జాగ్ర‌త్త‌గా ఉప‌యోగిస్తే.. ప్ర‌యోజ‌నాలే ఎక్కువ‌

క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగిస్తే, రుణాల ఊబిలో చిక్కుకు పోతామ‌ని భావిస్తుంటారు చాలామంది, కానీ స‌రైన విధంగా ఉప‌యోగిస్తే ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. 

Updated : 06 Feb 2021 17:32 IST

క్రెడిట్ కార్డ్ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. తెలివిగా ఉపయోగిస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. మనమున్న పరిస్థితుల‌కు అనుగుణంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆకస్మికంగా ఆసుపత్రిలో చేరడం వంటి అత్యవసర అవసరాలు. వడ్డీ గురించి సరైన అవగాహన లేకుండా ఇష్టానుసారం ఉపయోగిస్తే ఇబ్బందులకు గురికాక తప్పదు. 

క్రెడిట్ కార్డులను రెండు రకాలుగా వినియోగించుకోవచ్చు. ప్రాథమిక వినియోగం,  రెండు రివార్డ్ పాయింట్లు పొందేందుకు. వినియోగదారులు కూడా వేరు వేరు రకాలుగా ఉన్నారు.   క్రెడిట్ కార్డును బిల్లును, కొంతమంది సమయం చేరువయ్యే వరకు వేచివుండి, అప్పుడు చెల్లిస్తారు. మరికొందరు కార్డు వినియోగించిన వెంటనే చెల్లిస్తారు. 

కొందరు గడువు తేదీకి ముందే ఆటోమేటెడ్ చెల్లింపులను ఏర్పాటు  చేసుకుని, వీలైనంత వరకు కార్డును ఉపయోగిస్తుంటే, ఇంకొంద‌రు రెండిటింని మిళితం చేస్తారు. వీరి వ‌ద్ద‌ అత్యవసర పరిస్థితులలో, ఎప్పుడైనా ఉపయోగించేందుకు ఒక కార్డు, రివార్డ్ పాయింట్ల కోసం మరొక కార్డు ఉంటాయి. 

క్రెడిట్ కార్డు పేరు చెప్ప‌గానే కొంత మంది చాలా భ‌య‌ప‌డుతుంటారు. క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగిస్తే, రుణాల ఊబిలో చిక్కుకు పోతామ‌ని భావిస్తుంటారు. కానీ స‌రైన విధంగా ఉప‌యోగిస్తే, క్రెడిట్ కార్డుతో ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. 

ఈ కింది అంశాల‌ను దృష్టిలో ఉంచుకుని క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగిస్తే, అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 

శ‌క్తి మేర‌కే ఖ‌ర్చుపెట్టండి..
క్రెడిట్ కార్డు ఉపయోగించడం ప్రారంభించే ముందు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశం ఇది. సాధార‌ణంగా క్రెడిట్ కార్డ్ పరిమితి మీ జీతం కంటే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ,  రాబోయే నెల‌ జీతం నుంచి కొంత మొత్తాన్ని తీసుకుని చెల్లించే విధంగా బిల్లు ఉండాలి. ఎక్కువ ప‌రిమితి ఉంది క‌దా అని ఖ‌ర్చు చేయ‌కూడ‌దు. గ‌డువు తేది లోపు బిల్లు చెల్లించ‌క‌పోతే వ‌ర్తించే వ‌డ్డీల‌తో మీ రుణ భారం ఎక్క‌వైపోతుంది. ఉదాహ‌ర‌ణ‌కి, క్రెడిట్ కార్డుతో మొబైల్ కొనుగోలు చేయాల‌నుకుంటే, వ‌చ్చే నెల జీవితంతో ఆ బిల్లు మొత్తం చెల్లించ‌గ‌లిగితేనే కొనుగోలు చేయాలి. 

పూర్తిగా చెల్లించండి..
నెలవారీ బిల్లును పూర్తిగా చెల్లించడం మంచింది. ఒక నెల బిల్లును మరో నెలకు బదిలీ చేస్తే, ప్రతి నెల బదిలీ చేసే మొత్తంపై 2 నుంచి 3.5 శాతానికి(వార్షికంగా 24 నుంచి 42 శాతం వరకు )  పైగా వడ్డీ పడుతుంది. బ్యాంకులో వేసే ఫిక్సిడ్ డిపాజిట్లపై మీకు అంత వడ్డీరాదు. కానీ మీరు చెల్లించాల్సి క్రెడిట్ కార్డుపై మాత్రం ఎక్కువ వడ్డీ ఎందుకు చెల్లించాలి. అందువల్ల సమయం లోపుల క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లించడం శ్రేయస్కరం. 

ఈఎమ్ఐ, రుణాలు తీసుకుంటున్నారా..ఒకసారి ఆలోచించండి..
సాధారణంగా ఖరీదైన వస్తువులు, నగలు కొనుగోలు చేయాలంటే చాలా మందికి కష్టమే. సులభమైన వాయిదా పద్దతులలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం చాలా మంది క్రెడిట్ కార్డును ఆశ్ర‌యిస్తుంటారు. ఈ మొత్తాన్ని ఈఎమ్ఐగా, రుణంగా గానీ మార్చుకుంటారు. అయితే  వార్షిక వడ్డీ 12 నుంచి 25 శాతం వరకు వర్తించే అవకాశమున్నందున ఈఎమ్ఐ లేదా రుణం తీసుకునే ముందు వడ్డీ ఎంత పడుతుందో తెలుసుకోండి. చాలా సంస్థలు నో-కాస్ట్ ఈఎమ్ఐను ఆఫర్ చేస్తున్నాయి. కానీ నిజానికి నో-కాస్ట్ ఈఎమ్ఐలో కూడా వడ్డీ చెల్లించాల్సిందే.  వడ్డీ మొత్తాన్ని అమ్మకందారులు డిస్కౌంట్ రూపంలో అందిస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే, వడ్డీ మొత్తాన్ని డిస్కౌంట్ రూపంలో చెల్లించినప్పటికీ, ఈఎమ్ఐ వడ్డీపై వర్తించే జీఎస్టీ(ప్రస్తుతం 18 శాతంగా ఉంది) మీ నెలవారి చెల్లింపుకు కలుపుతారు. ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్య చెల్లింపు రుసుము, ఓవర్ లిమిట్ ఫీజులు వంటి ఇతర రుసుములు ఉండనే ఉన్నాయి. అందువల్ల ఈఎమ్ఐ లేదా రుణం తీసుకునే ముందు ఈ వివరాలను దృష్టిలో ఉంచుకోవాలి. మీ బకాయిలకు అనుగుణంగా క్రెడిట్ పరిమితిని ఈఎమ్ఐ తగ్గిస్తుంది. 

నో కాస్ట్ ఈఎమ్ఐ గురించి తెలుసుకునేందుకు ఈ కింది క‌థ‌నాన్ని చ‌ద‌వండి
నో కాస్ట్ ఈఎంఐ గురించి మీకు తెలుసా? 

అనుకూలమైన సమయం కోసం వేచిచూడడం:
ఖరీదైన ఫోన్ లేదా టాబ్ కొనుగోలు చేసేందుకు మీ వద్ద డబ్బు ఉంటే, ఆ మొత్తాన్ని ఖర్చుచేసేందుకు కొంచెం వేచి ఉండండి. సరైన సమయంలో క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేయండి. ఇక్కడ సరైన సమయం అంటే, మీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సిన‌ తేది దగ్గర పడుతుంటే, మీ వద్ద ఉన్న మొత్తంతో బిల్లు చెల్లించి, తరువాత క్రెడిట్ కార్డు ద్వారా మీకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా బిల్లు చెల్లించడానికి మరో 36 నుంచి 45 రోజుల సమయం(మీ బ్యాంక్ నియమాల ప్రకారం వర్తించే కాలవ్యవధి ప్రకారం) ఉంటుంది. ఈ లోపు కావ‌ల‌సిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకునే అవ‌కాశమూ ఉంటుంది. 

రివార్డు పాయింట్లు కాంప్లెమెంట‌రీ మాత్ర‌మే..
దాదాపు అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్ల‌ను ఇస్తున్నాయి.  కొత్త‌గా కార్డు తీసుకున్న వారికి స్వాగ‌తం రివార్డులు, వెబ్‌సైట్‌లో సైన్ అప్ చేసినందుకు, పెట్రోల్‌, కిరాణ‌, ప్ర‌యాణం, హోట‌ల్ బ‌స మొద‌లైన కొనుగోళ్ళ‌కు, ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్ద‌దే ఉంది. నిర్ధిష్ట బ్యాంకు క్రెడిట్ కార్డును ఉప‌యోగించి కొనుగోలు చేసే వ‌స్తువుల‌పై కొన్ని సార్లు అద‌న‌పు త‌గ్గింపును పొంద‌వ‌చ్చు. రివార్డు పాయింట్ల‌ను విశ్లేషించ‌డం మ‌ర్చిపోవ‌ద్దు, ఎంత మొత్తంలో కొనుగోలు చేస్తే, ఎన్ని పాయింట్లు వ‌స్తాయి. ఒక రివార్డు పాయింటు ఎన్ని రూపాయిల‌కు స‌మానం, రీడీమ్ చేయు విధానం, ప‌రిమితులు త‌దిత‌ర విష‌యాల‌ను నిర్ధారించుకోవాలి. రోజు వారీగా ఖ‌ర్చు పెట్టిన మొత్తంపై వ‌చ్చిన రివార్డు పాయిట్ల‌ను స్టోర్ చేసుకోండి. అవ‌స‌ర‌మైతే కొనుగోళ్లు చేయాలి త‌ప్ప రివార్డు పాయింట్ల కోసం మాత్రం కొనుగోలు చేయ‌కూడ‌దు.  రివార్డు పాయింట్ల‌ను పొందడం సంతోష‌మే కావ‌చ్చు, కానీ భారీ రాబ‌డిని మాత్రం పొంద‌లేరని గుర్తించుకోండి. 

స‌రైన కార్డును ఎంచుకోవాలి..
అన్ని బ్యాంకులు ఒకేవిధంగా రివార్డు పాయింట్ల‌ను అందించ‌వు. ఒక కార్డు ఇంధ‌న కొనుగోళ్ల‌కు ఎక్కువ పాయింట్ల‌ను ఇస్తే, మ‌రో కార్డు కిరాణా, ఎయిర్ టిక్కెట్ హోట‌ల్ బుకింగ్స్ వంటి వాటికి ఎక్కువ రివార్డు పాయింట్లు అంద‌వ‌చ్చు. అందువ‌ల్ల మీరు ఎక్క‌డ ఎక్కువ ఖ‌ర్చు చేస్తారో తెలుసుకోండి. దాని ప్ర‌కారం కార్డును ఎంచుకోవ‌డం ద్వారా ఎక్కువ రివార్డు పాయింట్ల‌ను పొంద‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు, మీ వ్యాపారం, ఉద్యోగ కార్య‌క‌లాపాల‌కు ఎక్కువ‌గా కారు లేదా బైక్ ఉప‌యోగిస్తున్నారనుకుంటే, ఇంద‌న కొనుగోళ్ల‌కు ఎక్కువ రివార్డు పాయింట్ల‌ను ఇచ్చే కార్డును తీసుకోవ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. కొన్ని ప్రీమియం క్రెడిట్ కార్డులు ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్ర‌యాల‌లో ఉచిత విఐపి లాంజ్ యాక్సిస్‌ను అందిస్తున్నాయి. 

స్వాగ‌త, ప్ర‌చార‌ ఆఫ‌ర్లు..
వార్షిక రుస‌ముల‌తో వ‌చ్చే ప్రీమియం క్రెడిట్ కార్డులు అద్భుత‌మైన వెల‌క‌మ్ బోన‌స్‌లు, భారీ రివార్డు పాయింట్లు, గిఫ్ట్ ఓచ‌ర్ల‌‌తో వ‌స్తున్నాయి. కొన్నిసార్లు ప్ర‌చారంలో భాగంగా త‌గ్గింపులు, రివార్డుల‌ను అందిస్తున్నాయి. అలాంటి ఆఫ‌ర్ల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. 

పండుగ ఆఫ‌ర్లు:
పండుగ సీజ‌న్లలో మ‌రిన్ని ఆఫ‌ర్లుతో వ‌స్తున్నాయి.  ప్ర‌త్యేకించి ఆన్‌లైన‌ల్‌లో వ‌స్తువులు కొనుగోలు చేసేవారికి క్యాష్ బ్యాక్‌, డిస్కౌంట్‌ల‌తో పాటు రివార్డు పాయింట్లు అందుబాటులో ఉంటున్నాయి. కొన్ని క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి చెల్లిస్తే, కొనుగోలు ధ‌ర‌పై 10శాతం వ‌ర‌కు డిస్కౌంటును ఇస్తున్నాయి. 

సాధార‌ణ రోజుల్లోనూ..
నిర్ధిష్ట బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌పై సాధార‌ణ రోజుల్లోనూ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు అందుబాటులో ఉంటున్నాయి. షాపింగ్ చేసే స‌మ‌యంలో వీటిని ఉప‌యోగించి లాభం పొందొచ్చు.

పాయింట్లను కలపండి..
ఒక బ్యాంకుకు సంబంధించి ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్న‌ట్ల‌యితే, వాటిలో సేక‌రించిన రివార్డు పాయింట్ల‌ను క‌ల‌పండి. త‌ద్వారా పాయింట్ల‌ను రిడీమ్ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. 

గ‌డ‌వు తేది..
గ‌డువు తేది చూడ‌డం అన్నింటికంటే ముఖ్యం. చాలా మంది శ్ర‌ధ్ద‌గా  రివార్డు పాయింట్ల‌ను సేక‌రిస్తారు. అయితే గ‌డువు తేదిని మ‌రిచిపోతుంటారు. దీంతో అంతా క‌ష్ట‌ప‌డి చేసిన‌దంతా వృదా అవుతుంది. అందువ‌ల్ల గ‌డువు తేది కంటే ముందుగానే రివార్డు పాయింట్ల‌ను రిడీమ్ చేసుకోవాలి. గ‌డువు ముగిసే స‌మ‌యానికి ఏదైనా వ‌స్తువ‌ను కొనుగోలు చేసేందుకు కావ‌ల‌సిన పాయింట్లు లేక‌పోతే న‌గ‌దు రూపంలో రీడీమ్ చేసుకోవ‌చ్చు. దాదాపు అన్ని కార్డుల‌లో ఈ సౌక‌ర్యం అందుబాటులో ఉంది. రివార్డు పాయింట్ల‌ను న‌గ‌దు రూపంలో మార్చుకుని త‌రువాత ఏదైనా వ‌స్తువు కొనుగోలు చేసేందుకు గానీ, మీ క్రెడిట్ కార్డు బిల్లులో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు గానీ ఉప‌యోగించుకోవ‌చ్చు.

 పైన‌  తెలిపి‌న అంశాల‌ను గుర్తించుకుని  క్రెడిట్ కార్డును ఉప‌యోగించ‌డం ద్వారా అధిక ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని