Cash Flow Management: ఖ‌ర్చుల‌ను నియంత్రించండి.. పొదుపు ప్రారంభించండి!

ఆర్థిక ప్ర‌ణాళిక‌ను ప్రారంభించేందుకు ముందు స‌రైన‌ న‌గ‌దు నిర్వ‌హ‌ణ చాలా ముఖ్యం.  

Updated : 08 Jan 2022 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స‌రైన‌ న‌గ‌దు నిర్వ‌హ‌ణ ఉంటే ఎటువంటి అవ‌స‌రానికైనా చేతిలో డ‌బ్బు ఉంటుంది. డ‌బ్బు సంపాదించ‌డం, స‌మ‌యానికి అన్ని బిల్లులూ చెల్లించ‌డం అనేది న‌గ‌దు నిర్వ‌హ‌ణ కాదు. అది కేవ‌లం జీవనం కొన‌సాగించ‌డం. డ‌బ్బు ఎలా సంపాదిస్తున్నారు? ఎలా ఖ‌ర్చు చేస్తున్నారు? ఆర్థిక స్థితితో సంతోషంగా ఉన్నారా? లేదా? అన్న‌ది ముఖ్యం. ఈ నాలుగు అంశాలు ఆర్థిక నిర్వ‌హ‌ణ‌లో కీల‌క పాత్ర పోషిస్తాయి. 

1. ఆదాయ మార్గాలు: వేత‌నం రూపంలో గానీ, సొంతంగా వ్యాపారం చేయ‌డం, ఇంటి అద్దె, పెట్టుబ‌డుల నుంచి ఆదాయం వ‌స్తుంది. కొన్ని సంద‌ర్భాల్లో.. అంటే ఎక్కువ గంట‌లు ప‌నిచేయ‌డం, పార్ట్ టైమ్ జాబ్ చేయ‌డం, లేదా ఎక్కువ రాబ‌డినిచ్చే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌డం ద్వారా మ‌రింత ఆదాయాన్ని స‌మ‌కూర్చుకోవ‌చ్చు.

2. త‌ప్ప‌ని ఖ‌ర్చులు: నిత్యావ‌స‌ర ఖ‌ర్చులు త‌ప్ప‌నిస‌రి. అంటే అద్దె, ఈఎమ్ఐ, ర‌వాణా, స్కూల్ ఫీజులు, విద్యుత్ బిల్లు, మొబైల్ బిల్లు, ఆహార ఖ‌ర్చులు వంటివి ప్ర‌తినెలా ఉంటాయి. త‌ప్పించుకునేందుకు వీలుండ‌దు. అయితే, కావాల‌నుకుంటే ఇందులో కూడా కొంత‌వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు. చిన్న అపార్ట్‌మెంట్‌కి, త‌క్కువ అద్దె ఉన్న ఇంటికి మారడం, అవ‌స‌రం లేక‌పోతే ఫ్యాన్, లైట్లు స్విచ్‌ ఆఫ్‌ చేయడం, బ‌య‌ట చిరుతిళ్లు త‌గ్గించ‌డం వంటి మార్గాల ద్వారా కొంత ఖ‌ర్చును త‌గ్గించుకోవ‌చ్చు.

3. విచ‌క్ష‌ణ‌తో కూడిన ఖ‌ర్చులు: ఖ‌ర్చులపై నియంత్ర‌ణ ఉండాలి. కొంతమంది అవ‌స‌రం లేక‌పోయినా.. స‌ర‌దా షాపింగ్ పేరుతో ఎడాపెడా కొనేస్తూ ఉంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఆన్‌లైన్‌లో బ్రాండెడ్‌ బ‌ట్ట‌ల పేరుతో ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయ‌డం, వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫ‌ర్ల పేరుతో ఉచితంగా ఇచ్చే దానికోసం అవ‌స‌రం లేక‌పోయినా కొనుగోలు చేయ‌డం లాంటి ఖ‌ర్చులు. ఇటువంటివి నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. 
 
4. పొదుపు: మీరు క్ర‌మానుగ‌తంగా పొదుపు చేస్తున్నారా, లేదా? డ‌బ్బు మిగిలిన‌ప్పుడు పొదుపు చేస్తున్నారా? చూసుకోవాలి. పొదుపు చేస్తే మీతో పాటు కుటుంబానికి ఆర్థిక ర‌క్ష‌ణ ఉంటుంద‌న్న విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎంచుకున్న పొదుపు విధానం కూడా భ‌ద్ర‌త‌కు, లాభాల‌కు హామీనిస్తుంది.

చివ‌రిగా: న‌గ‌దు నిర్వ‌హ‌ణ‌కు ముందు మీ ఆదాయం, ఖ‌ర్చుల వివ‌రాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పొదుపు కోసం కొంత డ‌బ్బును తీసి ప‌క్క‌న పెట్టాలి. పొదుపు చేసేంత డ‌బ్బు లేద‌ని మీకు అనిపించినప్పుడు వేతనం రాగానే ఎంతోకొంత ఇత‌ర ఖాతాల‌కు బ‌దిలీ చేయ‌డం అల‌వాటు చేసుకోండి. ప‌రిస్థితి నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చిన త‌ర్వాత‌ పెట్టుబ‌డులు ప్రారంభించ‌వ‌చ్చు. స‌రైన న‌గ‌దు నిర్వ‌హ‌ణ పెట్టుబ‌డుల‌కు మూలం అనేది గుర్తుంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని