ‌బ‌డే వివిధ ర‌కాల యాడ్‌-ఆన్ ప్ర‌యోజ‌నాల‌తో వ‌స్తాయి. అద‌న‌పు ప్రీమియంలు చెల్లించ‌డం ద్వారా రైడ‌ర్‌లు అద‌న‌పు ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

ప్రీమియం వేవర్ రైడ‌ర్ః

ఏదైనా వైక‌ల్యం కార‌ణంగా సంపాద‌న ఆగిపోతే ఆ కాలంలో ప్రీమియంలు చెల్లించ‌లేరు. ఇలాంటి స‌మ‌యాల్లో ఈ రైడ‌ర్‌ని క‌లిగి ఉన్న‌ట్ల‌యితే, మీ పాల‌సీ వ్య‌వ‌ధిలో వైక‌ల్యం ఏర్ప‌డిన‌పుడు త‌ర్వాత చెల్లించే ప్రీమీయంలు మాఫీ చేయ‌బ‌డ‌తాయి.

యాక్సిడెంట‌ల్ డెత్ బెనిఫిట్ రైడ‌ర్ః

బీమా చేయ‌బ‌డిన వ్య‌క్తి ప్ర‌మాదం కార‌ణంగా మ‌ర‌ణిస్తే, రైడ‌ర్ అద‌న‌పు హామీ మొత్తాన్ని కుటుంబ స‌భ్యుల‌కు (నామినీకి) చెల్లిస్తారు.

యాక్సిల‌రేటెడ్ డెత్ బెనిఫిట్ రైడ‌ర్ః

ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్య‌క్తి ప్రాణాంత‌క వ్యాధితో బాధ‌ప‌డుతుంటే ఈ రైడ‌ర్‌తో అనారోగ్యంగా ఉన్న వ్య‌క్తి పాక్షిక అడ్వాన్స్ మొత్తాన్ని పొందుతారు.  ఆ వ్య‌క్తి జీవించి ఉండ‌టానికి 12 నెల‌ల కంటే త‌క్కువ స‌మ‌యం ఉంటే.. చికిత్స‌కు, జీవించి ఉండ‌టానికి అవ‌స‌ర‌మైన ఖ‌ర్చుల కోసం ఈ డ‌బ్బులు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఆ వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత ఇన్సూరెన్స్ డ‌బ్బులు మిగిలిన మొత్తం కుటుంబానికి (నామినీకి) ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ రైడ‌ర్ః

బీమా చేసిన వ్య‌క్తికి పాల‌సీలో పేర్కొన్న తీవ్ర‌మైన అనారోగ్యం ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయితే, బీమా కంపెనీలు ఏక మొత్తాన్ని చెల్లిస్తాయి. ఈ రైడ‌ర్‌ని ఎంచుకునే స‌మ‌యంలో ఏ అనారోగ్యాలు క‌వ‌ర్ చేయ‌బ‌డ‌తాయో, మిన‌హాయింపుల‌లో ఏవి భాగ‌మో తెలుసుకోవ‌డానికి పాల‌సీ డాక్యుమెంట్‌ని చ‌దివి అర్ధం చేసుకోవాలి.

స‌రైన ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌, రైడ‌ర్‌ల‌ను ఎంచుకోవ‌డ‌మే కాకుండా, ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ స‌మ్ అష్యూర్డ్, కాల‌వ్య‌వ‌ధిని ఆలోచించి ఎంచుకోవ‌డం చాలా ముఖ్యం. మీరు ఆశించే హామీ మొత్తం మీ వార్షిక జీతానికి 10-15 రెట్లు ఉండాల‌ని ఇన్సూరెన్స్ నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని