యులిప్‌ తీసుకుంటుంటే..

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అందుబాటులోకి వచ్చిన యూనిట్‌ ఆధారిత బీమా పాలసీల(యులిప్‌)ను అర్థం చేసుకోవడంలో చాలామంది పొరపాటు చేశారు​​​​​​...

Updated : 02 Jan 2021 13:20 IST

పెట్టుబడి, జీవిత బీమా అనగానే వెంటనే స్ఫురణకు వచ్చేవి యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు. ఒకప్పుడు వీటిపై ఎంతో మోజు ఉండేది. కారణాలేమైతేనేమి తర్వాత కాలంలో వీటిపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీమా అవసరాన్ని గుర్తించడం, మార్కెట్‌ వృద్ధి దశలో కొనసాగుతుండటంతో చాలామంది ఇప్పుడు వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అందుబాటులోకి వచ్చిన యూనిట్‌ ఆధారిత బీమా పాలసీల(యులిప్‌)ను అర్థం చేసుకోవడంలో చాలామంది పొరపాటు చేశారు. దీంతో స్వల్పకాలంలోనే అధిక లాభాలు సంపాదించొచ్చనే ఆశతో చాలామంది ఈ పాలసీలను ఎంచుకున్నారు. అప్పట్లో మార్కెట్లో నెలకొన్న అనిశ్చితితో తమ పెట్టుబడుల విలువ తగ్గడంతో చాలామంది వీటి నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం రావడం, మార్కెట్‌లో సానుకూలతలు పెరగడంతో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరిగింది. నేరుగా ఈక్విటీల్లో మదుపు చేసేవారితోపాటు, యులిప్‌ల వైపు దృష్టి సారిస్తున్నవారూ అధికం అవుతున్నారు.

అవగాహనతోనే…

మార్కెట్‌ ఆధారిత పథకాల్లో మదుపు చేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. యులిప్‌ల విషయంలోనూ ఇవి వర్తిస్తాయి. ఐఆర్‌డీఏ ఈ పాలసీలపై అనేక నిబంధనలు విధించింది. దీంతో రుసుములు తదితర విషయాల్లో ఇవి మరింత మెరుగ్గా అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ మీ అవసరాలకు తగిన పాలసీని ఎంచుకునేప్పుడు వీటి పనితీరుపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే పెట్టుబడులకు, జీవిత బీమాకూ ఉపయోగపడే యులిప్‌లు మంచి ప్రయోజనం అందిస్తాయి.

యులిప్‌లు మార్కెట్‌ ఆధారంగా పనిచేస్తాయి. కాబట్టి, ఇందులో నష్టభయానికి ఆస్కారం ఉంటుంది. పాలసీదారులు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇతర పెట్టుబడులు, ఆర్థిక స్తోమత, ప్రస్తుత ఆదాయం, జీవన శైలి, భవిష్యత్తు లక్ష్యాల ఆధారంగా ఎంత నష్టం వచ్చినా భరించగలం అనే లెక్క వేసుకోవాలి.

ఈ పాలసీలు పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ఎంత రాబడి వస్తుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు పాలసీదారులు తెలుసుకునే వీలుంటుంది. పాలసీదార్ల నుంచి సమీకరించిన సొమ్మును ఎక్కడెక్కడ పెట్టుబడి పెడుతున్నారనే విషయంలోనూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటారు. దీనివల్ల పాలసీని ఎంచుకున్న వారికి తమ మదుపు మొత్తం గురించి నిరంతరం సమాచారం అందుబాటులో ఉంటుందన్నమాట.

మార్కెట్లో రోజువారీ హెచ్చుతగ్గులు సహజం. యులిప్‌లు దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలు. కాబట్టి, వీటికి ఏడాదికోసారి క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించడం వల్ల క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) మాదిరిగానే పనిచేస్తుంది. ఎంత దీర్ఘకాలం ఇందులో కొనసాగితే… అంత మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుందని మర్చిపోకూడదు.

మార్చుకుంటే మంచి ఫలితం:

యులిప్‌లలో పెట్టుబడికోసం ఎన్నో రకాల ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి బీమా కంపెనీని బట్టి, పాలసీరకాన్ని బట్టి మార్పులు ఉండవచ్చు. పాలసీదారుల లక్ష్యం, నష్టభయాన్ని భరించే సామర్థ్యం, వ్యవధి ఆధారంగా ఏ ఫండ్లలో మదుపు చేయాలన్నది నిర్ణయించుకోవాలి. పదవీ విరమణ ప్రణాళికలు, పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, వారి వివాహాలు, సంపద సృష్టి తదితర అనేక లక్ష్యాల సాధనకు యులిప్‌లు ఉపయోగపడతాయి.

మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఒక ఫండ్‌ నుంచి మరో ఫండ్‌కు మారేందుకు పాలసీదారులకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. దీనికి ఎలాంటి పరిమితులూ ఉండవు. డెట్‌ నుంచి ఈక్విటీలకు, లేదా ఈక్విటీల నుంచి డెట్‌కు మీ పెట్టుబడులను మార్చుకోవడం ద్వారా నష్టభయాన్ని పరిమితం చేసుకునేందుకు వీలుంటుంది. కనీసం 12-15 నెలలకోసారైనా మీ ఫండ్ల పనితీరును సమీక్షించుకోవడం ఉత్తమని నిపుణుల సూచన.

అయితే, ఈ ఫండ్ల మార్పులు మీ జీవితంలోని దశలను బట్టి ఉండాలి. పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న వ్యక్తి తన పెట్టుబడులను డెట్‌ ఫండ్లలోకి మళ్లించడం మంచిది. యువకులు తమ పెట్టుబడులను దీర్ఘకాలిక దృష్టితో ఈక్విటీ ఫండ్లలో కొనసాగించవచ్చు. యులిప్‌లకు చెల్లించే ప్రీమియానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ ప్రకారం మినహాయింపు వర్తిస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… యులిప్‌ల కనీస వ్యవధి ఐదేళ్లు. అంటే, కచ్చితంగా ఈ వ్యవధికి ప్రీమియం చెల్లించాలన్నమాట. ఐదేళ్ల తర్వాత మీకు ఆర్థికంగా ఏదైనా అవసరం ఉంటే పాక్షికంగా కొంత సొమ్మును వెనక్కి తీసుకునే వీలు కల్పిస్తాయి. కాబట్టి, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి యులిప్‌లు మంచి మదుపు సాధనంగానే పేర్కొనవచ్చు.

ఈక్విటీ మార్కెట్లపై సరైన అవగాహన లేని వారు ఈక్విటీ, డెట్‌, నగదు ఫండ్లలో మదుపు చేసే యులిప్‌లను ఎంచుకోవడం మేలు. వీటిలో ఏ ఫండ్లలో ఎంత శాతం మదుపు చేయాలన్నది మీరే స్వయంగా నిర్ణయించుకోవచ్చు.

పాలసీ తీసుకునేప్పుడు మీరు ఎంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధమో ఆ విలువకే తీసుకోవాలి. పన్ను తగ్గించుకునే లక్ష్యంతో పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే… భవిష్యత్తులో వాటిని కొనసాగించడం కష్టం కావొచ్చు. కొత్త నిబంధనల ప్రకారం ఒక ఏడాది ప్రీమియం చెల్లించకున్నా పాలసీ రద్దవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

బీమా రక్షణ, పెట్టుబడికి అవకాశం ఒకేచోట ఉండాలని భావించేవారికి యులిప్‌లు ఎంతో అనుకూలం. పాలసీ తీసుకునేప్పుడు విధించే రుసుములు, అందించే ప్రయోజనాలు, పరిమితులు అన్నీ చూసుకోవాలి. అప్పుడే అది దీర్ఘకాలంలో మీకు ఉపయోగపడే మదుపు సాధనం అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని